అరుదైన రాయలసీమ తొలితరం కథలు....

27 Feb, 2015 23:31 IST|Sakshi

తెలుగు కథ పుట్టుక గురించి పరిశోధన ఊపు మీద ఉందనే చెప్పాలి. గురజాడ ‘దిద్దుబాటు’ను తొలికథగా గుర్తించి తొలి కథ పుట్టుక సంవత్సరాన్ని 1910గా స్వీకరించి చాలా కాలమైంది. ఆ తర్వాత అంతకంటే ముందు భండారు అచ్చమాంబ రాసిన కథలు వెలుగుకు వచ్చాయి. ఆ పైన కూడా 1910 కంటే ముందు వచ్చిన అనేక కథలతో ఇటీవలే వివినమూర్తి సంపాదకత్వంతో ఒక సంకలనం వెలువడింది. ఎవరు ఎన్ని కథలు రాసినా శిల్పం రీత్యా వస్తువు రీత్యా 1910లో వెలువడిన ‘దిద్దుబాటు’ లేదా ‘మీ పేరేమిటి?’ సంపూర్ణాకృతి దాల్చిన తెలుగువారి తొలికథగా పండితులు గుర్తిస్తారు. అయితే అంత మాత్రం చేత అంతముందు ఆ తర్వాత కూడా వివిధ ప్రాంతాల్లో వెలువడిన కథలను విస్మరించడం చాలా పెద్ద లోటు అవుతుంది.

ఆ పని ఎన్ని వైపుల నుంచి ఎన్ని విధాలుగా జరిగితే అంత మంచిది. రాయలసీమ తొలితరం కథకుల మీద పరిశోధన కానీ ప్రచారం కానీ ఆశించినంతగా జరగలేదు. నేల అందిన మేరకు వెనుకకు నాదమునిరాజు (కడప), కె.సభా (చిత్తూరు), జి.రామకృష్ణ (అనంతపురం) వరకు నడవగలిగారు. వీరే ఇటీవలి వరకూ రాయలసీమ తొలితరం కథకులు. అయితే కడపజిల్లాకు చెందిన అయ్యగారి నరసింహమూర్తి అంతకంటే ముందు అంటే దాదాపు 1926 కాలంలోనే రాసిన కథలు పరిశోధక విద్యార్థి తవ్వా వెంకటయ్య పరిశోధనలో దొరికాయి. ఒక్క నరసింహమూర్తే గాక మరో ఇరవై మంది రాయలసీమ తొలితరం కథకుల్ని వారు రాసిన కథల్నీ సేకరించగలిగారు. ఈ కథలు రాయలసీమవాసులకేగాక తెలుగు కథాభిమానులందరికీ చాలా విలువైన ఆస్తి.

ఫ్యూడల్ స్వభావం వల్ల కావచ్చు, ఇంగ్లిష్ విద్యను (సాహిత్యాన్ని) అందుకోవాలనే కుతూహలానికి మెజారిటీ సీమవాసులు దూరంగా ఉండటం వల్ల కావచ్చు లేదా పద్యవ్యామోహం విపరీతంగా ఉండటం వల్ల కావచ్చు సీమ వచనం చాలా ఆలస్యంగా ఊపిరిపోసుకుంది. కళింగాంధ్ర, తెలంగాణ, సర్కారు ప్రాంతాల్లో వాడుక భాషా ఛాయలు కొత్తగా విస్తరించినా సీమలో వచనం గ్రాంధిక ధోరణిని వదిలించుకోవడానికి సమయం పట్టింది. అయినప్పటికీ కథల్లోని వస్తువు, మానవాంశ, స్థానిక పరిస్థితులు, జీవన విధానాలు... వీటిని వ్యక్తం చేయడంలో సీమ తొలితరం కథకులు ఏమాత్రం వెనక లేరు. ఆ విషయాన్నే ఈ సంకలనం- రాయలసీమ తొలితరం కథలు- రుజువు చేస్తోంది.

తన పరిశోధనలో సేకరించిన విలువైన కథల్లో 25 కథలను ఎంచి వెంకటయ్య వెలువరించిన ఈ పుస్తకం చాలా విలువైనది. ఎవరికీ పట్టని బిడ్డను ఎత్తుకోవడం లాంటిది. ఇంత శ్రమ చేసి సేకరించిన ఈ కథలను ఎంతో గొప్పగా ఘనంగా అచ్చువేసుకోవాల్సింది పోయి కొద్ది పాటి ఆర్థిక సర్దుబాటు కోసం దిక్కులు చూడవలసి రావడం విషాదం. ఇది ఎవరో ఒకరో ఇద్దరో డబ్బు సర్దుబాటు చేస్తే రావలసిన పుస్తకం కాదు. సీమ పెద్దలు తలచుకుంటే అన్ని కథలూ నాణ్యమైన ముద్రణతో ఒక బృహత్‌గ్రంథంగా వెలువడాలి. అది ప్రతి పరిశోధనాలయానికి చేరాలి. అప్పుడే ఈ పరిశోధనకు తగ్గ విలువ.
 రాయలసీమ తొలితరం కథలు, సేకరణ: తవ్వా వెంటకటయ్య, వెల: రూ.120 ప్రతులకు: 9703912727
 

మరిన్ని వార్తలు