పిడికిలిలోని పుష్పగుచ్ఛం

12 Dec, 2017 23:42 IST|Sakshi

చెట్టు నీడ

‘‘చెప్పండి గాంధీజీ.. అహింసా సిద్ధాంతాన్ని నిజంగానే మీరు విశ్వసిస్తున్నారా? లేక మాకు ప్రబోధిస్తున్నారా?’’ గాంధీజీని ఎవరో యువకుడు బహిరంగంగానే అడిగాడు! ముంబైలోని గొవాలియా ట్యాంక్‌ మైదానం అది. క్విట్‌ ఇండియా మూవ్‌మెంట్‌ అది.‘‘గాంధీజీ.. మీరు చెబుతున్న అహింస వల్ల ఏమాత్రమైనా ప్రయోజనం ఉంటుందా? శత్రువు దౌర్జన్యవాది. వాడి ముందు మనం చేతులు కట్టుకుని నిలుచుంటే బెదిరి పారిపోతాడా? చెప్పండి గాంధీజీ’’..  ఇంకో యువకుడు! అంతా గాంధీజీ సమాధానం కోసం చూస్తున్నారు. గాంధీజీ లేచి నిలబడ్డారు. ‘చరిత్రలో మనలాంటి దేశం మరొకటి లేదు. మనకున్నంత నిగ్రహ పటిమ మరొక దేశానికి లేదు. ఫ్రెంచి రెవల్యూషన్, రష్యా విప్లవం హింసాత్మక పోరాటాలు. అలాకాక, అహింసతో సాధించుకున్న ప్రజాస్వామ్యంలో మాత్రమే ప్రజలందరికీ సమానస్వేచ్ఛ ఉంటుంది. అలాంటి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అహింస సాధిస్తుంది. అహింస ఆయుధం మాత్రమే కాదు, ఆదర్శం కూడా’’ అన్నారు గాంధీజీ.

ఆ ఆదర్శంతోనే.. స్వాతంత్య్రాన్ని సాధించుకున్న దేశం మనది. అదే ఆదర్శంతో ఏళ్లుగా మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. హింసకు హింసతో ఎప్పుడూ మనం సమాధానం చెప్పలేదు. 2001లో ఇదే రోజు.. డిసెంబర్‌ 13న పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏకంగా మన పార్లమెంటు పైనే దాడికి తెగించి, కాల్పులు జరిపారు. ఆరుగురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంట్‌ సిబ్బంది, ఒక తోటమాలి వారి తూటాలకు బలయ్యారు. ఆ సమయంలో పార్లమెంటు హాలు లోపల హోమ్‌ మినిస్టర్‌ ఎల్‌.కె.అద్వానీ సహా పెద్ద పెద్ద నేతలు ఉన్నారు. వాళ్లకు ప్రాణాపాయం తప్పింది. అంతటి ఘటన తర్వాత కూడా భారత్‌ తన శత్రుదేశంతో అహింసా ధర్మంతోనే వ్యవహరించింది. న్యాయ విచారణ, నిర్ధారణ తర్వాతే దోషులను శిక్షించింది. అదే భారత్‌ గొప్పతనం. అహింస మన పిడికిలిలో పుష్పగుచ్ఛంలా ఇమిడిపోయింది.

మరిన్ని వార్తలు