ఓ కమల కన్నీటి కథ

6 Aug, 2018 00:40 IST|Sakshi
భర్త సుదర్శన్‌తో కమల (ఫైల్‌ ఫోటో)

కట్టుకున్న భార్యను కన్నుల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన భర్త..  మద్యానికి బానిసై, చేసిన అప్పులు తీర్చడానికి తన భార్యను గల్ఫ్‌లోని వ్యాపారికి అమ్మేశాడు. ఆ బాధితురాలికి అక్కడి అరబ్బు షేక్‌లు నరకం చూపించారు. వారి  బారి నుంచి ఎలాగో తప్పించుకుని తనను గల్ఫ్‌కు రప్పించిన ఏజెంట్‌ దగ్గరికి వెళ్లి గోడు వెళ్లబోసుకుంటే ఆ ఏజెంటు తన భార్యతో కలిసి ఆమెపై చెయ్యి చేసుకున్నాడు. చీకటి గదిలో బంధించారు. బతికి బయటపడతానో లేదో అనే సందేహంతో రోజులు వెళ్లదీసిన ఆమెకు ఎట్టకేలకు నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత, మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేష్‌రెడ్డి, తెలంగాణ జాగృతి ప్రతినిధి నవీన్‌ చారీల చొరవతో విముక్తి లభించింది. కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లికి చెందిన అంగ కమల వ్యథ ఇది. భర్త చేతిలో మోసపోయి దేశం కాని దేశంలో ఆమె పడిన కష్టాలు.. ఆమె మాటల్లోనే..!

ప్రేమించి పెళ్లాడాడు
నా భర్త సుదర్శన్‌ది మా ఊరే. 25 ఏళ్ల కిందట నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతనికి భార్యా పిల్లలు ఉన్నారు. ప్రేమించానని వెంటపడటంతో కాదనలేకపోయాను. మాకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ఇంటర్‌ వరకు చదివి కూలి పని చేస్తున్నాడు. చిన్న కొడుకు ఇప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. పెళ్లయ్యాక కొన్నేళ్ల పాటు మా కాపురం సజావుగానే సాగింది. గల్ఫ్‌ దేశాల్లో పని చేసే సుదర్శన్‌ ఆరు నెలలకు, ఏడాదికి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. తర్వాత కొన్నేళ్ల నుంచి గల్ఫ్‌కు వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు. రోజూ తాగి వచ్చి  కొట్టేవాడు. అడ్డు వచ్చిన పిల్లల్ని కూడా కొట్టేవాడు. భరించలేక మూడేళ్ల కింద నేను, పిల్లలు మా అమ్మ దగ్గరికి వెళ్లిపోయాం. తాను మారానని మళ్లీ వచ్చాడు  సుదర్శన్‌. కూలీ పని చేస్తే ఎక్కువ సంపాదించుకోలేమని తాను మళ్లీ్ల గల్ఫ్‌కు వెళుతున్నాననీ, తనతో పాటు అక్కడకు వస్తే ఎక్కువ సంపాదించుకోవచ్చని చెప్పాడు. పాస్‌పోర్టు తెప్పించాడు.

చాకిరి చేస్తూ చావు దెబ్బలు
ఒమన్‌లో అరబ్బు షేక్‌ల ఇండ్లలో పని చేస్తే నెలకు రూ.20 వేల వరకు వేతనం ఉంటుందని,  తను కూడా ఒమన్‌లోనే మంచి కంపెనీలో పని వెతుక్కున్నానని చెప్పాడు. మొదట నన్ను ఒమన్‌కు పంపిస్తున్నానని, కొన్ని రోజుల తరువాత తాను అక్కడకు వస్తానని, అంతవరకు తన స్నేహితుడు భాస్కర్‌ నాకు ఒమన్‌లో అండగా ఉంటాడని చెప్పాడు. ఒమన్‌లో ఇంటిపని  వీసా తీయించి ఈ ఏడాది మే 18న నన్ను ఒంటరిగానే పంపించాడు. నా భర్త చెప్పినట్లు భాస్కర్, అతని భార్య మణిలు నా కోసం ఎయిర్‌పోర్టుకు వచ్చి నన్ను తీసుకెళ్లారు. నన్ను వాళ్ల ఇంట్లోనే ఉంచుకున్నారు. అక్కడ నాకు.. భాస్కర్‌కు చెందిన కార్లు కడిగి తుడిచే పని అప్పగించారు. తీవ్రమైన ఎండలో పని చేయడంతో నా చేతులకు బొబ్బలు వచ్చాయి. ఈ పని చేయలేనని, మరే పనైనా చెప్పమని ప్రాధేయపడ్డాను. దీంతో ఒక షేక్‌ ఇంటిలో పని చేయడానికి పంపించాడు. 

కోటలాంటి ఇంట్లో ఆకలి మంటలు
ఆ షేక్‌ ఇల్లు చిన్న కోటలా ఉంది. ఆ ఇంట్లో చిన్న పిల్లలు, పెద్దవారు కలిసి మొత్తం పది మంది ఉండేవారు. వారందరికి సేవ చేయడంతో పాటు ఇంటి పని చేసేదాన్ని. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పగలు, రాత్రి అనే తేడా లేకుండా పని చెబుతూనే ఉండేవారు. పని చేయలేకపోతుంటే కొట్టేవారు. కనీసం నేను తిన్నానా లేదా అని కూడా ఆలోచించేవారు కాదు. అరబ్బి భాష రాకపోవడంతోనే సైగలతోనే వారికి నా బాధను తెలిపాను. అయినా కనికరం చూపేవారు కాదు.

తిని పారేసిన ఖర్బూజాను తిన్నాను
పని భారంతో ఆకలి బాధ అంతా ఇంతా ఉండేది కాదు. కడుపు మాడుతున్నా షేక్‌లు చెప్పిన పని చేసేదాన్ని. ఆకలి అవుతుందని సైగ చేస్తే పాచి పోయిన రొట్టె ఇచ్చేవారు. కడుపు మంటను చల్లార్చుకోవడానికి తినడానికి ఇష్టం లేక పోయినా రొట్టెను తినడానికి కష్టపడ్డాను. చివరకు వారు తిని పడేసిన ఖర్బూజ ముక్కలను చెత్త బుట్ట నుంచి తీసుకుని తిని ఆకలి బాధ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాను. అలా మొదటి షేక్‌ ఇంట్లో పదిహేను రోజుల పాటు పని చేశాను. ఆ షేక్‌ ఇంట్లో చాకిరి చేస్తూ చావు దెబ్బలు తిన్న నేను ఆఫీస్‌కు పంపించాలని అడిగితే భాస్కర్‌ వద్దకు పంపించారు. నన్ను ఇంటికి పంపించి వేయాలని భాస్కర్‌ను అడిగితే అతని భార్య మణితో కొట్టించాడు. మరో షేక్‌ ఇంటికి పని కోసం పంపించాడు. రెండో షేక్‌ ఇంట్లో మరింత నరకం చూసాను. అక్కడ పదిహేను రోజుల పాటు పని చేసి ఆఫీస్‌కు పంపించాలని వేడుకుంటే మళ్లీ భాస్కర్‌ వద్దకే పంపించారు. ఇద్దరు షేక్‌ల ఇండ్లలో పని చేస్తే నయాపైసా వేతనం ఇవ్వలేదు.

కొన్నవాడు చెబితే తెలిసింది!
అరబ్బు షేక్‌ల ఇండ్లలో పని చేయలేనని, తనను ఎలాగైనా ఇంటికి పంపించాలని భాస్కర్‌ను కోరితే అప్పుడు చెప్పాడు.. నా భర్త నన్ను అతనికి అమ్మేశాడని. నన్ను అమ్మడం ఏమిటని ఫ్రీ వీసా ఉందంటేనే ఒమన్‌కు వచ్చానని చెప్పినా భాస్కర్‌ వినలేదు. నన్ను కొనడానికి సుదర్శన్‌కు డబ్బులు ఇచ్చానని భాస్కర్‌ చెప్పడంతో తట్టుకోలేక పోయాను. నాపై పెట్టిన పెట్టుబడి తనకు రాలేదని చెబుతూ భాస్కర్‌ అతని భార్య మణి కలిసి నన్ను చిత్రహింసల పాలు చేశారు.

రెండే రెండు మాటలు
ఈ విషయాలన్నీ ఇంటికి చేరవేయడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. భాస్కర్‌ ఇంటిలో నాతో పాటు మరికొందరు ఆడవాళ్లు బందీలుగా ఉన్నారు. వారికి నా వేదన చెప్పడంతో భాస్కర్, మణిలకు తెలియకుండా ఇంటికి ఫోన్‌ చేసుకునే ఏర్పాటు చేశారు. నా కొడుక్కు నేను ఫోన్‌ చేసి ‘ఒమన్‌లో బతకడం కష్టంగా ఉంది.. ఇంటికి రప్పించండి’ అని రెండే రెండు మాటలు చెప్పాను. దీంతో మా బంధువులు భాస్కర్‌కి ఫోన్‌ చేసి మాట్లాడితే రూ.70 వేలు చెల్లిస్తేనే నన్ను ఇంటికి పంపిస్తానని చెప్పాడు. భాస్కర్‌ చెప్పిన విధంగా పాలకొల్లులో ఉన్న భాస్కర్‌ వ్యాపార భాగస్వామి రాజు ఖాతాలో రూ.70వేలను మా వారు జమ చేశారు. అయినప్పటికి నన్ను భాస్కర్‌ ఇంటికి పంపించలేదు. అంతేకాదు, నేను ఇంటికి ఫోన్‌ చేశానని తెలుసుకుని చీకటి గదిలో బంధించాడు. ఎంతో కష్టం మీద మరోసారి ఇంటికి ఫోన్‌ చేసి నా బాధను Ðð ళ్లబోసుకున్నాను. దీంతో మా కుటుంబ సభ్యులు స్థానికంగా నా కోసం ప్రయత్నాలు చేయడంతో ఈ జూలై 26న ఇంటికి చేరుకున్నాను.

గుజరాత్‌ వరకే టిక్కెట్‌ బుక్‌ చేశాడు
నాపై కక్ష పెంచుకున్న భాస్కర్‌ ఇంటికి పంపించడానికి ఒమన్‌ నుంచి హైదరాబాద్‌కు కాకుండా గుజరాత్‌ వరకే టిక్కెట్‌ కొని ఇచ్చాడు. ఈ టిక్కెట్‌ కోసం మా ఇంటివారు భాస్కర్‌కు రూ.12వేలు పంపించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగిన నేను హైదరాబాద్‌కు రావడానికి విమానం మారాల్సి ఉంటుందని అనుకున్నాను. కానీ నాకు ఇచ్చిన టిక్కెట్‌ గుజరాత్‌ వరకే ఉండటంతో అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో పోలీసులు నన్ను బయటకు గెంటేశారు. నా అవస్థను జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన మహేష్‌ గుర్తించి ఎయిర్‌పోర్టు అధికారులతో మాట్లాడాడు. విమానం టిక్కెట్‌ ఇవ్వడంలో జరిగిన మోసాన్ని ఆయన గుర్తించి తన వద్ద ఉన్న సొమ్ముతో మరో టిక్కెట్‌ను హైదరాబాద్‌ వరకు కొనుగోలు చేసి ఇక్కడకు చేర్పించాడు. మహేష్‌ నాకు దేవుడిలా అహ్మదాబాద్‌లో కలిశాడు. అతను లేకుంటే నేను ఏమైపోయేదానినో ఊహిస్తేనే భయం వేస్తోంది.

నేను రాగానే నా భర్త పరారయ్యాడు
నేను ఇంటికి వస్తున్న విషయం తెలుసుకున్న నా భర్త సుదర్శన్‌ నేను రావడంతోనే పరార్‌ అయ్యాడు. ఒమన్‌లో నేను పడిన కష్టాలు అందరిని కలచివేసింది. కమ్మర్‌పల్లి పోలీసులకు నా భర్త మోసంపై ఫిర్యాదు చేశాం. ఇప్పుడింకా పరారీలో ఉన్నాడు. నా లాంటి కష్టం మరెవరికి రాకూడదు. నా అంత దురదృష్టవంతురాలు ఎవరు ఉండరేమో. నా పిల్లలను చూస్తానని అనుకోలేదు. నన్ను వంచించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.
 – ఎన్‌. చంద్రశేఖర్, సాక్షి,  మోర్తాడ్‌ (నిజామాబాద్‌ జిల్లా)

మరిన్ని వార్తలు