చెట్టు దిగిన  చిక్కుముడి

24 Apr, 2019 02:11 IST|Sakshi

ఒకరికి ప్రశ్నించే హక్కుందనిదానికి జవాబివ్వాల్సిన బాధ్యతఇంకొకరికి ఉండదు.అలాగని చిక్కుముడి ప్రశ్నకుచటుక్కున ఆన్సర్‌ ఇవ్వలేకపోతే..మనకే అదోలా ఉంటుంది.ఈ థీమ్‌ని పట్టుకుని అద్భుతంగా అల్లిన ప్రశ్నావళికిసమాధానాల సరళే.. బేతాల్‌!

‘విక్రమ్‌ ఔర్‌ బేతాల్‌’ కథల సీరీస్‌ను రామాయణాన్ని తీసిన రామానంద్‌సాగర్‌ తన సాగర్‌ ఆర్ట్స్‌ లిమిటెడ్‌ ద్వారా 1985లో బుల్లితెర ద్వారా పరిచయం చేశారు. దాదాపు 52 నిమిషాల నిడివిగల ఈ సీరియల్‌ హిందీ, గుజరాత్‌ భాషలలో మొత్తం 26 ఎపిసోడ్లుగా ప్రసారమైంది. 

కథల పుట్టుక
మహాకవి సోమ్‌దేవ్‌ భట్టు 2,500 ఏళ్ల క్రితం కథాసరిత్సాగరంలో చోటుచేసుకున్న‘బేతాల్‌ పచ్చీసి’ కథలే ఈ విక్రమ్‌ ఔర్‌ బేతాల్‌ కథలకు మూలం. భూతాలకు అధిపతి అయిన బేతాలుడు రాజు విక్రమాదిత్యునికి చెప్పిన కథలివి. విక్రమాదిత్యుడు ఉజ్జయిని రాజు. ఈ రాజుకు ఒక భిక్షువు ప్రతీ రోజు ఒకపండును కానుకగా ఇచ్చి వెళుతుండేవాడు. ఆ భిక్షువు ఇచ్చిన ఫలం కోశాగారంలో భద్రపరుస్తుండేవారు. కొన్నాళ్లు గడిచాక సందేహం వచ్చి ఒక పండును కోయగా దాని నుంచి ఒక విలువైన రత్నం బయటపడుతుంది. రాజు అప్పటి వరకు తీసుకున్న ఫలాలన్నింటినీ తెప్పించి సగానికి కోయగా ఎన్ని ఫలాలు ఉన్నాయో అన్ని రత్నాలు బయటపడతాయి. మరుసటి రోజు ఆ భిక్షువు యధాప్రకారం రాజుకు ఫలాన్ని ఇవ్వబోగా దీనికి కారణమేంటో వివరిస్తేనే తీసుకుంటానని చెబుతాడు. దీంతో ఆ భిక్షువు మంత్రసిద్ధి కోసం తనకొక వీరుని సాయం అవసరమని, అది మీరే అని చెబుతాడు.

దాంతో ఆ భిక్షువుకి సాయపడతానని విక్రమాదిత్యుడు మాట ఇస్తాడు. దాంట్లో భాగంగానే భిక్షువు రాబోయే అమావాస్య ముందు రోజు అర్ధరాత్రి రాజును శ్మశానానికి వచ్చి కలవమంటాడు. అలాగే అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లిన రాజును ఆ భిక్షువు శ్మశానంలో చెట్టుకు వేలాడుతున్న ఒక పురుష శవాన్ని తీసుకొచ్చి తనకు అప్పగించమని కోరుతాడు. ఆ ప్రయత్నంలో శవాన్ని తన వద్దకు తెచ్చేంతవరకూ మౌనం పాటించమని రాజుకు సూచిస్తాడు. ఆ భిక్షువు చెప్పిన విధంగా చెట్టుకు వేలాడుతున్న శవాన్ని దించి భుజం మీద మోసుకొని మౌనంగా వస్తుండగా ఆ శవాన్ని ఆవహించిన బేతాళుడు రాజుకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక కథను చెప్పి, ఆ కథ చివరలో ఒక చిక్కు ప్రశ్న వేసి దానికి సరైన జవాబు తెలిసీ చెప్పకపోతే తల పగిలి ఛస్తావని హెచ్చరిస్తాడు.

విక్రమార్కుడు సరైన సమాధానం చెప్పడంతో మౌనభంగం అయిన బేతాలుడు అదృశ్యమై శవం తిరిగి చెట్టుకు వేలాడుతుంది. దీంతో రాజు ఆ శవాన్ని పట్టి తేవడం కోసం మళ్లీ మరుసటి అర్ధరాత్రి వెళ్లి ప్రయత్నిస్తాడు. ఈ విధంగా ప్రతీసారి రాజు శవాన్ని మోసుకురావడానికి ప్రయత్నించడం, ఆ శవాన్ని ఆవహించిన బేతాళుడు చిక్కుముడులతో ఉన్న కథలను వరుసగా 25 రాత్రుళ్ళు చెబుతాడు. ప్రతి కథ చివరలో రాజుకు బేతాళుడు ప్రశ్న వేయడం, అతను వాటికి సరైన సమాధానం ఇవ్వడం, తిరిగి బేతాళుడు అదృశ్యం అయ్యి శవం చెట్టుకు వేళ్లాడ్డం, రాజు మళ్ళీ పట్టు విడవకుండా బేతాళుని కోసం ప్రయత్నించడం జరుగుతూనే ఉంటుంది. 

కథ ముగిసిన తీరు
చివరకు 25వ కథలోని చిక్కుప్రశ్నకు విక్రమార్కుడికి సమాధానం తెలియక మౌనంగా ఉంటాడు. అప్పుడు బేతాళునితో జరిగిన సంభాషణలో భిక్షువు కపట క్షుద్ర తాంత్రిక సిద్ధుడు అని తెలుస్తుంది విక్రమార్కుడికి. అతను తననే బలి ఇచ్చే కుటిల పన్నాగాన్ని పన్నాడని తెలుసుకుంటాడు. శవాన్ని భుజం మీదుగా వేసుకొని విక్రమాదిత్యుడు భిక్షువు వద్దకు వస్తాడు. భిక్షువు తాంత్రిక పూజలు చేసి రాజును బలి ఇవ్వాలని అనుకుంటాడు. అయితే, ముందే ఈ ప్రమాదాన్ని గ్రహించిన రాజు ఆ కపట తాంత్రికుని శిరస్సును ఖండించి బేతాళుడికి అర్పిస్తాడు. ప్రసన్నుడైన భేతాళుడు విక్రమాదిత్యుడిని భూమండలానికి చక్రవర్తి కాగలవని దీవిస్తాడు. విక్రమార్కుని ద్వారా ‘బేతాళ పంచవింశతి’ పేరుతో ఈ కథలు ప్రపంచమంతటా తెలు స్తాయి. ఇదీ మూల కథ.
 
బేతాళుడు చెప్పిన కథలు మొదటి ఎపిసోడ్‌ కథ
విధివశాత్తూ భర్త, సోదరుడు ఒకేసారి మరణించి వారి తలలు, మొండేలు వేరై తారుమారుగా అతికించబడతాయి. పునర్జీవులైన భర్త, సోదరులలో తిరిగి ఎవరిని భర్తగా, ఎవరిని సోదరుడిగా స్వీకరించాలో తెలియక అయెమయంలో పడిన ఒక యువతికి ఎదురైన ధర్మ సంకటం గురించిన కథ ఇది.‘వారిద్దరిలో ఎవరు ఆమెకు భర్త?’ అడుగుతాడు విక్రమార్కుడిని బేతాళుడు. ఇది ఆ రాజును అడిగిన ప్రశ్న కాదు ప్రేక్షకులను అడిగిన ప్రశ్న. అతనా సమాధానం కోసం ఆలోచనలో పడగా ..‘మనిషి దేహాన్ని నియంత్రణ చేసేది మెదడు. కాబట్టి మెదడు ఉన్న తలకే ఆమె వరమాల’ అని చెబుతాడు రాజు. \

రెండవ ఎపిసోడ్‌ కథ
మహారాజు రూపసేనుడి ప్రాణాలను రక్షించడం కోసం అతని బంటు అయిన వీరవరుడు ప్రాణత్యాగానికి సిద్ధపడతాడు. ఇది తెలిసిన అతని కుటుంబం అంతా ఒకరి తర్వాత ఒకరు ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధపడతారు. విషయం తెలిసిన రాజు రూపసేనుడు వీరవరుడిని రక్షించాల్సిన బాధ్యత తనదేనని, దేవతకు తనే ఆహారం అవ్వాలని నిశ్చయించుకొని రాజ్యాన్ని వదిలి గుహకు చేరుకుంటాడు. అప్పటికే వీరవరుడు దేవతకు ఆహారం అవుతాడు. అతని విశ్వాసానికి దేవత ఎనలేని సంపదను అనుగ్రహిస్తుంది.‘విధులను నిర్వర్తించడంలో వీరవరుడు, రూపసేనుడు ఇద్దరిలో ఎవరు గొప్ప’ అని ప్రశ్నిస్తాడు బేతాళుడు. ‘రాజును కాపాడడం బంటుగా వీరవరుడి విధి.

అది గొప్ప కాదు. తనకు అవసరం లేకపోయినా మానవత్వంతో ఒకరి ప్రాణాలని కాపాడాలని నిశ్చయించుకున్న రాజు తన ప్రాణాలను త్యాగం చేయడం గొప్ప’ అని చెబుతాడు విక్రమార్కుడు. ఇలాంటి చిక్కుముడుల కథలు ఈ సీరియల్‌లో మరో 23 ఉన్నాయి. దెయ్యాల కథలు, రాజుల కథలు అంటే అందరికీ ముఖ్యంగా పిల్లలకు ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వాటిని పట్టువదలకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి మెప్పించింది దూరదర్శన్‌. ఇప్పటికీ నాటి పిల్లల కళ్లముందు ఆ కథలు దృశ్యరూపకంగా కదలాడుతూనే ఉండటం విశేషం.

– ఎన్‌.ఆర్‌
►రామానంద్‌సాగర్‌ రామాయణానికి రెండేళ్ల ముందుగానే ‘విక్రమ్‌ ఔర్‌ బేతాల్‌’ సీరియల్‌ని అందించారు  
►రామాయణం సీరియల్‌ ద్వారా యావత్‌ భారతదేశానికి సుపరిచితుడైన అరుణ్‌గోవిల్‌ ఈ సీరియల్‌లో విక్రమాదిత్యుని పాత్ర పోషించారు
►రామాయణంలో సీతగా నటించిన దీపికా చికాలియా బేతాల్‌ కథలలోని చాలా పాత్రలలో నటించారు
►బేతాళుడిగా బాలీవుడ్‌ స్టేజ్‌ యాక్టర్‌ సజ్జన్‌లాల్‌ పురోహిత్‌ నటించారు. సజ్జన్‌ ఆ తర్వాత బాలీవుడ్‌ సినిమాలోనూ నటించారు
►తర్వాతి కాలంలో వచ్చిన బేతాళుడి యానిమేటెడ్‌ మూవీస్‌కి, ధారావాహికలకు 80ల కాలం నాటి ‘విక్రమ్‌ ఔర్‌ బేతాల్‌’ సీరియలే స్ఫూర్తి.

మరిన్ని వార్తలు