ప్రభుత్వాలు చదువుకోవాలి

26 Apr, 2016 22:14 IST|Sakshi
ప్రభుత్వాలు చదువుకోవాలి

అన్నం ఉడికిందా లేదా? మెతుకు పట్టుకుంటే చాలు. గవర్నమెంట్ స్కూల్స్ ఎలా నడుస్తున్నాయి? రామోజీపేట ‘రిఫరెండమ్’లో ఏముందో చూస్తే చాలు. మొన్న ఇంటర్ ఫలితాల్లో ముందున్నది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పిల్లలే! ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే, ఇంకొంచెం బాధ్యతగా ఉంటే... గవర్నమెంట్ స్కూళ్లను, గవర్నమెంట్ టీచర్లను బలపరిస్తే... మరింత అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. సరిగ్గా ఈ ఆలోచనతోనే రామోజీపేట స్కూల్ హెచ్.ఎం., టీచర్లు రిఫరెండమ్ నిర్వహించారు. గ్రామస్థుల దగ్గరకు వెళ్లి, బడి అంటే ఎలా ఉండాలి? చదువు ఎలా చెబితే బాగుంటుంది? అని అడిగారు. ప్రభుత్వాలు ఈ రిఫరెండమ్ ఫలితాలను చదివితే... పిల్లలు ఇంకా బాగా చదువుకుంటారు.
 
కరీంనగర్ జిల్లా.. ఇల్లంతకుంట మండలంలోని రామోజీపేట గ్రామం! వారం రోజులుగా వార్తల్లో ఊరైంది. కారణం కరువు కాదు.. కార్యాలయమూ కాదు.. సర్కారు బడి! సర్కారు కొలువంటేనే జీతం తప్ప బాధ్యతలేని ఉద్యోగం అంటారు. మరీ టీచర్ అయితే.. కడుపులో చల్ల కదలకుండా చేసే పని అని ప్రచారం. ఈ ధోరణి ప్రైవేట్ స్కూళ్ల స్వైర విహారానికి కారణమైంది. టిప్‌టాప్ యూనిఫామ్‌లు.. బండెడు పుస్తకాలు.. అంతకుమించి బరువైన అడ్వర్టయిజ్‌మెంట్లు.. క్షణం తీరికనివ్వకుండా హోమ్‌వర్క్‌లు.. అన్నీ కలిసి.. ప్రైవేటు స్కూళ్ల పిల్లలు బాగా చదువుతున్నారనే భావనను కల్పించాయి.

ఆ భావన పట్నం దాటి పల్లెలకూ విస్తరించింది. దాంతో పల్లెల్లోని ప్రభుత్వ తెలుగు మీడియం స్కూళ్లు.. చెరిగిపోతున్న నల్లబల్ల మీది రాతలు అయ్యాయి. బడి తలుపులు మూసేసుకున్నాయి. పాఠాలు చెప్పడం మీద ప్రేమున్న పంతుళ్లను అది బాధించింది. ఆ బాధ తమదాకా రాకుండా ఉండేందుకే రామోజీపేట బడి కొత్త అక్షరాలను దిద్దింది. అందుకే వార్తల్లోకి వచ్చింది.
 
ప్రభుత్వం అంటే పారిపోతున్నారెందుకు?
ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నా కూడా గవర్నమెంట్ స్కూళ్లను పట్టించుకోవట్లేదు. అలాంటి వాళ్లకు ఇంగ్లీష్ మీడియం.. ప్రైవేట్ స్కూల్స్ ఆహ్వానం పలుకుతున్నాయి. రామోజీపేటలోని తమ బడీ అలాంటి కాలపరీక్షను ఎదుర్కోక తప్పదని అర్థమైంది ఆ స్కూల్ హెచ్.ఎం. పెద్దింటి అశోక్ కుమార్‌కి. ఆయన రచయిత కూడా.
 
బడి భవిష్యత్తు కోసం న్యూ సిలబస్
ఆ పరీక్షను తప్పించుకోవాలి.. బడిని బతికించుకోవాలి అని ఆరాటపడ్డారు అశోక్ కుమార్. తోటి ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. పిల్లల జ్ఞానానికి  కాదు.. మన బోధనకు పరీక్షపెట్టుకుందాం అన్నారు హెచ్.ఎం.‘అవును... అసలు మనం ఏం చెప్తున్నాం.. ఎలా చెప్తున్నామో తెలిస్తే కదా.. పిల్లల మార్కులను కొలిచేది’ అనిపించింది మిగిలిన ఉపాధ్యాయులకు. ఏంచేద్దాం? ముక్తకంఠంతో సమాలోచన.

‘‘మనం చదువు చెప్పే పిల్లల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్దాం.. మన నుంచి వాళ్లు ఎలాంటి బోధనను కావాలనుకుంటున్నారు? ఇంకా ఏం చేస్తే వాళ్ల పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటున్నారో అడుగుదాం. మన పనితీరుకు మార్కులు వేయమని అడుగుదాం.. ఏమంటారు?’’ అన్నట్టు చూశారు అశోక్‌కుమార్. అంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. అలా బడి భవిష్యత్ కోసం కొత్త సిలబస్‌ను తయారు చేసుకున్నారు.
 
ఊరంతటినీ ఒకచోట చేర్చారు
అనుకున్నదే తడవుగా అంతా కలిసి ఊళ్లోకి వెళ్లారు. ‘మా పనితీరు గురించి మీ అందరితో చర్చిద్దామనుకుంటున్నాం.. ఫలానా రోజున ఫలానా చోటికి రండి’ అంటూ ఊళ్లోవాళ్లకు విజ్ఞప్తి చేశారు. వాళ్ల వినతిని మన్నించిన జనం.. వాళ్లు చెప్పిన రోజున.. చెప్పిన చోట సమావేశమయ్యారు. సర్కారు బడులు మూతపడే స్థితి ఎందుకు వస్తోంది? చర్చ మొదలైంది. ప్రైవేట్‌స్కూల్స్ అని గ్రామస్థుల సమాధానం.

కారణం ఎవరు? ఉపాధ్యాయులే అని కొంతమంది సమాధానమిస్తే.. ఇంకొంతమంది తప్పును ప్రభుత్వం మీదకి నెట్టారు. వాదోపవాదాలు, చర్చలు జరిగాయి. ‘‘సరే.. తప్పొప్పులు ఎవరివైనా పరిష్కారం కావాలి. మళ్లీ మా బడి.. అదే మన బడి బతకాలంటే మేం ఏం చేయాలి? మార్చుకోవాల్సిన పద్ధతులు ఏంటి?’’ అంటూ తమ పనితీరుకి సంబంధించి 15 ప్రశ్నలు తయారు చేసుకొని గ్రామస్థులను అడిగారు ఉపాధ్యాయులు.
 
ప్రభుత్వ విధానాలు మారాలి
చర్చకు హాజరైన గ్రామస్థులలో 80 శాతం మంది ఉపాధ్యాయులను సమర్థించారు. మిగిలిన 20 శాతం మంది టీచర్ల విధానాలను విమర్శించారు.  ఎలాంటి విధానాలను అమలు చేయాలో సూచించమని అడిగారు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల టీచర్లు. ఇంగ్లీషు మీడియం కావాలన్నారు గ్రామస్థులు. ప్రీ ప్రైమరీ కూడా కావాలన్నారు. అంటే ప్రాథమిక స్థాయి కంటే ముందే పిల్లల్ని బడిలో చేర్పించే సదుపాయం ఉండడం. పరిష్కారం దొరికింది. అయితే ఇది ప్రభుత్వం చేతిలో ఉన్న పని. ఎలా? అయినా సరే రామోజీపేట టీచర్లు నిరాశ పడలేదు  ఎలాగైనా సరే.. వందశాతం పిల్లల్ని బడిలో చేర్చుకోవాలి అని కృత నిశ్చయంతో ఉన్నారు.

అందుకే ఆ చర్చ అక్కడితో ముగిసినా తెల్లవారి నుంచి ఇల్లిల్లూ తిరగడం మొదలుపెట్టారు. కష్టసుఖాలు పంచుకున్నారు. ఆ క్రమంలోనే ప్రభుత్వ పథకాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. వారిని లబ్ధిదారులుగా చేర్చారు. ఈ విద్యాసంవత్సరానికి తల్లిదండ్రులు ఆశించినట్టుగా బడిని నడిపే ప్రణాళిక తయారుచేసే పనిలో ఉన్నారు ప్రస్తుతం రామోజీపేట ఉపాధ్యాయులు. బడినిండా పిల్లలు.. మదినిండా పాఠాలతో.. తమ బడి కళకళలాడుతుందని ఆశిస్తున్నారు.
 - వూరడి మల్లికార్జున్, సాక్షి, సిరిసిల్ల
 
ఒక అడుగు ముందుకు వేశాం
‘ప్రజల్లోకి వెళ్లడానికి ఏ మాత్రం ఇబ్బంది పడకుండా వెళ్లాం. మేం చదువు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం... మీకేం కావాలంటూ సూటిగా అడిగాం. ప్రజలు అంతే సూటిగా లోపాలను చాటిచెప్పారు. బడిని బతికించుకునేందుకు మేం నిర్వహించిన రెఫరెండం మా ఆత్మసై ్థ్యర్యాన్ని పెంచింది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మమ్మల్ని తలెత్తుకునేలా చేసింది. మార్పు ఎక్కడో చోట ఒక్క అడుగుతో మొదలు పెట్టాల్సిందే. మేం చేసింది  కూడా అదే. ఒక అడుగు వేశాం.
- పెద్దింటి అశోక్‌కుమార్, ప్రధానోపాధ్యాయుడు
 
రెఫరెండంలో బయటపడ్డ విషయాలు
* లోపం ఇటు ఉపాధ్యాయుల పని తీరులో ఉంది అటు విద్యా పాలసీలో ఉంది. ‘ఇలాంటి విద్య కావాలి’ అని సమాజం కోరుకుంటున్నట్టు  పాలసీ అమలు చేయడం లేదు.
* ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని సమాజం గుర్తించడంలేదు. పాలసీని, ప్రజల కోరికలను సమన్వయ పరిచినప్పుడే ఇది సఫలీకృతమవుతుంది. సవరణలు చేసినా కూడా సరిపోతుంది.
* 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. 59 మంది విద్యార్థులుంటే ఇద్దరు టీచర్లుండాలి. ప్రస్తుతం దీనికి విరుద్ధంగా ఉంది పరిస్థితి. అందుకే తరగతికో ఉపాధ్యాయుడినివ్వాలి.
* పిల్లలే లేకుండా తరగతికో ఉపాధ్యాయుడు ఎలా? అవును పదిమంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లు ఉండడం అనవసరమే. అలాంటి స్కూళ్లను విలీనం చేయాలి. 100 మంది నిండే వరకు విలీనం చేసి రవాణా సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా భారం తగ్గుతుంది. నాణ్యమైన విద్యను పిల్లలకు అందించేందుకు అవకాశం ఉంటుంది. ప్రై వేటు స్కూళ్లు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలలకూ దీన్ని అమలు చేయాలి.
* పర్యవేక్షణ పెంచాలి. పాఠశాలలోని విద్యార్థులను దత్తత తీసుకునే పాలసీని అమలు చేయాలి. దత్తత తీసుకున్న విద్యార్థుల చదువు బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగించాలి. అప్పుడు తప్పకుండా ఉపాధ్యాయుల పని తీరు మెరుగుపడుతుంది.
* సర్కారు బడులు ప్రమాదపు చివరి అంచుల్లో ఉన్నాయి. ఇకనైనా ఉపాధ్యాయులు కళ్లు తెరిచి పని తీరును మెరుగు పరుచుకోకుంటే, ప్రభుత్వం కళ్లు తెరిచి పాలసీలు మార్చకుంటే ఐదూ పదేళ్లలోనే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం వస్తుంది.

మరిన్ని వార్తలు