మాటకు భూతద్దం

23 Jun, 2016 22:54 IST|Sakshi
మాటకు భూతద్దం

 కాంట్రవర్సీ


‘రేప్ తప్పనిసరి అయినప్పుడు ఆస్వాదించాలి’  ఇదో విదేశీ నానుడి. అయితే మన దగ్గర రేప్ సంఘటనలు జరిగినప్పుడు ఓ పెద్దాయన ఈ మాటను స్టేట్‌మెంట్‌గా వాడి వివాదానికి మూలమయ్యాడు. అభాసు పాలయ్యాడు. విషయం తీవ్రమైనది, సున్నితమైనదీ అయినప్పుడు చేసే వ్యాఖ్యలు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఈ పెద్దమనిషిలా పరాభావం చెందుతారు. అయితే ప్రతి వాళ్ల వ్యాఖ్యలను, ప్రతి విషయాన్నీ అంతే సునిశితంగా జల్లెడబట్టాల్సిన అవసరంలేదు. సునిశితంగా పరిశీలించడమూ అనవసరం!

 

ఈ ప్రస్తావన ఎందుకు అంటే...
మొన్న సల్మాన్‌ఖాన్ చేసిన వ్యాఖ్యల గురించి రేగిన దుమారం తెలిసిందే! ’సుల్తాన్’ సినిమాలో తాను ఫైటర్‌తో ఫైట్ చేయడానికి చాలా శ్రమపడ్డానని సల్మాన్ చెప్తూ ‘ఆ సమయంలో రేప్‌కి గురైన అమ్మాయిలా ఫీలయ్యా’నని చెప్పాడు. ఈ మాటలకు దేశంలోని మహిళా సంఘాలన్నీ అగ్గి మీద గుగ్గిలం అయ్యాయి. జాతీయ మహిళా కమిషన్ ఏకంగా క్షమాపణే కోరింది. సల్మాన్‌కి బదులు సల్మాన్ తండ్రి సలీమ్ క్షమాపణ చెప్పి గండం గట్టెక్కించాడు. కొడుకు తప్పు మాట్లాడితే తండ్రి అపాలజీ చెప్పడమేంటనే నిరసనా వ్యక్తమయిందనుకోండి అది వేరే విషయం!

 
స్టేట్‌మెంట్లు... వ్యాఖ్యలు  సమయం, సందర్భాన్ని బట్టి ఉండాలి. వీటిల్లో తేడా వస్తే మొదటికే మోసం వస్తుందనేది గమనించాల్సిన విషయం. అయితే సల్మాన్ విషయంలో దీనికి మినహాయింపు ఉందనే అభిప్రాయమూ వ్యక్తమైంది.

 

కారణం..
అది అసంబద్ధమైన వ్యాఖ్య తప్ప దురుద్దేశంతో అన్నది కాదు అంటారు కొంతమంది. ఆయన ఇచ్చిన ఉపమానం సరైంది కాదు తప్ప స్త్రీల పట్ల తప్పుడు అభిప్రాయంతో అన్న మాట కాదనేది వాళ్ల వాదన. అది తెలియనితనమే కాని పురుషహంకారం కాదు అంటున్నారు.  ఈ మధ్య మనుషులం ప్రతిదానికీ అతిగా స్పందిస్తున్నామేమో. ఆ  అతి స్పందనలోంచే ఈ గగ్గోలంతా అంటున్నారు ఆ పెద్దలు.  సమాజంలో కాస్త పేరుప్రతిష్టలు, గౌరవమర్యాదలున్న వ్యక్తులు ఏం మాట్లాడినా భూతద్దంలోంచి చూస్తున్నాం.. ఈ లెక్కన ఏ విషయం మీద ఎవరూ ఏమీ మాట్లాడలేని స్థితి రావచ్చు అని హెచ్చరిస్తున్నారు.  సల్మాన్ వ్యాఖ్యలను సమర్థిస్తూ పూజాబేడీ ఈ మాటే అంది..  ‘సల్మాన్ వాడిన మాట తప్పయితే పిచ్చి, మతిస్థిమితం లేకపోవడం, ఉరి, హత్య, ఉన్మాదం లాంటి మాటలను ఉచ్చరించడం కూడా తప్పే’ అన్నారు. అంటే మనం ఓవర్‌సెన్సిటైజ్ అవుతున్నాం అంటారు ఆమె.

 
కులాలను దూషిస్తూ, కించపరుస్తూ ఉన్న సామెతలు, నానుడులు, స్త్రీలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మాటలు, వ్యాఖ్యలు, చిన్నపిల్లలను ఇబ్బంది పెట్టే మాటలు, మత ఆచారవ్యవహారాలను అవమానపరుస్తూ చేసే వ్యాఖ్యలు, స్టేట్‌మెంట్లు వంటి వాటిని నిలువరించడంలో అర్థం ఉంది కాని ప్రతి మాటను ఆ సందర్భాన్ని అర్థం చేసుకోకుండా  సెన్సార్ కట్‌లు విధిస్తే భవిష్యత్తులో భావస్వేచ్ఛ ఉంటుందికాని వ్యక్తీకరణస్వేచ్ఛ హరించే ప్రమాదం ఉందని వాపోతున్నారు పెద్దలు!

 

తండ్రి  క్షమాపణ ఏంటి?
నిజమే.. ఈ మధ్య ఏం మాట్లాడినా తప్పే అవుతోంది.  అంటే... సాధారణ జనం ఏం మాట్లాడినా చెల్లుతుంది కాని ఓ ఇమేజ్ ఉన్న మనుషులు కాస్త ఆచితూచి మాట్లాడాల్సిన అవసరమేర్పడుతుంది. అయితే సల్మాన్ అన్న మాట మరీ అభ్యంతరకరమైనది కాదు కానీ అసంబద్ధమైందని చెప్పొచ్చు. ఆయన చెప్పిన ఉపమానం సరైంది కాదు. ఎవరికైనా స్త్రీలకు సంబంధించిన ఉపమానాలు, పదాలు చాలా సులభంగా తడ్తాయి. అందుకే ఇలాంటి వాటిని చాలా తేలికగా అనేస్తారు. అయితే సల్మాన్ వ్యాఖ్యకు ఉద్యమాలు చేయాల్సిన అవసరంలేదు. ఆయన కావాలని ఆ మాట అనలేదు. స్త్రీ పట్ల ఆయనకు దురుద్దేశమేమీ లేదు. చటుక్కున ఒక ఉపమానం తోచింది. అనేశాడు. అలాంటప్పుడు క్షమాపణ ఆయన చెప్పక వాళ్ల నాన్న చెప్పడమేంటి? అన్నది సల్మానే కాబట్టి క్షమాపణా ఆయనే ఇవ్వాలి.  - మృణాళిని, రచయిత, ప్రొఫెసర్

 

మాట్లాడడమే కష్టం
ఈ మధ్య ప్రముఖులు ఏం మాట్లాడినా విపరీతమైన అర్థాలు తీసి క్షమాపణలు అడగడం.. దాని మీద కోర్టుకెళ్లడాలు పరిపాటి అయింది. ఓవర్‌సెన్సిటైజ్ అవుతున్నామేమో! మాట్లాడిన ప్రతిదాన్నీ సీరియస్‌గానే తీసుకొని ఈకలు ఈకి, పీకలు పీకితే అసలు మాట్లాడడమే కష్టమవుతుంది. - యండమూరి వీరేంద్రనాథ్,  ప్రముఖ రచయిత

 

మరిన్ని వార్తలు