మన గొప్పలు కాదు... అల్లాహ్‌ గొప్పలు చెప్పుకోవాలి!

16 Jun, 2017 23:15 IST|Sakshi
మన గొప్పలు కాదు... అల్లాహ్‌ గొప్పలు చెప్పుకోవాలి!

రమజాన్‌ కాంతులు

రమజాన్‌ ఉపవాసాల విషయంలో కృపాసాగరుడైన అల్లాహ్‌ పురుషుల కంటె స్త్రీలకే ఎక్కువ రాయితీలు ఇచ్చాడు. స్త్రీలు కష్టాలకు గురి కాకుండా ఉండేందుకు అల్లాహ్‌ చేసిన మేలు ఇది. అలాగని స్త్రీలు కానీ, పురుషులు కానీ ఉపవాసాలు ఉండడం ద్వారా తామేదో ఘనకార్యం చేశానన్న భ్రాంతి నుంచి బయటపడాలి. ఈ సద్బుద్ధిని, అటువంటి సదవకాశాన్ని అనుగ్రహించిన అల్లాహ్‌కు వేనవేల కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఉపవాసం ఉండి మీరు అల్లాహ్‌కేదో గొప్ప మేలు చేయలేదు. వాస్తవంగా విశ్వాస భాగ్యంతోపాటు ఉపవాసం పాటించుకునే వెసులుబాటును ఇచ్చి అల్లాహ్‌ మీకు మేలు చేశాడని గుర్తుంచుకోవాలి. రేపు ప్రళయదినాన మీరు చేసిన నిర్వాకాలకు బదులుగా మీ సత్కర్మలన్నీ బాధితులకు పంచబడతాయి.

అప్పుడు మీ వద్ద ఒక్క ఉపవాసం మాత్రమే ఉండిపోతుంది. మీ నిర్వాకం బారిన పడిన బాధితులు ఇంకా ఎంతోమంది ఉన్నా, ఒక్క ఉపవాస పుణ్యం కారణంగా వారందరి బాధ్యతను అల్లాహ్‌ తీసుకుని మిమ్మల్ని రయ్యాన్‌ అనే తలుపు గుండా సగౌరవంగా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. కాబట్టి మీకు మీరు గొప్పలు చెప్పుకోవడం మాని అల్లాహ్‌ గొప్పలు చెప్పుకోండి.  ఆయన ఘనతా ఔన్నత్యాలను వేనోళ్ల కొనియాడండి అంటుంది దివ్యఖురాన్‌.
– సయ్యద్‌ అబ్దుస్సలామ్‌ ఉమరీ

మరిన్ని వార్తలు