మతిమరుపు తగ్గించే బెస్ట్‌ రూట్‌

16 Oct, 2017 04:08 IST|Sakshi

చూడటానికి బీట్‌రూట్‌ ఎర్రగా ఆకర్షణీయంగా ఉంటుంది. దాని రంగు ఎంత అందంగా ఉంటుందో తింటే అంతే ఆరోగ్యాన్నీ ఇస్తుంది. బీట్‌రూట్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని...
బీట్‌రూట్‌లోని ఆ చిక్కటి ఎరుపు రంగుకు బిటాలెయిన్స్‌ అనే నీళ్లలో కరిగే యాంటీఆక్సిడెంట్‌ ఉంది. అది చాలా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌. అది ఫ్రీరాడికల్స్‌ను తొలగించి, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. అలాగే విటమిన్‌–సి కూడా ఎక్కువే. ఇది కూడా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌ కాబట్టి క్యాన్సర్ల నివారణకు తోడ్పడటంతో పాటు కొలాజెన్‌ ఉత్పాదనకు తోడ్పడి... దీర్ఘకాలం చర్మంతో పాటు శరీరం యౌవనంగా ఉండటానికి దోహదం చేస్తుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బీట్‌రూట్‌ జ్యూస్‌ తీసుకునేవారిలో అలసిపోకుండా చాలాసేపు ఉండగలిగే సామర్థ్యం (స్టామినా) ఎంతగానో పెంపొందుతుంది.
బీట్‌రూట్‌లో పొటాషియమ్‌ పుష్కలంగా ఉండటం వల్ల అది నీరసం, నిస్సత్తువ, మజిల్‌క్రాంప్స్‌ను దూరం చేస్తుంది. అధిక రక్తపోటును నివారిస్తుంది.
ఇందులో చాలారకాల ఖనిజలవణాలు ఉన్నాయి. క్యాల్షియమ్, ఐరన్, మాంగనీస్, ఫాస్ఫరస్, సోడియమ్, జింక్, కాపర్, సెలీనియం వంటి ఎన్నో పోషకాలు ఉండటం వల్ల... అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బీట్‌రూట్‌లోని కాల్షియమ్‌ ఎముకల, పళ్ల బలాన్ని పెంచుతుంది.
ఫోలేట్‌ అనే పోషకం పుష్కలంగా ఉండటం వల్ల బీట్‌రూట్‌ గర్భిణుల్లో పిండానికి వచ్చే అనేక రకాల వెన్నుపూస సమస్యలను నివారిస్తుంది. గర్భస్రావాల ముప్పును తగ్గిస్తుంది.
కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్‌ను తగ్గించి రక్తనాళాల, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
 బీట్‌రూట్‌ మతిమరపును నివారిస్తుంది. ఈ మేరకు 2011లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం తెలిసింది.
అన్ని రకాల కండరాలతో పాటు గుండె కండరాన్ని సైతం మరింత బలంగా ఉండేలా చేస్తుంది బీట్‌రూట్‌. హార్ట్‌ఫెయిల్‌ అయిన వారికి క్రమం తప్పకుండా బీట్‌రూట్‌ జ్యూస్‌ ఇవ్వడం వల్ల వారిలోని గుండె కండర సామర్థ్యం పదమూడు రెట్లు పెరిగినట్లు 2015లో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.

మరిన్ని వార్తలు