కష్టం వందే జగద్గురుమ్

22 Jun, 2014 11:04 IST|Sakshi
కష్టం వందే జగద్గురుమ్

మీరు ఇప్పటివరకూ స్టార్లు ఇచ్చిన ఇంటర్వ్యూలు చదివుంటారు. అలాంటి స్టార్ ఓ గంట పాటు రిపోర్టర్‌గా మారి సామాన్యులను ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? వెండితె రపై మెరిసే ఓ తార.. చెత్తపట్టిన చేతులతో చేయికలిపాడు. దుమ్ముపట్టిన ఫుట్‌పాత్‌పై వాళ్లలో ఒకరిగా కూర్చున్నాడు. ప్రజారోగ్య కార్మికుల (స్వీపర్ల) ఆవేదనకు అక్షరమయ్యాడు. వారి దయనీయ దుస్థితిని ‘లీడర్’లా విన్నాడు.. ‘స్టార్ రిపోర్టింగ్’ పేరుతో ‘సాక్షి సిటీప్లస్’ చేసిన ప్రయత్నానికి దగ్గుబాటి రానా పెన్నూ, పేపర్ పట్టుకొని రెడీ అయ్యాడు.  ‘మా బాధలు తెలుసుకునేందుకు మా దగ్గరకొచ్చినందుకు చానా సంతోషం నాయనా’ అంటూ రానాకు చెమర్చిన కళ్లతో ఆ మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.   వారి ఆవేదనను మనతో రానా పంచుకున్నాడు.
 
 
రానా: హాయ్.. ఎలా ఉన్నారమ్మా?
 అందరం బాగున్నమయ్యా..
రానా: చాన్నాళ్ల నుంచి మీతో మాట్లాడాలని, మీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు ఇలా కుదిరింది.
చానా సంతోషం సార్. మేం రోడ్లూడ్సే పని చేయవట్టి ఇరవై ఏళ్లవుతుంది. ఇంట్లోళ్లుగాని, బయటోళ్లుగాని మమ్మల్ని పలకరించింది లేదు, మా బాధలు ఇన్నది లేదు.
రానా: బతకడానికి బోలెడన్ని పనులు చేసుకోవచ్చు. మీరు ఈ వృత్తినే ఎందుకు ఎంచుకున్నారు?
పద్మ: చదువుకున్నోళ్లే  కొలువుల్లేవని ఖాళీగా తిరుగుతున్నరు. వాళ్లకు ఉద్యోగం లేకపోయినా, చిన్న వ్యాపారం చేసుకుని బతుకుతరు. చదువుసంధ్యలేనోళ్లం మాకన్ని పనులేముంటయి సార్.
సుకున: మట్టిపని, ఇళ్లళ్ల పనితప్ప మాకు వేరే పనులు చేసుకునే అవకాశం ఏడిది సార్.
ఆదిలక్ష్మి: చానామంది మట్టిపనికే పోతరు. కాని ఆ పని ముప్పైదినాలుండదు. మధ్యలో పనిలేకపోతే ఆరోజు జీతముండదు. అదే ఈ పనైతే గవర్నమెంట్ డ్యూటీలెక్క చేసుకోవచ్చు.
రానా: అంటే...మీరు పర్మనెంట్ ఎంప్లాయీస్ కిందకొస్తారా?
గండెమ్మ: ఆ రోజు కోసమే ఇరవైఏండ్ల నుంచి రోడ్లపై చీపుర్లు పట్టుకుని నిలబడినం. మొన్ననే కొన్ని ప్రాంతాల స్వీపర్లను జీహెచ్‌ఎమ్‌సీ కిందకు తీసుకున్నరు. అంతకుముందంతా కాంట్రాక్లర్ల కిందనే పనిచేసేటోళ్లమయ్యా.
రానా: రాత్రి ఎన్నిగంటలకు మీ పని మొదలుపెడతారు?
తేజమ్మ: నేను లాలపేట సికింద్రబాద్ ఏరియాల పనిచేస్తా...అక్కడ రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లారి ఆరు గంటలవరకూ చేయాలే!
రానా: అంటే ఎన్ని గంటలు...ఏడు గంటలు. పదకొండు అంటే అప్పుడు కూడా ట్రాఫిక్ ఉంటుంది కదా?
ఆదిలక్ష్మి: ఆ...ఉంటుంది సార్. ఇక్కడ బంజారహిల్స్, జూబ్లిహిల్స్ దగ్గర పన్నెండు గంటలవరకూ బండ్లు తిరుగుతనే ఉంటయి. ఏడాది కిందట ఇక్కడ రెండు మూడు యాక్సిడెంట్లు అయి ఇద్దరు స్వీపర్లకు బాగా దెబ్బలు తగిలినయి. అందుకే ఇక్కడ స్వీపర్ల టైమింగ్స్ మార్చిండ్రు.
పద్మ: ఏం మారిస్తే ఏంది? పదకొండు దాటిందంటే...బండ్లన్నీ ఆకాశంలనే పోతయ్. రోడ్డుమీదికి ఎక్కాలంటే భయమేస్తది.
రానా: పట్టపగలే బోలెడన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. అర్ధరాత్రంటే.. భయం వేయదా?
తేజమ్మ: ఎందుకేయదు సార్. తార్నాకలా బ్రిడ్జిపై మాతో పనిజేసేటామే రోడ్డుమీద ఊడుస్తుంటే.. బస్సు స్పీడుగొచ్చి ఆమెను గుద్ది పోయింది. ఆ బస్సాయనైతే కనీసం ఆగకూడ ఆగలే. గప్పుడు మేం బిడ్జ్రి కిందున్నం. మీదికి పోయి చూస్తే చచ్చిపోయింది.
ఆదిలక్ష్మి: పాపం...ఆమె పిల్లలు చానా చిన్నోళ్లు.

 

 


 రానా: చనిపోయినా...ఏదైనా ప్రమాదం జరిగినా ఇన్సూ   రెన్స్‌లాంటివి ఉండవా?
పద్మ: ఇన్సూరెన్సా..?
లక్ష్మమ్మ: గదే...సచ్చిపోయినోళ్ల పేరుతో ప్రభుత్వం వాళ్ల ఇంట్లోళ్లకు పైసలిస్తది పద్మమ్మా!
పద్మ: అట్లాంటియన్నీ...చదువుకుని ఉద్యోగం చేసుకునేటోళ్లకు ఇస్తరుగని, మా లెక్క రోడ్లు ఊడ్చుకునేటోళ్లకు ఇస్తరా సారు.
రానా: మీరు బండ్లు నడిపి ప్రమాదాలు చేయడం లేదు కదా! మా ప్రయాణికుల వల్లే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరే...ఒకవేళ మీకు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఆసుపత్రికి ఎవరు తీసుకెళతారు?
గండెమ్మ: మొన్నటివరకూ కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసినపుడు వాళ్లకు ఫోన్ చేసేటోళ్లం. ఇప్పుడు మా టీం లీడరే అన్నీ చూసుకుంటరు.
రానా: టీం లీడరంటే?
ఎమ్. గండెమ్మ: ఏడు మందికి ఒక లీడరుంటరు సార్. మేమంతా లీడర్లమే. ఒక్కొక్కరం ఒక్కో ఏరియా నుంచి వచ్చినమ్. లాలపేట, సికింద్రాబాద్, మల్కాజగిరి...అట్ల.
రానా: ఓ.. మీరంతా లీడర్స్. గుడ్. కాసేపు దుమ్ములో నిలబడితే మాకు బోలెడన్ని సమస్యలు వస్తున్నాయి.  మరి మీ సంగతేంటి?
ఆదిలక్ష్మి: సార్.. మామూలుగా ఉమ్ముంచితే తెల్లగొస్తది కదా! మా ఉమ్ము నల్లగుంటది. బోరమొత్తం దుమ్మునిండి ఊకే  దగ్గు,కడుపు నొప్పులొస్తయి.
తేజమ్మ: మాకివన్నీ మామూలే సార్. కొన్ని ప్రాంతాలల్ల చీపుర్లు అరిగిపోయినా వెంటనే కొనియ్యరు. బాగా వొంగి ఊడ్చడం వల్ల నడుము నొప్పులొస్తయి. అన్నింటికంటే ముందు మోకాళ్లు నొప్పులొస్తున్నయి.
రానా: మరి మీరెప్పుడు నిద్రపోతారు?
జి. గండెమ్మ: ఆరింటికి పనైపోంగనే ఇంటికి పోతం. పోతనే ఇల్లు శుభ్రం చేసుకుని వంట చేసుకుని పిల్లలను స్కూళ్లకు పంపి, మగోళ్లను పనిలకు దోలిచ్చే సరికి పదకొండయితది. మధ్యాహ్నం ఓ మూడు నాలుగు గంటలు పండుకుంటం. ఇగో పద్మలాంటోళ్లు.. పగటిపూట కూడా ఏదో ఒక పనిచేస్తరు.
పద్మ: ఏం చేస్తం సార్. నా బిడ్డ ఆరోగ్యం బాగలేక చనిపోయింది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. నా అల్లుడు పిల్లల్ని నాకప్పజెప్పి పోయి రెండో పెండ్లి చేసుకున్నడు. నా మనవరాళ్లే నాకు బిడ్డలయ్యిండ్రు. వాళ్లను సాకాలే, చదివించాలే అంటే స్వీపర్ పని పైసలు సరిపోతలే! అందుకే పగులు ఇండ్లళ్ల పని చేసుకుంటున్న.
రానా: మేం కాదమ్మా.. మీరు హీరోలు. ఇంతకీ మీకు      జీతమెంత వస్తుంది?
ఆదిలక్ష్మి: నెలకు ఏడువేలు సార్. సెలవు పెడితే జీతం కట్ అయితది.


రానా: సరిపోతున్నాయా?
లక్ష్మమ్మ: ఇంటి కిరాయే రెండు, మూడు వేలు ఉంటది సార్. ముప్పైరూపాయల్లేకుండా దొడ్డు బియ్యం కూడ వస్తలేవు. ఇక మా ఇంట్ల మగాళ్ల సంపాదనంటే.. వాళ్లు తాగంగ మిగిలినదాంతో ఇంటి సరుకులు కూడా రావు సార్.
సుకున: రాత్రిపూట మేం డ్యూటీల ఉండటం వల్ల మగోళ్లు వాళ్లిష్టమొచ్చినట్లు చేస్తున్నరు సార్. ఎందుకు తాగినవ్ అని అడిగేటోళ్లు ఇంట్ల లేకపోయేసరికి వాళ్లిష్టమన్నట్టు.
లక్ష్మమ్మ: ఆడపిల్లల్ని ఇంట్ల వదిలి బయటికి రావాలంటే ఒకోసారి భయమేస్తుంటది. ఏం జేస్తం...బతుకుతెరువు కోసం ఎన్ని బాధలైనా పడాలి.
రానా: ఇంత కష్టపడుతున్నారు.. పిల్లల్ని చదివిస్తున్నారా?
ఎమ్. గండెమ్మ: వాళ్లకోసమే కదా సార్.. ఇన్ని తిప్పలు.
రానా: ఇంకా...నన్నేమైనా అడుగుతారా?
పద్మ: సార్ మేమెప్పుడూ సినిమా టాకీస్‌కు పోలే. ఇంట్ల టీవీలనే ఒకటిరెండుసార్లు మిమ్మల్ని చూసిన. బయట ఇట్ల చూస్తమనుకోలే!(నవ్వుతూ...)
రానా: హ్యాపీయా...
సుకున: చాన.
రానా: ఓకే బై.
 
 
కష్టమే జగద్గురువు. కష్టమన్నది లేకుండా ఎవరూ ఏ పాఠమూ నేర్చుకోలేరు. బడికి వెళ్లినా, వెళ్లకున్నా బతుకు పాఠాలు నేర్చుకోవాలంటే కష్టం తప్పనిసరి. సహస్రవృత్తుల కార్మికులంతా కష్టానికి శిష్యులే. అలాగే, అపరకుబేరులు సైతం కష్టాలతో సావాసం చేయాల్సిందే. అందుకే, కష్టమే జగద్గురువు...

 
 
ఇంటి శుభ్రం అమ్మ చేతిలో ఉంటే మన సిటీ శుభ్రం వీరి చేతిలో ఉంది. అంటే వీళ్లు కూడా అమ్మలాంటివారే. తాగిన మైకంలో రోడ్లపై స్పీడ్ డ్రైవ్ చేసుకుంటూ.. కనిపించినవారిపై సీసాలు విసురుకుంటూ స్పృహ లేకుండా ప్రయాణించేవారు ఇకపై వారి ప్రవర్తన మార్చుకుంటారని భావిస్తున్నాను. తెల్లారేసరికి మా రోడ్లన్నీ శుభ్రంగా ఉంటున్నాయంటే...  ఈ  అమ్మల చేతి చలవే!
  - రానా
 

మరిన్ని వార్తలు