పద్మావతి 2

1 Feb, 2018 00:38 IST|Sakshi
​​​​​​​ ‘ఆమీ’లో కమలాదాస్‌ గా  ముంజు వారియర్‌ 

వివాదం 

ఆశ్చర్యపోకండి! ‘ఆమీ’ అనే మలయాళీ సినిమా ఇది! దీన్ని బ్యాన్‌ చెయ్యాలని కేరళలో ఇప్పుడు ప్రదర్శనలు జరుగుతున్నాయి. కేరళ హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలయింది. ‘పద్మావతి’ స్టోరీ, ‘ఆమీ’ స్టోరీ వేర్వేరు. అయినప్పటికీ, పద్మావతికి ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయో, అన్ని అడ్డంకులూ ‘ఆమీ’కీ ఎదురవుతున్నాయి.  ఇస్లాం మతం స్వీకరించిన కమలాసురయ్య (కమలాదాస్‌) అనే కేరళ రచయిత్రి బయోగ్రఫీ ‘ఆమీ’. 75 ఏళ్ల వయసులో 2009లో ఆమె మరణించారు. కేరళలో ‘లవ్‌ జిహాద్‌’ ధోరణి మొదలైందే కమలాదాస్‌ వల్ల కాబట్టి, ఇప్పుడు ఆమె జీవిత చరిత్రపై వస్తున్న సినిమాను విడుదల కాకుండా సెన్సార్‌ బోర్డును ఆదేశించాలని కేరళ సంప్రదాయవాదులు కోరుతున్నారు.

మతాంతర వివాహాలకు ఈ సినిమా ప్రేరణ కలిగించి, సమాజాన్ని దారి తప్పించే ప్రమాదం ఉందని వారి ఆందోళన. పిటిషన్‌ వేసింది కె.పి.రామచంద్రన్‌ అనే లాయర్‌. కమలాదాస్‌ బయోగ్రఫీ ఇప్పటికే ‘లవ్‌ క్వీన్‌ ఆఫ్‌ మలబార్‌’ అనే పుస్తకంగా కూడా తర్జుమా అయింది. దాన్నుంచి కొన్ని ముఖ్యమైన భాగాలను తీసుకుని దర్శకులు కమల్‌ ‘ఆమీ’ని చిత్రీకరించారు. పుస్తకం రాసింది కెనడా రచయిత్రి మెర్రీలీ వైస్‌బోర్డ్‌. కమల తను స్వీకరించిన మతంపై తర్వాత్తర్వాత విశ్వాసం కోల్పోయిందని మెర్రీలీ ఆ పుస్తకంలో రాసినట్లు కూడా రామచంద్రన్‌ తన పిటిషన్‌లో ప్రస్తావించారు.

 

మరిన్ని వార్తలు