ఆదికవి... ఆదర్శకావ్యం

15 Oct, 2016 22:42 IST|Sakshi
ఆదికవి... ఆదర్శకావ్యం

రామాయణం, మహాభారతం భారతీయుల జీవనంతో ముడివేసుకుని అవిచ్ఛిన్నంగా ప్రయాణం సాగిస్తున్నాయి. విరగకాచిన చెట్లకొమ్మల్లో ఫలాలను తిని తన్మయత్వంతో పాడే కోయిలలా, రాముడి గురించి తెలుసుకున్న వాల్మీకి పరవశంతో మధురమైన అక్షరాలతో రామాయణాన్ని గానం చేశాడు. తమసానదీ తీరంలో వాల్మీకి నోటి వెంట వెలువడిన తొలి శ్లోకాన్ని మొట్టమొదట విన్నవాడు  శిష్యుడు భరద్వాజుడు. గురువర్యా! ఈ శ్లోకం రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా,  పదే పదే మననం చేసుకోవడానికి సులభంగా ఉందే అని భరద్వాజుడు పులకింతల్లో మునిగిపోతాడు.

 

ధర్మం కోసం, ధర్మనిష్ట లో జరిగే సంఘర్షణ లో మంచివైపు నిలబడడం కోసం, ఆడిన మాట తప్పకుండా ఉండడం కోసం, స్నేహం విలువ తెలుసుకోవడం కోసం, అన్నదమ్ముల అనురాగాల సౌధాల కోసం, ఒక్క మాటలో చెప్పాలంటే రామరాజ్యం కోసం రామాయణాన్ని చదవాలి. వాల్మీకి మహర్షి హృదయాన్ని అర్థం చేసుకోవాలి. కవిగా వాల్మీకి భారతీయ సాహిత్యానికి దారిదీపం. మబ్బులు, కొండలు, కోనలు, చెట్లు, పూలు, పక్షులు యావత్ ప్రపంచాన్ని ఒక్క అక్షరం ఎక్కువ - తక్కువ కాకుండా తన రచనలో అద్దం పట్టడంలో వాల్మీకికి సాటిరాగల వారులేరు. ఉపమా కాళిదాసస్య అని అలంకారాల్లో తనదైన ముద్రవేసిన కాళిదాసాదులు వాల్మీకి చూపిన బాటలో నడిచినవారే. మానసిక ప్రవృత్తులు, అంతర్మథనాలు, ధర్మాధర్మ విచక్షణ మీద వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు వాల్మీకి హిమవత్పర్వతం కంటే ఎత్తులో ఉంటాడు.


వాల్మీకి ఆదికవి - రామాయణం ఆదికావ్యం. ప్రపంచ ఇతిహాసాల్లో రామాయణం ఎప్పటికీ చర్చనీయాంశమే. యుగాలు మారుతున్నా, కాలధర్మాలు మారుతున్నా, జీవన వేగం రాకెట్లతో పోటీ పడుతున్నా వాల్మీకి రామాయణం నిలిచి వెలుగుతూనే ఉంది. ధర్మ పరాయణులకు దారిచూపుతూనే ఉంది. మిన్ను విరిగి మీద పడ్డా ధర్మాన్ని వదలకుండా ఎందుకు నిలబడాలో చెబుతూనే ఉంది.


అలజడి లేని కొలనులో తేట నీరు పైకితేలి ప్రశాంతంగా ఉన్నట్లు వాల్మీకి మనసు అత్యంత ప్రశాంతంగా ఉన్న సమయంలో తారసపడ్డ వ్యక్తులు, సంఘటనలు, ఉదయించిన ప్రశ్నల్లో నుండే రామాయణం పుట్టింది. కోపాన్ని జయించినవాడు, అసూయలేనివాడు, సత్య ధర్మ పరాక్రమవంతుడు... ఇలా సకల గుణ సంపన్నుడు ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మనసు వెతుకుతోంది. ఆ సమయంలో ఎదురైన నారదుడిని స్పష్టంగా అదే అడిగాడు వాల్మీకి. ఎందుకు లేడు? అయోధ్యలో రాముడున్నాడు అని వాల్మీకికి నారదుడు రామదర్శనం చేయించాడు. ఇక వాల్మీకి మనసు ఆగలేదు. అదే ధ్యాస, అదే స్మరణ, అదే పులకింత, అదే సర్వస్వం. ఫలితం - శ్రీ రామాయణం.


మనం రామాయణాన్ని పారాయణ చేయాలని, సీతారామ హనుమలను పూజించాలని మాత్రమే వాల్మీకి రామాయణం చేశారనుకుంటే మనం ఆ మహర్షి గౌరవాన్ని తగ్గించిన వాళ్లం ్లఅవుతాం. ఆయనే ఒకచోట మారీచుడి చేత చెప్పించినట్లు రామో విగ్రహవాన్  ధర్మః అని ధర్మాన్ని పోతపోస్తే రాముడి రూపమవుతుంది. నేను లేనప్పుడు అమ్మ కైకేయి వరంగా తీసుకున్న రాజ్యం, నేను అడగని, తెలిసిన తరువాత కూడా తీసుకోని రాజ్యసింహాసనం ఇంకా ఖాళీగానే ఉంది అన్నా, నేనే వచ్చి అడుగుతున్నాను కాబట్టి నీవు అడవినుంచి అయోధ్యకు వచ్చి సింహాసనం అధిష్టించ వల్సిందిగా సకల పరివారంతో వెళ్లి అడిగాడు భరతుడు. రామ - భరతుల మధ్య ఈ విషయంలో వాదోపవాదాలు చాలా దీర్ఘంగా సాగుతాయి. మనం భరతుడి వైపు వింటున్నప్పుడు ఇక రాముడు మనసు మార్చుకోవాల్సిందే అనిపిస్తుంది. కానీ పితృవాక్య పరిపాలన అంటే ఆయన లేనప్పుడు పట్టించు కోవాల్సిన పనిలేని మాట కాదని ధర్మం, ధర్మసూక్ష్మాన్ని రాముడు తమ్ముడికి విడమరిచి చెబుతాడు. అయినా భరతుడు ఒక పట్టాన వినడు. చివరికి వశిష్ఠుడి ప్రమేయంతో రామ పాదుకలను భరతుడు నెత్తిన పెట్టుకుని వచ్చేస్తాడు. నీవు వచ్చేవరకు మాత్రమే అది కూడా నీ పాదుకలే పాలిస్తున్నాయని భావిస్తూ నేను సంరక్షకుడిగా ఉంటానని రాముడికి చాలా స్పష్టంగా చెప్పాడు భరతుడు.

 
రామ భరతులు, రామ-విశ్వామిత్రులు, రామ-హనుమలు, దశరథ-జనకుల మధ్య వాల్మీకి ఎంత ఉదాత్తమైన నడక నడిపాడో, రావణ- కుంభకర్ణాదు లు, రావణ- హనుమ, రావణ-సీత, రావణ- మారీచుల మధ్య కూడా అంతే గంభీరంగా నడక నడుస్తుంది. రావణుడిని మొట్టమొదట హనుమ చూసినప్పుడు అహోరూపం, అహోధైర్యం అంటూ ఏమి రూపం, ఎంత తేజస్సు? అని ఆశ్చర్యపోయేలా చేసిన వాల్మీకి వెంటనే తెల్ల నీళ్ల మధ్య పెద్ద ఏనుగులా, మినుముల రాశిలా రావణుడు పడుకుని ఉన్నాడంటాడు. ఫలానావాడు మంచివాడు, ఫలానావాడు దుర్మార్గుడు అని వాల్మీకి తీర్పుల జోలికి వెళ్లలేదు. రామచరితను మనముందు పెట్టాడు. రామాయణ సారంగా, రాముడి గుణగణాలకు సర్టిఫికేట్ లాంటి మాటలను దుష్ట రాక్ష పుడైన మారీచుడిచేత చెప్పించాడు- అది కూడా రావణాసురుడికి. 

 
ఆధునిక జీవితంలో వేగం పెరుగుతోంది. వసతుల మీద ఉన్న శ్రద్ధ విలువల మీద ఉండడంలేదు. భార్యాభర్తల మధ్య పరస్పర అనురాగం, అవగాహన సన్నగిల్లుతున్నాయి. పగలు, రాత్రి ఉద్యోగాలతో కుటుంబంలో ఎవరు ఎప్పుడు ఇంట్లో ఉంటారో వారికే తెలియడంలేదు. అనుమానాల పునాదుల మీద సంసారాలు కదిలిపోతున్నాయి. అభిరుచులు, ఆర్జనలు, పట్టింపులే తప్ప దంపతులుగా కలకాలం కలిసి నడవాల్సిన దారులు మధ్యలోనే వేరవుతున్నాయి. సీతారాములు పడ్డ కష్టాలెన్ని? ఎదుర్కొన్న అవమానాలెన్ని? ఎలాంటి వైభవోపేత జీవితం నుండి ఎలాంటి వనవాసంలోకి వెళ్లారు? దంపతులు కష్టనష్టాల్లో తోడు నీడగా నడవాలన్న సందేశం రామాయణం కంటే మరొకటి ఇవ్వగలదా?

 
వావి వరసలు మరచి ప్రవర్తిస్తున్నవారు తారసపడుతూనే ఉన్నారు. వారానికో పెళ్లి, నెలకో విడాకులు, సంవత్సరానికి సంతానంతో - అన్నా చెల్లెళ్ల ప్రేమలు, పెళ్లిళ్ల దాకా వెళ్తే ఎవరు, ఎవరికి ఏమవుతారో తెలియక చివరికి మాడి మసి అవుతున్న బంధుత్వాలు మన కళ్లముందే కనబడుతున్నాయి. అన్నదమ్ములు, వదిన-మరుదులు ఎలా ఉండాలో రామాయణం కంటే మరొకటి చెప్పగలదా?

 
అయోధ్య రాముడు ఆటవికుడైన గుహుడిని ఆత్మ సమాన మిత్రుడిగా సంబోధించాడు. వానరజాతి సుగ్రీవుడి ఆచారాలను గౌరవించాడు. రాక్షసజాతి విభీషణుడి విలువలకు పట్టం కట్టాడు. ఎదుటివారిని గౌరవించడం, ఎదుటివారి అభిప్రాయాలను వినడం, వారి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం ఒక  సంస్కారం. మనకు నచ్చినా, నచ్చకపోయినా అవతలివారి జీవన విధానాన్ని, ఆలోచనా సరళిని గౌరవించి తీరాలన్న ప్రాథమిక నియమాన్ని రామాయణం కంటే మరొకటి చెప్పగలదా?

 
లోకంలో ధర్మాధర్మాలకు ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. పదితలలు లేకపోయినా వేయి చెడు ఆలోచనల తలలతో రావణాసురులు మన మధ్య తిరుగుతూనే ఉన్నారు. రక్తమాంసాలతోపాటు తమ సర్వస్వాన్ని ధారపోసి పెంచి పోషించిన తల్లిదండ్రులను పూచికపుల్లకంటే హీనంగా చూస్తున్న వారున్నారు. అధికారం కోసం తండ్రిని బందీ చేసేవారున్నారు. తోబుట్టువులను చంపేవారున్నారు. మంచి చెప్తే మొహాన ఉమ్మేసేవారున్నారు. ఏది తప్పో - ఏది ఒప్పో తెలియక తాము చేస్తున్నదే మంచి అన్న భ్రమలో పాపకూపంలో కూరుకుపోతున్నవారున్నారు. ఇలాంటి వారికి చేరాలనే వాల్మీకి రామాయణాన్ని గ్రంథస్థం చేశాడు. శీలం, గుణం ప్రాణంగా బతికితే మనలో రాముడుంటాడు. విలువల వలువలు విప్పి తిరిగితే మనలో రావణుడుంటాడు.

 
ధర్మం మీద మన జీవితం నిలబడితే రామబాణం దొరుకుతుంది. అధర్మం మీద బతికితే రావణ వధ జరుగుతుంది. యుగాలు మారినా వాల్మీకి రామాయణం నిచిలి ఉంటుంది.

- పమిడికాల్వ మధుసూదన్, సీనియర్ పాత్రికేయులు (నేడు వాల్మీకి జయంతి )

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా