వరిలో ఊద సాగుతో తగ్గిన కలుపు!

13 Nov, 2018 06:41 IST|Sakshi
వరి+ఊద పొలంలో రైతు శ్రీనివాస్‌

సేంద్రియ వరిలో ఎకరానికి  రూ. 9 వేల కలుపుతీత ఖర్చు

వరిలో ఊదను చల్లితే  రూ. 2,500కు తగ్గిన కలుపు ఖర్చు

ఊదల ద్వారా రైతుకు అదనంగా ఆదాయం బ్యాక్టీరియాలు, శిలీంధ్రాల ద్వారా చౌడుకు చౌకగా చెక్‌

రాయచూర్‌లో తెలుగు రైతుల  ప్రయోగాత్మక సాగు

ఘన జీవామృతం, జీవామృతంతో సాగవుతున్న వరి పొలంలో తీవ్రరూపం దాల్చిన కలుపు సమస్యకు వరిలో అంతరపంటగా ఊదల సాగు చేపట్టి పరిష్కరించుకోవచ్చని కర్ణాటకలోని రాయచూర్‌లో కొందరు తెలుగు రైతుల బృందం అనుభవపూర్వకంగా చెబుతున్నారు. స్నేహితులైన రమేశ్, రామలింగరాజు, వెంకట్రాజుల బృందం గత ఏడేళ్లుగా రాయచూర్‌ దగ్గర్లో రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో వరి, చెరకు సాగు చేస్తున్నారు. కృష్ణా నది నుంచి తోడిన నీటిని పారగట్టి నీటి నిల్వ పద్ధతిలో వరిని సాగు చేస్తున్నారు. చౌడు సమస్య వల్ల ఊడ్చిన వరి నారులో 20% మొక్కలు చనిపోయేవి.

రెండు,మూడు సార్లు నాట్లు వేయాల్సి వచ్చేది. వరి పొట్ట దశలో వరి గిడసబారిపోయేది, తాలు ఎకరానికి 10 బస్తాలు వచ్చేది.  ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయదారుడు సుబ్రహ్మణ్యం రాజు మార్గదర్శకత్వంలో చౌడు భూముల్లో రెండేళ్లుగా సేంద్రియ పద్ధతుల్లో వరి, వరిలో అంతరపంటగా ఊదలు సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. చెరకు సాగులోనూ సేంద్రియ పద్ధతులతో చౌడును జయించారు. జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ(ఎన్‌.ఐ.పి.హెచ్‌.ఎం.) ద్వారా శిక్షణ పొందిన ఈ రైతుల బృందం తమ వ్యవసాయ క్షేత్రంలోనే 10 రకాల బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలను పెద్ద డ్రమ్ముల్లో అభివృద్ధి చేసి ప్రతి వారం ఎకరానికి 500 లీటర్ల చొప్పున వదలటం వల్ల చౌడు సమస్య 80% తగ్గింది.

ఘనజీవామృతం, జీవామృతం, వేస్ట్‌ డీ కంపోజర్‌ను, బ్యాక్టీరియాలను వేర్వేరు ప్లాట్లలో 30 ఎకరాల్లో మొదటిగా ఈ ఏడాది జనవరి–మార్చి వరకు వాడి చూడగా.. మొదటి ప్రయత్నంలోనే ఎటువంటి సమస్యా లేకుండా పంట దిగుబడి వచ్చింది. అయితే, రైతులు సొంతంగా తయారు చేసుకున్న బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు వాడిన వరి పొలంలో మొక్కలు వేగంగా పెరిగి ఉత్తమ ఫలితాలు వచ్చినట్లు గమనించారు. దీంతో ఈ ఖరీఫ్‌లో సేంద్రియ వరి సాగును 120 ఎకరాలకు విస్తరింపజేశారు. నాటిన మొక్కలు చనిపోలేదు.  

వరిలో ఊద.. కలుపు నియంత్రణ
సేంద్రియ వ్యవసాయం చేపట్టక ముందు కలుపు నిర్మూలనకు ఎకరానికి రూ. 3 వేలతో రసాయనిక కలుపు మందులు చల్లేవారు. సేంద్రియ పద్ధతుల్లో వరి సాగు చేపట్టిన తర్వాత ఎకరానికి రూ. 3 వేల నుంచి రూ. 9 వేల వరకు కలుపుతీతకు ఖర్చవుతున్నది. ఈ ఖర్చును తగ్గించుకోవడానికి సుబ్రహ్మణ్యం రాజుకు కొత్త ఆలోచన వచ్చింది. వరిలో ఊదను అంతరపంటగా సాగు చేస్తే మేలని తలచి ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేశారు. ఘనజీవామృతం ఎకరానికి టన్ను వేశారు. తర్వాత 4 దఫాల్లో ఎకరానికి 900 కిలోలు వెదజల్లారు. పదిహేను రోజులకోసారి జీవామృతం నీటి ద్వారా ఇస్తున్నారు. 15 రోజులకోసారి జీవామృతాన్ని పిచికారీ చేస్తున్నారు. సొంతంగా అభివృద్ధి చేసుకున్న బ్యాక్టీరియాలను, శిలీంధ్రాలను నీటి ద్వారా అందిస్తున్నారు.

వరి నాట్లు వేసిన రోజే ఎకరానికి 3 కిలోల ఊద విత్తనం వెదజల్లారు. వరి,ఊద మొక్కలతో పొలం వత్తుగా పెరగడంతో కలుపు సమస్య తగ్గింది. ఒకేసారి కలుపు తీయించారు. ఎకరానికి రూ. 2,500 అయ్యింది. 75 రోజులకు ఊద కోతకు వచ్చింది. 3 క్వింటాళ్ల ఊద ధాన్యం దిగుబడి రావాల్సింది, పక్షులు తినటం వల్ల 180 కిలోలు వచ్చింది. అంతరపంటగా ఊద వేసినప్పటికీ సేంద్రియ వరి కంకి బాగుంది. వరి దిగుబడిపై పెద్ద ప్రభావం ఉండకపోవచ్చని రమేశ్‌(94811 12345) తెలిపారు. తొలి ఏడాది ఏకపంటగా సేంద్రియ వరిలో 17 బస్తాల దిగుబడి వచ్చింది. అంతరపంటగా ఊద వేసినప్పటికీ వరి దిగుబడి 20 బస్తాలకు తగ్గకుండా వస్తుందని భావిస్తున్నామన్నారు. సేంద్రియ వరిలో ఊద సాగు వల్ల కలుపు సమస్య తగ్గిపోవడమే కాకుండా..  ఆదాయమూ వస్తుందని సుబ్రహ్మణ్యం(76598 55588) తెలిపారు.  
 
బ్యాక్టీరియా డ్రమ్ములను పరిశీలిస్తున్న సుబ్రహ్మణ్యం రాజు

మరిన్ని వార్తలు