ఆదర్శ రైతు... రామ్‌శరణ్

25 May, 2014 23:50 IST|Sakshi
ఆదర్శ రైతు... రామ్‌శరణ్

స్ఫూర్తి
 
అందరూ చేసేది అనుసరించేయడంలో గొప్పేమీ లేదు. కానీ అందరూ చేసేదాన్ని కొత్తగా చేయాలనుకోవడమే గొప్ప. అలా చేశాడు కాబట్టే రామ్‌శరణ్ వర్మ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు.
 
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలోని దౌలత్‌పూర్ అనే చిన్న గ్రామంలో పుట్టాడు రామ్‌శరణ్. చదువులో పెద్దగా రాణించలేకపోవడంతో ఎనిమిదో తరగతితోనే బడికి బైబై చెప్పేశాడు. తండ్రికి వ్యవసాయంలో సాయం చేసేవాడు. తండ్రి మరణించిన తరువాత ఆరు ఎకరాల పొలంలో తనే వ్యవసాయం చేయాల్సి వచ్చింది రామ్‌శరణ్‌కి.

వ్యవసాయం పట్ల ప్రత్యేక ఆసక్తి లేదు. అలాగని అనాసక్తీ లేదు. కానీ తండ్రి పొలం ఎప్పుడైతే తన చేతికి వచ్చిందో అప్పట్నుంచీ పంటల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు. వరి, గోధుమ, బంగాళదుంపలను పండించడం మొదలు పెట్టారు. దిగుబడి బాగుండటంతో ఆసక్తి మరింత పెరిగింది. దాంతో వ్యవసాయాన్ని సవాలుగా తీసుకున్నారు.
 
రకరకాల పంటల గురించి, వాటి సాగు గురించి పరిశోధ నలు చేయడం మొదలుపెట్టారు. వ్యవసాయం గురించి వెలువడే ప్రతి పత్రికా చదివారు. ప్రతి కార్యక్రమానికీ హాజరయ్యారు. విదేశాల్లో ఉన్న టెక్నాలజీ గురించి తెలుసు కున్నారు. ఆ తరహాలోనే ఇక్కడ కూడా పంటలు పండించడం మొదలుపెట్టారు. ఇది ఆ చుట్టుపక్కల ఉన్న రైతులందరినీ ఆకర్షించింది. ఆయన దగ్గరకు వచ్చి కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేయడమెలాగో నేర్పమని అడిగారు. అలా అలా రామ్‌శరణ్ పేరు పాకిపోయింది. కొన్ని వందల గ్రామాల రైతులకు ఆయన వ్యవసాయ గురువుగా మారిపోయారు. పదిహేనేళ్లలో ఆ రాష్ట్రంలోని పలు గ్రామాల వ్యవసాయ రూపురేఖల్ని మార్చేశారాయన.
 
దాదాపు ఎనభై అయిదు ఎకరాల్లో రామ్‌శరణ్ పండించే టొమాటో, అరటి, బంగాళాదుంపలు, వరి వంటి పలు వ్యవసాయ ఉత్పత్తులు మన దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి!
 

మరిన్ని వార్తలు