ఖాదీ రవివర్మ

25 Feb, 2020 07:53 IST|Sakshi
రవివర్మ మునిమనుమరాలు రుక్మిణీవర్మ ,రవివర్మ చిత్రాల నేత చీరతో గౌరంగ్‌ షా

నవ కళ

రవివర్మ చిత్రాలు గోడల మీద పెయింటింగ్స్‌గా, క్యాలెండర్లుగా కనిపించడం కొత్తకాదు. కాని అవి ఖాదీ వస్త్రాల మీదకు తర్జుమా కావడం పూర్తిగా కొత్త. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా రవివర్మ ముని
మనవరాలు రుక్మిణి వర్మ, డ్రస్‌ డిజైనర్‌ గౌరంగ్‌ షా ఖాదీ చీరల మీద రవివర్మ బొమ్మలను రూపు కట్టించారు. వీటి ప్రదర్శన ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ ముని మనుమరాలు రుక్మిణి వర్మ నాట్యకారిణి. భరతనాట్యం, కథక్, కథాకళి ప్రదర్శనలు అనేకం ఇచ్చారు. బెంగళూరులో డాన్స్‌ స్కూల్, ‘రాజా రవివర్మ హెరిటేజ్‌ ఫౌండేషన్‌’ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రవివర్మ చిత్రాల ప్రదర్శన మీద ఆమె ముందు నుంచి కృషి చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం డ్రస్‌ డిజైనర్‌ గౌరంగ్‌ షా ఆమెను కలిసి ఒక ప్రతిపాదన చేశారు. ‘గాంధీజీ 150 జయంతి మరో ఐదేళ్లలో రానున్న సందర్భంగా ఆయనకు నివాళిగా ఖాదీ వస్త్రాల మీద రవివర్మ చిత్రాలను రూపుదిద్దుతాను. అందుకు అంతగా వ్యాప్తిలోకి రాని చిత్రాలు ఇవ్వండి’ అని ఆ ప్రతిపాదన సారాంశం. అందుకు సమ్మతించిన రుక్మిణి రవివర్మ చిత్రాల్లో అరుదైన ఇంత వరకు ఎక్కువగా ప్రదర్శితం కాని ముప్పై చిత్రాలను ఇచ్చారు.

ఆ చిత్రాలను ఖాదీ వస్త్రం మీద ఆవిష్కరింప చేయడం అనే మహా యజ్ఞాన్ని తలకెత్తుకున్నారు గౌరంగ్‌. ఐదేళ్ల సుదీర్ఘ శ్రమ తర్వాత ఆ బొమ్మలను ఖాదీ వస్త్రాల మీదకు తీసుకురాగలిగారు. ‘‘గాంధీజీ ఫాదర్‌ ఆఫ్‌ నేషన్‌. రవివర్మ ఫాదర్‌ ఆఫ్‌ ఆర్ట్‌. ఈ ఇద్దరి జయంతి–వర్థంతి ఒకే రోజు. గాంధీకి ఇష్టమైన ఖాదీలో రవివర్మ చిత్రాలను రూపొందించడానికి కారణం వాళ్లిద్దరినీ ఒక వేదిక మీదకు తీసుకు రావడమే. ఇందు కోసం రుక్మిణి వర్మను సంప్రదించినప్పుడు ఆమె వినూత్నమైన చిత్రాల హక్కులను ఇచ్చి మరీ ప్రోత్సహించారు. రవివర్మ చిత్రాల డిజిటల్‌ రూపాలను ఖాదీ వస్త్రాల మీద జాందానీ నేతలో పునఃసృష్టించాం. ఈ బొమ్మలు ఉన్న చీరల మొదటి ప్రదర్శనను 2019 అక్టోబర్‌ రెండవ తేదీన ముంబయిలో పెట్టాం. తర్వాత అహ్మదాబాద్, ఢిల్లీలో ప్రదర్శించాం. ఇప్పుడు హైదరాబాద్‌లో పెట్టాము. వచ్చే నెల బరోడాలో ఉంది. ఇలా దేశంలోని ప్రముఖ నగరాలన్నింటిలో ఎగ్జిబిషన్‌ పెట్టిన తర్వాత విదేశాలకు తీసుకెళ్లాలనేది నా ఆలోచన. ’’ అన్నారు గౌరంగ్‌ షా.

ప్రదర్శనలో...
హైదరాబాద్‌ ‘సప్తపరి’్ణలో ప్రదర్శితమవుతున్న ముప్పై చిత్రాల్లో దాదాపుగా పాతిక చిత్రాలు స్త్రీ ప్రధానంగా ఉన్నాయి. రిద్ధి– సిద్ధిలతో వినాయకుడు, ఉయ్యాల ఊగుతున్న మోహిని, సఖులతో పరిహాసాల మధ్య శకుంతల, వనవాసంలో సీత, సుభద్రను ఓదారుస్తున్న అర్జునుడు, కేరళ సంప్రదాయ దుస్తులలో వీణ మీటుతున్న సరస్వతి మొదలైన చిత్రాలు చీరల మీద నేతలో ఒదిగిపోయాయి. ఒక చిత్రంలో కృష్ణుడి ఆస్థానంలో ఇరవై మంది కొలువుదీరి ఉన్నారు. ఒక్కొక్కరి ముఖంలో ఒక్కో భావం, కళ్లలో కూడా చిత్రవిచిత్రమైన భావాలు వ్యక్తమవుతున్నాయి. ఆ భావాలు చీర మీద కూడా యథాతథంగా రూపుదిద్దుకున్నాయి. హరి–హర బేటీ చిత్రంలో అయితే ఒకే తల రెండుగా భ్రమింప చేస్తుంది. శివుడు అధిరోహించిన నంది వైపు నుంచి చూస్తే నంది తల కనిపిస్తుంది. విష్ణుమూర్తి వైపు నుంచి చూస్తే ఏనుగు తల కనిపిస్తుంది. రవివర్మ చిత్రకళలో చూపించిన ఇంతటి వైవిధ్యాన్ని నేతలో తీసుకురావడానికి నేతకారులకు మూడేళ్లు పట్టింది. 150/150 నేతలో ఆరువందల రంగులను ఉపయోగించారు. శ్రీకాకుళంలోని జాందానీ నేతకారుల చేతుల్లో వస్త్రం మీద రూపం పోసుకున్న చిత్రాలివి.– వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు