ఫస్ట్ బ్యాచ్ వచ్చేస్తోంది!

25 Oct, 2015 03:39 IST|Sakshi
ఫస్ట్ బ్యాచ్ వచ్చేస్తోంది!

రెడీ టు ఫైట్
కాలం మారింది. కాలం మారింది అంటే మగాళ్లు మారారని! మొదట్లో ఆడవాళ్లు ఉద్యోగాలకు పనికిరారు అనేవారు. ఇప్పుడు ఈ ఉద్యోగానికనో, ఆ ఉద్యోగానికనో మాత్రమే పనికిరారని అంటారు. అంటే మేల్ థింకింగ్ కొంత మెరుగైనట్టే! కానీ ఈ ‘కొంత’... ‘పూర్తిగా’ ఎప్పుడవుతుంది? ఆడవాళ్ల శక్తిసామర్థ్యాల విషయంలో మగవాళ్ల ఆలోచనా ధోరణి పూర్తిగా ఎప్పటికి పాజిటివ్ రూట్‌లోకి వస్తుంది? ఎప్పటికైనా వచ్చి తీరుతుంది. అప్పటి వరకు జెండర్ వాదనలు, చర్చలు జరుగుతూ ఉండడం ఆరోగ్యమే తప్ప ఎవరికీ హానికరం కాదు.
 
‘ఆడవాళ్లు, వాళ్లకు అనువైన ఉద్యోగాలు’ అంటూ ఓ పెద్దాయన చేసిన కామెంట్ మీద ఆ మధ్య ఇండియాలో పెద్ద డిబేట్ జరిగింది. ఈ డిబేట్ కారణం అయిన వ్యక్తి సరదాగా ఆ కామెంట్ చేయలేదు. వ్యంగ్యంగా చేయలేదు. కోపంగానో, పురుషాధిక్యంతోనో చేయలేదు. సిన్సియర్‌గా తను నమ్మి, నమ్మినదాన్ని బయటికి చెప్పారు. ఆయన పేరు మనోహర్ పారిక్కర్. మన రక్షణ శాఖ మంత్రి.
 
ఖదక్‌వాస్లా (మహారాష్ట్ర)లోని నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో గత మే 30న పాసింగ్ అవుట్ పరేడ్‌లో మాట్లాడుతున్నప్పుడు ఆడవాళ్లను యుద్ధరంగంలోకి తీసుకునే విషయం ప్రస్తావనకు వచ్చింది. అప్పుడాయన స్పష్టంగా ఒక మాట చెప్పారు. ‘‘యుద్ధంలోకి, ఆయుధాలు పట్టుకుని పోరాడే బాధ్యతల్లోకి మహిళల్ని తీసుకునే ప్రసక్తే లేదు’’ అని! అందుకు ఆయన చెప్పిన కారణం..  మహిళలు బందీగా దొరికితే వారిని శత్రుదేశ సైనికులు చిత్రహింసలకు గురిచేయడం తేలిక. అందుకే యుద్ధభూమిలోకి వారికి నో ఎంట్రీ అని.
 
పారిక్కర్ భయం అర్థవంతమైనదే. అర్థం చేసుకోదగినదే. మరి యుద్ధరంగంలోకి వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్న మగువల మాటేమిటి? వాళ్లు తమ ఆసక్తిని చంపుకోవలసిందేనా? శక్తి సామర్థ్యాలను, దేశభక్తిని నిరూపించుకునే గొప్ప అవకాశాన్ని ఈ దేశం యువకులకు మాత్రమే ఇస్తుందా?
 
స్త్రీలు ఉద్యోగాలు చేయడం గురించి, ఆఫీసులలో స్త్రీ ఉద్యోగుల వల్ల తలెత్తే సమస్యల గురించి ఎవరు ఏం మాట్లాడినా దానికంత  ప్రాముఖ్యం ఇవ్వనక్కర్లేదు. స్త్రీ వల్ల ఒక సమస్య వచ్చిందంటే దాని వెనుక కచ్చితంగా పురుషుడొకడు ఉండి ఉంటాడు. స్త్రీ చేయలేదని సమాజం అంటున్న, అనుకుంటున్న ఉద్యోగాలేవేనా ఉన్నాయి అంటే, వాటిని పురుషులు సమర్థంగా నిర్వహిస్తున్నారనీ అర్థం చేసుకోనక్కర్లేదు.
 
అర్హతలు, ఆసక్తి ఉండీ స్త్రీ అయినంత మాత్రాన అవకాశాన్ని పొందలేకపోవడం నాగరిక సమాజపు లక్షణం కాదు. బలాలు, బలహీనతలు, పరిమితులు స్త్రీ పురుషులిద్దరికీ ఉండేవే. వాటిని అనుసరించే సమాజం తనకు కావలసిన దాన్ని తను స్వీకరిస్తుంది. ఇప్పుడలాగే వైమానిక దళంలోకి ఆడవాళ్లను ‘ఫైటర్ పెలైట్‌గా’ స్వీకరిస్తోంది! గుడ్ న్యూస్ ఏంటంటే... ఫస్ట్ బ్యాచ్ ఉమన్ ఫైటర్స్ 2016 జూన్‌లో బయటికి వస్తున్నారు. పారిక్కరే ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందు ‘నో’ అన్న మంత్రిగారు ఆర్నెల్ల తర్వాత నిన్ననే ‘ఎస్’ అన్నారు. కాలం మారుతోంది. అంటే మగాళ్లు మారుతున్నారని మాత్రమే కాదు. మార్పు కోసం మహిళలు ఫైట్ చేస్తున్నారని కూడా.  
- భావిక

మరిన్ని వార్తలు