రియల్ ఖిలాడీ

23 May, 2014 22:59 IST|Sakshi
రియల్ ఖిలాడీ

బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ అంటే టక్కున గుర్తొచ్చేది ఖిలాడీ సిరీస్ సినిమాలు. చెఫ్ ఉద్యోగం నుంచి వందల కోట్ల రూపాయల సినిమాలతో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టే స్థాయికి ఎదిగిన అక్షయ్‌కుమార్.. పెట్టుబడుల్లోనూ ఖిలాడీనే అనిపించుకుంటున్నాడు. బాండ్లు, ఫిక్సిడ్ డిపాజిట్లు, బీమా పాలసీలు మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేసే అక్షయ్ .. ఎక్కువగా రియల్టీ వైపు మొగ్గు చూపుతాడు.

ముంబైలో సంపన్నులు నివసించే లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో అపార్ట్‌మెంట్, జుహూ ప్రాంతంలో బంగళా, అదే ప్రాంతంలో మరో లగ్జరీ ప్రాజెక్టులో ఇంకో అపార్ట్‌మెంట్ కొన్నాడు. దేశీయంగానే కాదు.. విదేశాల్లో కూడా భారీగానే ప్రాపర్టీపై ఇన్వెస్ట్ చేశాడు అక్షయ్. దుబాయ్‌లో అమితాబ్ బచ్చన్ ఇంటికి పక్కనే మరో విలాసవంతమైన విల్లాను కొనిపెట్టుకున్నాడు.

ఇటు మారిషస్‌లోనూ, అటు కెనడాలోనూ కూడా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఉన్నాయి అక్షయ్‌కి. ఇదే కాదు.. వ్యాపారపరమైన తెలివితేటలు కూడా బాగానే ఉన్నాయతనికి. ఏదైనా మంచి ప్రాజెక్టు తగిలిందంటే.. ప్రారంభ దశలోనే రెండు, మూడు ఫ్లాట్లు కొనేస్తాడు. నిర్మాణం పూర్తి కావొచ్చే దశలో మంచి రేటు రాగానే అమ్మేస్తాడు. ఈ విధంగా ఇటు సినిమాలు, అడ్వర్టైజ్‌మెంట్లు.. అటు రియల్టీ వ్యాపారంలో దూసుకెళ్తున్నాడు.
 
అక్షయ్ కుమార్ రియల్టీ పెట్టుబడుల విషయంలో కొన్ని సెంటిమెంట్ కోణాలు కూడా ఉన్నాయి. జుహూ బీచ్ బంగళాని అతను కొనడం వెనుక అచ్చం సినిమా తరహా ప్రత్యేక కథ ఉంది. సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడుతున్న సమయంలో సదరు ఖాళీ బంగళా దగ్గర ఫొటో షూట్ కోసం ప్రయత్నించాడు అక్షయ్. కానీ, న్యూసెన్స్ చేస్తున్నారంటూ.. ఆ బంగళా వాచ్‌మన్.. అక్షయ్‌ని, ఫొటోగ్రాఫర్‌ని అక్కణ్నుంచి తరిమేశాడు.

అటుపైన స్టార్‌డమ్ వచ్చిన తర్వాత.. పట్టుపట్టి అదే బంగళాని కొనుక్కున్నాడు అక్షయ్. అలాగే, కొన్నాళ్ల క్రితం రౌడీ రాథోడ్ సినిమాను చిత్రీకరించిన ములుంద్ ప్రాంతంలో నిర్మాణదశలో ఉన్న ఒక ప్రాజెక్టులో 4 ఫ్లాట్స్ బుక్ చేసుకున్నాడట.  ఇవి ఇన్వెస్ట్‌మెంట్ కోసం కాదని.. ఆ ప్రాంతంతో తన అనుబంధానికి గుర్తుగా సావనీర్లుగా వాటిని కొన్నాడు.
 

మరిన్ని వార్తలు