నీలి రంగుతో రక్తపోటు తగ్గుముఖం!

10 Nov, 2018 00:28 IST|Sakshi

ఒంట్లో బీపీ ఎంతకూ తగ్గడం లేదా? అయితే రోజూ కాసేపు నీలి రంగు కాంతిలో సేద తీరండి అంటున్నారు బ్రిటన్‌లోని సర్రే యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని తాము కొంతమందిపై ప్రయోగం చేసి మరీ కనుక్కున్నామని చెబుతున్నారు వీరు. రోజూ అరగంట సేపు నీలి రంగు కాంతిలో.. ఆ మరుసటి రోజు వేరే రంగు కాంతిలో ఉండేలా చేశామని.. మూడు దశలలో వీరి బీపీని పరిశీలించినప్పుడు నీలి రంగు కాంతిలో ఉన్నప్పుడు సిస్టోలిక్‌ రక్తపోటు 8 మిమీ హెచ్‌జీ వరకూ తగ్గిందనీ, ఇది మందులేసుకుంటే తగ్గేంత మోతాదులో ఉండటం గమనార్హమనీ అంటున్నారు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త క్రిస్టియన్‌ హైజ్‌! అంతేకాకుండా ఈ నీలి రంగు కాంతి... ధమనుల పెళుసుదనాన్ని తగ్గించడమే కాకుండా రక్తంలోని నైట్రిక్‌ ఆసిడ్‌ మోతాదును పెంచిందని వివరించారు.
 

నైట్రిక్‌ యాసిడ్‌ మోతాదు ఎక్కువగా ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందన్నది తెలిసిందే. నీలి రంగు కాంతి కారణంగా చర్మంలో నైట్రిక్‌ యాసిడ్‌ ఉత్పత్తి జరిగి రక్తంలో కలిసిందని, ఫలితంగా రక్తపోటు తగ్గిందని ఆయన వివరించారు. దాదాపు 450 నానోమీటర్ల పౌనఃపున్యమున్న నీలిరంగును ప్రయోగాల్లో వాడామని, ఇంతేస్థాయి వెలుతురు ప్రసారం చేసే గాడ్జెట్లను సిద్ధం చేసి వాడితే బీపీని నియంత్రించడం వీలవుతుందని చెప్పారు. 

మరిన్ని వార్తలు