రాగాల పల్లకిలో హెర్మిటమ్మా...

18 Nov, 2014 00:13 IST|Sakshi
రాగాల పల్లకిలో హెర్మిటమ్మా...

జీవ ప్రపంచం
ఉత్తర అమెరికాలో ఎక్కువగా కనిపించే హెర్మిట్‌ను ‘పాటల పక్షి’ అంటారు. హెర్మిట్ పాడుతుంటే... కళ్ల ముందు అమృత ప్రవాహం కనిపిస్తుందని, ఆ పాట మనల్ని మరో లోకానికి తీసుకెళుతుందని, ప్రకృతిలో వినిపించే అరుదైన అద్భుతమైన గొంతు దానిదని...ఇలా భావుకంగా హెర్మిట్ గురించి చెప్పుకుంటారు. వెర్మంట్(అమెరికా) రాష్ట్ర పక్షి అయిన హెర్మిట్ ప్రస్తావన ప్రసిద్ధ కవి టి.యస్. ఇలియట్ ‘ది వేస్ట్ ల్యాండ్’లో కనిపిస్తుంది.  భావుకత తాలూకు భ్రమలో నుంచి హెర్మిట్ గాన ప్రతిభను ఎక్కువగా అంచనా వేశారా? లేక నిజంగానే దానిలో ప్రతిభ ఉందా? ఈ సందేహాలకు సమాధానాలు తాజా పరిశోధనలో దొరుకుతాయి. యూనివర్సిటీ ఆఫ్ వియన్నా (ఆస్ట్రియా) కు చెందిన పరిశోధకులు ఇటీవల హెర్మిట్‌పై పరిశోధన నిర్వహించారు.  రాగ జ్ఞానం ఉన్నప్పుడు గానం మరింత రాణిస్తుంది. ‘మరి హెర్మిట్‌కు ఆ జ్ఞానం ఉందా? లేక సహజంగానే ఆ గొంతులో పాట పలుకుతుందా?’
 
దీని గురించి పరిశోధకులు ఇలా చెబుతున్నారు: ‘‘ఒక గాయకుడు నోట్స్ ప్రకారం, లెక్క ప్రకారం ఎలాగైతే గానం చేస్తాడో... హెర్మిట్ పక్షులు కూడా అలాగే పాడుతాయి. తేడా ఏమిటంటే, హెర్మిట్ నోట్స్ మనకు కనిపించవు. అవి సహజంగా ఆ గొంతులో ఇమిడిపోయాయి.’’
 
మగ హెర్మిట్‌లు ఆరు నుంచి పది రకాలుగా పాడగలవు. ఆ గానం వేగంగా, హైపిచ్‌తో ఉంటుంది. తమ పరిశోధనలో భాగంగా గత అయిదు దశాబ్దాలకు చెందిన హెర్మిట్ రికార్డులను కూడా పరిశోధకులు లోతుగా విశ్లేషించారు. పధ్నాలుగు మగ హెర్మిట్‌లు పాడిన 144 భిన్నమైన పాటలను విశ్లేషించిన సంగీతకారిణి, జీవశాస్త్రవేత్త ఎమిలీ డోలి- ‘‘హెర్మిట్ గానాన్ని పరిశీలిస్తే... మానవ సంగీత సంప్రదాయానికి, జీవశాస్త్రానికి ఎంత దగ్గర సంబంధం ఉందో అర్థమవుతుంది’’ అంటున్నారు. ఏది ఏమైనా, గాయకులకు సాధనతో వచ్చే ఆరోహణ, అవరోహణ, విరుపు, హైపిచ్... మొదలైనవి హెర్మిట్ గొంతులో సహజసిద్ధంగా ఉండడం వరం అని చెప్పవచ్చు.

మరిన్ని వార్తలు