ప్రెజెంట్‌ టీచర్‌..!

16 Jun, 2020 08:59 IST|Sakshi
విద్యార్థులకు వ్యాధుల పట్ల అవగాహన కల్గిస్తూ..

ఆదర్శం

బళ్లు తెరవకపోయినా విద్యార్థులు ఉన్న ప్రతి ఇంటి ముందుకు వెళుతుంది ఆ టీచర్‌. ‘ప్రెజెంట్‌ టీచర్‌.. ’ అంటూ ఇంటి నుంచే సమాధానమిస్తున్నారు ఆ విద్యార్థులు. పిల్లల ఆరోగ్యానికి జాగ్రత్తలు చెప్పడమే కాదు వారి యోగ క్షేమాలూకనుక్కుంటోంది.‘నేను బాగున్నాను టీచర్‌..’ అని చెప్పే మాటలే తనకు సంతోషాన్నిస్తాయని చెబుతుంది. అవసరమైన వారికి శానిటరీ నాప్‌కిన్స్, శానిటైజర్లు.. మాస్కులు, నిత్యావసర సరుకులు ఇస్తూ ... అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆ టీచర్‌ పేరు వాణీ సక్కుబాయి.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఊరెళ్ల గ్రామ వాసి వాణీ సక్కుబాయి. చదువొక్కటే తలరాతను మార్చగలదని నమ్మే వ్యక్తి. అందుకే పేదరికంలో పుట్టి పెరిగినా పట్టుదలతో చదువుకొని టీచర్‌ అయ్యింది. 17ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సక్కుబాయి రెండేళ్లుగా మొయినాబాద్‌ మండలం టోల్‌కట్టలోని మల్లవరపు సీతమ్మ మెమోరియల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విధులను నిర్వర్తిస్తోంది. లాక్‌డౌన్‌ రోజుల నుంచీ.. మార్కెట్‌ ప్లేస్‌లు, కూడళ్ల వద్ద జనం గుమికూడే అవకాశం ఉన్న ప్రాంతంలో వైరస్‌ వ్యాప్తి జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఏం చేస్తే వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయచ్చో ప్రతి ఒక్కరిలోనూ అవగాహన పెంచుతోంది. సొంతగా మాస్కులు కుట్టి, ఉచితంగా వాటిని పంపిణీ చేస్తుంది. పేదలకు, వలస కార్మికులకు నిత్యావసరాలు అందజేస్తుంది.

ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంటికీ..
ఉపాధ్యాయ వృత్తి ఎంతో బాధ్యతను పెంచిందని చెబుతున్న సక్కుబాయి మాట్లాడుతూ– ‘చేవెళ్ల మండలం బాలికల ఉన్నత పాఠశాలలో చేరినప్పటి నుంచీ ఆడపిల్లలకు అవగాహన తరగతులు తరచూ తీసుకుంటూ ఉండేదాన్ని. గ్రామాల్లో నెలసరి సమయాల్లో ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే కొన్ని స్వచ్ఛంద సంస్థలను కలిసి, వారి సహకారంతో ఇల్లిల్లూ తిరిగి ఆడపిల్లలకు శానిటరీ నాపికిన్స్‌ అందజేసేదాన్ని. ఇప్పటికీ ఆ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. రెండేళ్ల కిందట టోల్‌కట్టలోని స్కూల్‌కు బదిలీ అయ్యింది. ఇక్కడి స్కూల్‌లోనూ బాలికల శాతం ఎక్కువే. ఈ మధ్య గ్రామాల్లో చదువుకునే బాలికల సంఖ్య పెరిగింది. అయితే, వారు రకరకాల కారణాల వల్ల మధ్యలోనే డ్రాపౌట్స్‌గా మిగిలిపోతుంటారు. అందుకే ప్రతి ఆదివారం, సెలవు రోజుల్లో ఆడపిల్లలున్న తల్లిదండ్రులను కలవాలని నియమం పెట్టుకున్నాను. ముఖ్యంగా ఏడు నుంచి పదవతరగతి చదువుతున్న ఆడపిల్లలు క్లాసుకు ఎంత మంది ఉంటారో నాకు తెలుసు. వారి ఇంటి అడ్రసులు తీసుకొని వారం వారం కొన్ని ఇండ్లకు వెళ్లేదాన్ని. ఈ విధానం వల్ల ఆ పిల్లల ఇంటి పరిస్థితులు నా కర్థమయ్యేవి. దీంతో కొంతమంది పిల్లల చదువులు అర్ధంతరంగా ఆగిపోకుండా వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చేలా ఉపయోగపడింది. కొన్ని బాల్యవిహాలను అడ్డుకోవడం కూడా సులువైంది. ఆడపిల్లల ఆరోగ్యరీత్యా శానిటరీ నాప్‌కిన్స్‌ అందజేయడానికి, వారి ఆరోగ్యం గురించి వాకబు చేయడానికి ఇదో మంచి మార్గమైంది’ అని వివరించింది సక్కుబాయి.

అవగాహన విస్తృతికి..
ఆడపిల్లలు చదువుకుంటే అంతకన్నా ఎక్కువ చదువిన వాడిని తెచ్చి పెళ్లి చేయాలనే పెద్దల నమ్మకాలను వమ్ము చేస్తూ పదో తరగతితో చదువు మానేసిన వ్యక్తిని పెళ్లిచేసుకుంది సక్కుబాయి. తన పెళ్లినాటి పరిస్థితులను, తరువాత దిద్దుకున్న జీవితాన్ని వివరిస్తూ– ‘పెళ్లి తర్వాత మా ఆయన్ను డిగ్రీ చదివే వరకు ఊరుకోలేదు. తర్వాత ఆయనే ఉత్సాహంతో ఎం.ఎ బీఈడీ కూడా చేశారు. ప్రస్తుతం ఫొటో స్టూడియో నడుపుతున్నారు. చదువుకుంటే పెద్ద ఉద్యోగాలు వస్తాయని కాదు, మనోవికాసం కలుగుతుంది. ఏ సమస్యనైనా అవగాహన చేసుకునే తీరు మారుతుందని నా నమ్మకం. నా నిర్ణయానికి తగ్గట్టు అత్తింటి సహకారం నాకు కలిసి వచ్చింది. మాకు ఇద్దరు పిల్లలు. వారి అవసరాలు చూస్తూనే నా విధులను నిర్వర్తిస్తాను. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటాను. నా లాంటి ఆలోచనలున్న మరికొన్ని సంస్థలతో కలిసి భాష, సంస్కృతి, సంప్రదాయలు, సామాజిక విలువల గురించి పాఠశాల, కాలేజీ స్థాయి విద్యార్థులకు అవగాహన సదస్సులను ఏర్పాటుచేస్తుంటాను. ఈ సదస్సులు నన్ను చాలా మందికి పరిచయం చేశాయి. అక్షయపాత్ర, అక్షర ఫౌండేషన్‌ వంటి స్వచ్ఛంద సంస్థలు, గ్రామంలో సేవాభావం కలవారి సహకారంతోనూ ఈ కోవిడ్‌ పరిస్థితుల్లో లేనివారికి సహాయం చేస్తున్నాను’ అంటూ ప్రస్తుతం తను చేస్తున్న కార్యక్రమాలను తెలిపింది సక్కుబాయి.

చదువే కాదు రకరకాల అంశాల మీద పెంచుకున్న అవగాహన మనతోనే ఆగిపోకూడదు. మరికొన్ని జీవితాలకు అవి దీపాలై దారి చూపాలి. అందుకు కృషి చేస్తున్న సక్కుబాయి వంటి టీచర్లు సమాజంలో ఎప్పుడూ అభినందనలు అందుకుంటూనే ఉంటారు. – నిర్మలారెడ్డి

మరిన్ని వార్తలు