పిల్లల పేర్ల కృతజ్ఞత

14 Oct, 2019 04:47 IST|Sakshi

రావూరి భరద్వాజ (1927–2013) అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. వ్యవసాయ కూలీగా, పశువుల కాపరిగా, రంపం లాగే పనివాడిగా, కొలిమి దగ్గర తిత్తులూదే కూలీగా, పేపర్‌ బాయ్‌గా ఎన్నో రకాల పనులు చేశారు. చదివింది ఏడవ తరగతే. పదిహేడో యేట మొదలుపెట్టి, కథానికలు, నవలలు, నవలికలు, కవితలు, వ్యాస సంపుటాలు, నాటికలు, స్మృతి సాహిత్యంతో కలిపి సుమారు 190 పుస్తకాలు రాశారు. జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారు. ఆయన ప్రసిద్ధ నవల పాకుడు రాళ్లు.

రావూరి తన ఇంటికి పెట్టుకున్న పేరు కాంతాలయం. ఆయన సహధర్మచారిణి కాంతం. కన్నబిడ్డలా చూసేది కాబట్టి భార్య అయినా ఆమెను ‘కాంతమ్మ’ అనే పిలిచేవారు. కష్ట సమయాల్లో అండగా నిలిచినవారికి రావూరి చూపిన కృతజ్ఞత గొప్పది. ఆయనకు అయిదుగురు సంతానం. నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. వారికి పేర్లు ఎలా పెట్టారో ఆయన ఇలా చెప్పారు:  ‘‘నాకు ప్రూఫ్‌రీడర్‌గా అవకాశం ఇచ్చిన ఆలపాటి రవీంద్రనాథ్‌ పేరును నా పెద్దకుమారుడికి రవీంద్రనాథ్‌గా పెట్టాను. ఆకాశవాణిలో ఉద్యోగం కల్పించిన త్రిపురనేని గోపీచంద్‌ పేరుని నా రెండోకొడుక్కి గోపీచంద్‌గా నామకరణం చేశాను. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని సమయంలో నాకూ నా కుటుంబానికీ ఉచితంగా వైద్యం చేసిన వైద్యుని పేరును నా మూడో కొడుక్కు బాలాజీగా పెట్టుకున్నాను. నా చిన్న కొడుక్కేమో మా నాన్న పేరు కలిసేలా కోటీశ్వరరావు అని నామకరణం చేశాను. మా తండ్రి పేరు కోటయ్య, తల్లి పేరు మల్లికాంబ. ఇక నా ఏకైక కుమార్తె పద్మ. ఆ పేరు వెనుక కూడా ఓ సంఘటన ఉంది.

1942–44 ప్రాంతంలో ఓ మూడు రోజుల పాటు అన్నంలేక నీరసించి స్పృహ తప్పి పడిపోయాను. అప్పుడు పద్మక్క అనే ఆవిడ నాకు అన్నం పెట్టింది. ‘బాబూ, మాది మాల కులం మీరు తింటారా?’ అని అడిగింది. ‘అదేం లేదమ్మా తప్పకుండా తింటాను’ అని చెప్పాను. వెంటనే ఇంటికి తీసుకెళ్లి ఓ గిన్నెలో అన్నం వేసి, పులుసు పోసింది. ఆ పులుసులో ఓ చేప కనిపించింది. అప్పుడన్నాను ‘అమ్మా నేను మాంసాహారం తినను’ అని. అప్పుడు తన కొడుక్కు పెట్టిన గిన్నెను నాకు ఇచ్చి, అందులో పాలు పోసి ‘ఇంట్లో కనీసం బెల్లం కూడా లేకపోయెనే’ అని నొచ్చుకుంటూ కొంచెం ఉప్పు వేసి పెట్టింది. ఆమె ఆప్యాయతకు గుర్తుగా నా కూతురికి పద్మ అని పేరు పెట్టుకున్నాను’’.
డాక్టర్‌ పోతిరెడ్డి చెన్నకేశవులు 

మరిన్ని వార్తలు