ఖురాన్‌ అవతరించిన శుభరాత్రి

10 Jun, 2017 22:56 IST|Sakshi
ఖురాన్‌ అవతరించిన శుభరాత్రి

లైలతుల్‌ ఖద్ర్‌
ఇస్లాం వెలుగు

రమజాన్‌ నెల పవిత్రమైనది, శుభప్రదమైనది. చివరి పది రోజులకు మరో ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, ఈనెల చివరి పదిరోజుల్లో వేయి నెలలకన్నా విలువైన ఒక మహా రాత్రి ఉంది. ‘ఏతెకాఫ్‌’ అనే ప్రత్యేక ఆరాధన కూడా ఈ చివరి పదిరోజుల్లోనే ఆచరిస్తారు. ‘ఈ ఘనమైన రాత్రిని’ గురించి దైవం అల్‌ ఖద్ర్‌ సూరాలో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘మేము ఈగ్రంథాన్ని (ఖురాన్‌) ఒక విలువైన రాత్రిన అవతరింపజేశాం. అది వెయ్యి నెలలకన్నా అత్యంత విలువైనది. దైవదూతలు  తమప్రభువు అనుమతితో, ప్రతి అనుజ్ఞతో ఆ రాత్రిన దిగి వస్తారు. అది శుభోదయం వరకూ శాంతియుతమైన రాత్రి’. (అల్‌ ఖద్ర్‌ 97)

మానవజాతికి రుజుమార్గం చూపి, వారి ఇహ పర సాఫల్యానికి దిక్సూచిగా నిలిచే మహత్తర మార్గదర్శిని ఖురాన్‌. రమజాన్‌ నెలలో, ప్రత్యేకించి చివరిభాగంలోని ‘లైలతుల్‌ ఖద్ర్‌’లో అవతరించింది కాబట్టే ఈ రాత్రికి ఇంతటి ప్రాముఖ్యత, విశిష్టత. ఈ ఒక్క రాత్రి చేసే ఆరాధనలు వెయ్యినెలలకన్నా ఎక్కువగా చేసిన ఆరాధనలతో సమానమంటే దీని ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకే రమజాన్‌ చివరి రాత్రుల్లో ఆరాధనలు అధికంగా చెయ్యాలని, ఇందులోనే శుభరాత్రి ఉంది కనుక దాన్ని పొందాలని ప్రవక్త మహనీయులు ఉపదేశించారు. అయితే ఆ శుభరాత్రి ఫలానారాత్రి అని స్పష్టమైన నిర్ధారణలేదు.

కాని దాన్ని ఖచ్చితంగా ఎలా సొంతం చేసుకోవచ్చో ప్రవక్త స్పష్టంగా వివరించారు. రమజాన్‌ చివరి పది రోజుల్లోని బేసిరాత్రుల్లో షబెఖద్ర్‌ను అన్వేషించమని ముహమ్మద్‌ ప్రవక్త(స) ఉపదేశించారు. ఎవరైతే ఆత్మసంతోషంతో, పరలోక ప్రతిఫలాపేక్షతో ‘షబెఖద్ర్‌’  గడుపుతారో వారి పూర్వపాపాలన్నీ మన్నించబడతాయి. మరెవరైతే నిర్లక్ష్యం వహించి ఆ మహా రాత్రిని పోగొట్టుకుంటారో వారికి మించిన దౌర్భాగ్యులు మరెవరూ ఉండరని ప్రవక్త వారి ప్రవచనాల ద్వారా మనకు అర్థమవుతోంది. కనుక ఈ పవిత్రమాసం చివరి పదిరోజుల్లో మామూలుకంటే ఎక్కువగా ఆరాధనలు, సత్కార్యాలు ఆచరించి దైవప్రసన్నత పొందాలి. అల్లాహ్‌ మనందరికీ రమజాన్‌ శుభాలను సమృద్ధిగా పొందే భాగ్యం ప్రసాదించాలని కోరుకుందాం.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు