గుండె వైఫల్యాన్ని తగ్గించేందుకు చికిత్సలివే

16 Oct, 2016 22:46 IST|Sakshi
గుండె వైఫల్యాన్ని తగ్గించేందుకు చికిత్సలివే

కార్డియాలజీ కౌన్సెలింగ్

 

నా వయసు 54 ఏళ్లు. గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి నేను మూత్రం తగ్గడం, చర్మం పల్చబడటం, కండరాల పటుత్వం తగ్గడం వంటి లక్షణాలతో డాక్టర్‌ను కలిశాను. ఆయన పరీక్షలు చేసి గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గిందని, గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) అని చెప్పారు. గుండె వైఫల్యం చెందనడానికి కారణాలు, నిర్ధారణ, చికిత్స గురించి తెలుపగలరు.  - సత్యనారాయణ, విజయవాడ
గుండె వైఫల్యానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో అతి ముఖ్యమైన కారణం గుండెపోటు. ఒకసారి గుండెపోటుకు గురైన వాళ్లలో నూటికి 60 మందిలో గుండె వైఫల్యం చెందే అవకాశం ఉంది. అయితే ఇదొక్కటే కాదు... దీర్ఘకాలం పాటు హైబీపీ నియంత్రణలో లేకపోవడం వల్ల కూడా గుండె కండరం దెబ్బతిని గుండె వైఫల్యానికి దారితీయవచ్చు. అలాగే డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని, అంతిమంగా గుండె వైఫల్యానికి దారితీస్తుంది. దీర్ఘకాలంలో కిడ్నీ జబ్బు ఉన్నవారికి కూడా రక్తంలో విషతుల్యాల ప్రభావం పెరిగి, క్రమేపీ గుండె దెబ్బతినిపోతుంది. అరుదుగా పుట్టుకతో కండర ప్రోటీన్ లోపం ఉన్నవారికి, కాన్పు సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురైన మహిళలకు, అలాగే జీవితంలో ఉన్నట్టుండి ఎన్నడూలేనంతటి తీవ్రమైన ఒత్తిడి బారినపడిన వారికి కూడా హఠాత్తుగా గుండె వైఫల్యం సంభవించే ముప్పు ఉంది.

 
నిర్ధారణ : గుండె వైఫల్యాన్ని చాలావరకు లక్షణాల ఆధారంగానే గుర్తుపట్టవచ్చు. వైద్యులు రోగిని పరీక్షించడంతో పాటు కచ్చితమైన నిర్ధారణకు కొన్ని పరీక్షలు చేయిస్తారు. ఈసీజీ పరీక్ష చేస్తే గతంలో గుండెపోటు వచ్చిందా, గుండె గదులు పెద్దగా అయ్యాయా, కండరం మందంగా తయారైందా వంటి వివరాలన్నీ బయటపడతాయి. ‘ఎకో’ పరీక్ష చేస్తే గుండె పంపింగ్ సామర్థ్యం ఎలా ఉందన్నది తెలుస్తుంది. ఇవి కాకుండా గుండెవైఫల్యం లక్షణాలు స్పష్టంగా కనబడుతున్నప్పుడు - ఒకవేళ గుండె రక్తనాళాల్లో పూడికలుండి, త్వరలో గుండెపోటు ముంచుకొచ్చే అవకాశం ఉందేమో తెలుసుకునేందుకు ‘యాంజియోగ్రామ్’ అవసరమవుతుంది. దాదాపు నూటికి 99 మందిలో ఈ పరీక్షలతోనే గుండె వైఫల్యం కచ్చితంగా నిర్ధారణ అవుతుంది. అరుదుగా మరింత స్పష్టత కోసం ఎమ్మారై, పెట్ స్కాన్ వంటి పరీక్షలూ అవసరమవుతాయి. ఆయాసంగా ఉన్నప్పుడు దానికి కారణం గుండె వైఫల్యమా లేదా ఉబ్బసమా అన్నది తెలుసుకునేందుకు ‘బీఎన్‌పీ’ రక్తపరీక్ష ఉపకరిస్తుంది.

 
చికిత్స : గుండె వైఫల్యం మొదలైనప్పుడు దగ్గు, ఆయాసం వంటి పైకి కనిపించే లక్షణాలతో పాటు గుండె సైజు పెరగడం, గుండె కండరం మందం కావడం వంటి అంతర్గత సమస్యలూ ఉంటాయి. వ్యాధి ముదరకుండా చూడటానికి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. గుండె, కిడ్నీ వంటి కీలక అవయవాల పనితీరును సమన్వయం చేస్తూ పంపింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు బీటాబ్లాకర్లు, ఏసీబీ, ఏఆర్‌బీ ఇన్హిబిటార్లు, స్పైరనోలాక్టోన్ వంటి మందులు ఇస్తారు. వీటికి తోడు గుండె సైజు పెరిగినప్పుడు దాని దుష్ర్పభావాలను అడ్డుకునేందుకు ‘నెప్రిలైజిన్ ఇన్హిబిటార్’ వంటి మందులు అందుబాటులోకి రాబోతున్నాయి. అలాగే ఒంట్లో అధికంగా చేరిపోయిన నీటిని మూత్రం రూపంలో బయటకు పంపేందుకు డైయూరెటిక్స్ మందులు ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా వ్యాధి ముదరకుండా జీవితకాలం పెరగడానికి తోడ్పడతాయి. గుండె పంపింగ్ సామర్థ్యం 30 శాతం కంటే తక్కువ ఉన్నవారికి ఆల్డోస్టెరాన్ యాంటగోనిస్ట్ రకం మందులు ఉపయోగపడతాయి. ఆస్తమా వంటి సమస్యలున్నవారు బీటా బ్లాకర్స్‌ను తట్టుకోలేరు. వీరికి ‘ఇవాబ్రాడిన్’ అనే కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. కిడ్నీ సమస్యలున్నవారు ఏసీఈ, ఏఆర్‌బీ మందులను తట్టుకోలేరు. వీరికి ప్రత్యామ్నాయంగా మరికొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. ఇవన్నీ రక్తనాళాలను విప్పారిలా చేస్తూ గుండె మీది భారాన్ని తగ్గిస్తాయి.  ఈ మందుల వల్ల రోగి బాధలు తగ్గడమే కాకుండా గుండె వైఫల్యం కారణంగా లోపల తలెత్తే సమస్యలూ తగ్గి రోజువారీ పనులన్నీ హాయిగా చేసుకోగలుగుతారు. కాబట్టి మందులను పద్ధతి ప్రకారం తీసుకోవడం అవసరం.

 

డాక్టర్ కృష్ణారెడ్డి సీనియర్ కన్సల్టెంట్
కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్

 

కీళ్లు బిగుసుకుపోయి, కదలడమే కష్టంగా ఉంది
హోమియో కౌన్సెలింగ్

 

నా వయసు 37 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి చేతివేళ్లు, కాలివేళ్లు, తుంటిప్రాంతంలో నొప్పి, వాపు ఉంటున్నాయి. ఉదయానే నిద్ర లేచేసరికి కీళ్లు బిగుసుకుపోయినట్టుగా కదలికలు కష్టంగా ఉంటున్నాయి. ఈ వ్యాధి ఏమిటి?  హోమియో చికిత్స ద్వారా పూర్తిగా నయమవుతుందా? - ఎస్. పవన్ కుమార్, హైదరాబాద్
మీరు తెలిపిన వివరాలను బట్టి ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ (కీళ్లవాతం) అయ్యే అవకాశం ఉంది. చల్లటి వాతావరణంలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కీళ్లవాతం అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన శరీర రోగనిరోధక వ్యవస్థ కొన్ని అసమతుల్యతల కారణంగా పొరబడి సొంత కణాలపైనే దాడి చేయడం వల్ల కలుగుతుంది. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరిలోనైనా ఇది వస్తుంది. కారణాలు: ఈ వ్యాధికి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు కానీ కొన్ని ఇన్ఫెక్షన్ల వలన, వాతావరణ మార్పులు, వంశపారంపర్యత, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఎక్కువగా కలుగుతుంది. ధూమపానం, స్థూలకాయం వంటివి కూడా ఈ వ్యాధిని ప్రేరేపిస్తాయి.


లక్షణాలు: కీళ్లలో విపరీతమైన నొప్పి, వాపు, చేతితో తాకితే వేడిగా అనిపించడం, ఉదయాన లేవగానే కీళ్లు బిగుసుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలోని ఇరుపార్శ్వాలలో ఉండే ఒకేరకమైన కీళ్లను ప్రభావితం చేయడం ఈ వ్యాధి ముఖ్యలక్షణం. మొదటి ఈ వ్యాధి చిన్న చేతివేళ్లు, కాలివేళ్లను, వ్యాధి తీవ్రత పెరిగేకొద్దీ మణికట్టు, మోచేతులు, భుజాలు, మోకాళ్లు, తుంటి, చీలమండలు వంటి కీళ్లను ప్రభావితం చేస్తుంది. వీటితోపాటు నీరసం, రక్తహీనత,   బరువు తగ్గడం, ఆకలి మందగించడం, జ్వరం వంటి లక్షణాలను కూడా గమనించవచ్చు.


చికిత్స: ఇలాంటి వ్యాధులకు హోమియో చికిత్స ద్వారా చక్కటి పరిష్కారం లభిస్తుంది.

 

డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
సీఎండ్‌డి  హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్

 

మరిన్ని వార్తలు