దేవుడు ఇవ్వలేదు!

12 Apr, 2018 00:12 IST|Sakshi

కామెంట్‌ 

‘మాత్ర్‌’ సినిమా విడుదలై ఏడాది అయింది. ఆ తర్వాత బాలీవుడ్‌ రవీనా టాండన్‌  పెద్దగా వార్తల్లో లేరు. ఆమె పనుల్లో ఆమె ఉన్నారు. అయితే మంగళవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా ట్విటర్‌లో ప్రత్యక్షం అయ్యారు! ‘‘సెలబ్రిటీలను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తిరిగి మాట అనే హక్కును మాత్రం సెలబ్రిటీలకు దేవుడు ఇవ్వలేదు. ట్వీటర్‌ వచ్చాకైతే చాలా తేలికైపోయాం’’ అని ఎంతో ఆవేదనగా కామెంట్‌ పెట్టారు రవీనా. దీనిని బట్టి రవీనా మనసును ఎవరో బాగా గాయపరిచినట్లే ఉంది. రవీనా ముక్కుసూటి మనిషి. ఇలాంటి కామెంట్‌లను, వెబ్‌సైట్‌ల ఆకతాయి వేషాలను అస్సలు సహించరు. ఓసారి షాదీడాట్‌కామ్, షాదీటైమ్స్‌డాట్‌కామ్‌ తన అనుమతి లేకుండా తన ఫొటోలు వాడుకున్నందుకు ఆ రెండు సైట్‌ల మీద కేసు వేశారు. ఇంకోసారి ‘సత్యా సొల్యూషన్స్‌’ అనేవాళ్లు ‘మా వెబ్‌సైట్‌ వల్లే రవీనా, రవీనా భర్త కలుసుకున్నారు. ఆ తర్వాత భార్యాభర్తలయ్యారు’ అని ప్రకటించుకోవడం ఆమెను అగ్గిమీద గుగ్గిలం చేసింది.

ఆ సైట్‌ మీద కూడా రవీనా కేసు వేశారు. తన విషయమనే కాదు, సమాజంలోని అన్యాయాలను, దుశ్చర్యలను కూడా రవీనా ధైర్యంగా ఖండిస్తారు. అందుకు తాజా ఉదాహరణ.. పై ట్వీట్‌ పెట్టిన రోజే ఆమె మరో ట్వీట్‌ పెట్టి, రేప్‌ కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్‌ సెంగర్‌ను విమర్శించడం. దీనిపై కూడా ఆమెకు పర్సనల్‌గా బెదిరింపులు వచ్చాయి కానీ రవీనా ఏమాత్రం స్పందించలేదు. సెంగర్‌ యు.పి.ఎమ్మెల్యే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే అతడు అత్యాచారయత్నం కేసు నుంచి తప్పించుకోగలిగాడని కూడా రవీనా ట్వీట్‌ చేశారు. బహుశా ఆ ట్వీట్‌ విషయంలోనే రవీనా మనసును ఎవరో గాయపరచి ఉండాలి. 

మరిన్ని వార్తలు