మితిమీరిన మేకప్‌: గుర్తుపట్టలేనంతగా రణు..!

18 Nov, 2019 03:51 IST|Sakshi

ఓవర్‌ మేకప్‌: తన తప్పేముంది?!

ట్రోల్‌ అవుతున్న రాణో మండల్‌

దేవుడు ప్రసాదించిన చక్కటి స్వరంతో ఒక్కరోజులో దివ్యగాత్రి అయిపోయిన నిరుపేద మహిళ రణు మొండాల్‌ కొంతకాలంగా సోషల్‌ మీడియాలో పెద్ద స్టార్‌ సింగర్‌గా వెలిగిపోతున్నారు! ఇటీవలే బాలీవుడ్‌ నటుడు, మ్యూజిక్‌ డైరెక్టర్‌  హిమేశ్‌ రేష్మియాతో కలిసి ప్రస్తుతమింకా పూర్తి కాని ఒక సినిమా ఆడిషన్‌ కోసం రణు పాడిన ‘తేరీ మేరీ.. తేరీ మేరీ కహానీ’ పాట.. ఆమె గొంతులోంచి యూట్యూబ్‌ ద్వారా శ్రోతల చెవుల్లో అమృతాన్ని ఒలికించింది. లతా మంగేష్కర్‌ను తన ఆరాధ్య గాయనిగా కొలిచే రణు నిన్న మొన్నటి వరకు పశ్చిమ బెంగాల్‌ రైళ్లలో పాటలు పాడుకుంటూ తిరిగే యాచకురాలని మీరు చదవే ఉంటారు.

అక్కడి రాణాఘాట్‌కు చెందిన అహింద్రా చక్రవర్తి అనే ఇంజనీరు.. ట్రైన్‌లో వెళుతూ రణు మొండాల్‌ పాటను రికార్డు చేసి, ఆ వీడియోను తన ఫేస్‌ బుక్‌లో అప్‌లోడ్‌ చేశాడు. అలా ఆమె రేష్మియా దృష్టికి వచ్చారు. 59 తొమ్మిదేళ్ల ఈ సింగర్‌ ఇప్పుడు తన మేకప్‌తో మళ్లీ వైరల్‌ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఒక బ్యూటీ పార్లర్‌ ప్రారంభోత్సవానికి ఆదివారం అతిథిగా వచ్చిన రణు మితిమీరిన మేకప్‌తో ఉండగా అక్కడివారెవరో తీసిన ఫొటో ట్విట్టర్‌లో ఇప్పుడు విపరీతంగా తిరుగుతోంది. ఆమె ముఖంపై వేసిన ఫౌండేషన్‌ బాగా ఎక్కువైంది.

మేకప్‌ లేయర్‌లు కూడా పైకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై అనేక విధాలుగా ఇప్పుడు ఆమె ట్రోల్‌ అవుతున్నారు. రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్కరు మాత్రం సరిగ్గా అర్థం చేసుకోగలిగారు. ‘‘ఎందుకు అంతా నవ్వుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. తనకై తను ఆమె అలా ఎందుకు ఓవర్‌ మేకప్‌ చేయించుకుని ఉంటారు? కనీసం తనకు మేకప్‌ ఎక్కువైందన్న సంగతిని కూడా ఆమె గ్రహించి ఉండరు. ఆ గ్రహింపు ఆమెకు మేకప్‌ చేసినవారికైనా ఉందో లేదో!! ఇలా ట్రోల్‌ చేయడం చాలా అమానుషం’’ అని ట్విట్టర్‌ యూజర్‌ ఒకరు ఆమెను సమర్థించారు.

మరిన్ని వార్తలు