‘రెడ్ బ్రిగేడ్’ రెడీ

12 Feb, 2014 00:01 IST|Sakshi
‘రెడ్ బ్రిగేడ్’ రెడీ

 రోజురోజుకీ పెరుగుతున్న అత్యాచార వార్తలను ఖండిస్తూ బోలెడన్ని మహిళాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు రోడ్డెక్కి పోరాడుతున్నాయి. అయితే ఏం లాభం? అక్కడక్కడా రక్షించమంటూ... అమ్మాయిలు చేసే ఆక్రందనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే... అమ్మాయిలే రంగంలోకి దిగాలంటూ పిలుపునిచ్చింది ఓ పాతికేళ్ల ఉపాధ్యాయురాలు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో దగ్గర మదియవ కాలనీకి చెందిన ఉషా విశ్వకర్మ అనే టీచర్ ఏడాదిక్రితం ‘రెడ్ బ్రిగేడ్’ పేరుతో ఒక గ్యాంగ్ తయారు చేయాలనుకుంది. లైంగికదాడికి గురైన అమ్మాయిలు, వేధింపులకు గురైనవారితో పాటు పాఠశాల, కళాశాల విద్యార్థులను ఆ గ్యాంగ్‌లో చేర్చుకుంది.
 
  మార్షల్ ఆర్ట్స్‌తో పాటు, వ్యక్తిత్వ వికాస పాఠాలు కూడా ఒంటపట్టించుకున్న ఈ గ్యాంగ్ సెలవుదినాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగి తోటి అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నాలు చేస్తోంది. పట్టుమని పాతికేళ్లు లేని టీచర్ ఉషకు ఈ ఆలోచన రావడానికి కారణం ఏడాది క్రితం జరిగిన నిర్భయ ఘటన మాత్రమే కాదు. తన చుట్టుపక్కల అమ్మాయిలు ఎదుర్కొంటున్న వేధింపులు కూడా. వీటిని అరికట్టడానికి ‘రెడ్ బ్రిగేడ్’ చాలా ధైర్యాన్నిస్తుందని చెబుతుందామె. ఈ గ్యాంగ్‌లో చేరినవారంతా ఎరుపురంగు దుస్తులు ధరించడం ఒక నియమం అన్నమాట.
 

>
మరిన్ని వార్తలు