గొర్రెపిల్లల్ని కాస్తున్న పల్లె పడుచుగా!

20 Oct, 2019 01:14 IST|Sakshi

ఇన్నర్‌వ్యూ సండే స్పెషల్‌

గట్టి పిల్ల: రశ్మికా మందన్నా ‘ఇన్నర్‌వ్యూ’ ని తెలుసుకోవడం తేలికైన విషయమేమీ కాదు. చక్కటి ఆ చిరునవ్వుతోనే ‘చెప్పితీరాల్సిన’ సిట్యుయేషన్‌ని అలవోకగా దాటవేస్తారు రశ్మిక. అలాగని మొహమాట పడే అమ్మాయి కూడా కాదు. ‘‘మీకూ, విజయ్‌ దేవరకొండకు’ సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అట కదా’’ అని ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం విడుదల సందర్భంగా రశ్మిక హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఒక రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు ఆమె తనదైన చిరునవ్వుతో.. ‘‘అంత సీన్‌ లేదు’’ అని అనడం మీకు గుర్తుండే ఉంటుంది. ఏ పాత్రలోనైనా కుదురుగా ఇమిడిపోగల రశ్మిక ఏ ప్రశ్నకైనా తడబడకుండా సమాధానం చెబుతారు.

అందుకని ఆమెని ఇరుకున పెట్టడం అనే వృథా ప్రయాస మాని, ఆమె నటిస్తున్న సినిమాల్లో చిన్న చిన్న షాట్స్‌ని పాప్పరాజ్జీలు (వెంటాడే ఫొటో జర్నలిస్టులు) గుట్టు చప్పుడు కాకుండా నొక్కేస్తూ ఉంటారు. అలా నొక్కి వేయబడిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అందులో రశ్మిక గొర్రెపిల్లల్ని కాస్తున్న పల్లె పడుచుగా కనిపిస్తున్నారు! దాంతో ఈ అతిలోక సుందరి.. అతి సాధారణమైన ఈ సీన్‌ని ఏ సినిమా కోసం చేసి ఉంటారా అన్న డిబేట్‌ కూడా అప్పుడే నెట్‌లో మొదలైపోయింది. ప్రస్తుతం రశ్మిక.. పేరింకా ఖరారు కాని ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నారు.

గొర్రెల కాపరిగా ఆమె ఆ సినిమాలో కనిపించబోతున్నారా? లేక, ‘సుల్తాన్‌’ అనే తమిళ సినిమాకు ఆమె సంతకం చేశారు.. అందులో ఇలా నటించబోతున్నారా.. తేల్లేదు. ఏమైనా ఈ అందాల రాశి గొర్రెల కాపరిగా నటించడం తమకు అన్యాయం చేయడమేనని అని ఆమె అభిమానులు బాధపడిపోతున్నారు. ఈ విషయాన్ని రశ్మిక సన్నిహితులైన వారు ఆమెతో అంటే.. ఎప్పటిలా చిరునవ్వు నవ్వుతూ.. ‘‘క్యారెక్టర్‌లో కనిపించే అందం.. క్యారెక్టర్‌ వేస్తున్న నటిలో కనిపించే అందం కన్నా గొప్పది’’ అన్నారు తప్ప.. ఆ సీన్‌ తెలుగుదా, తమిళ్‌దా చెప్పలేదు. గట్టి పిల్లే. ఇంత గుట్టా?!

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా