వ్యాయామంతో మెదడుకు ఉత్తేజం

21 Sep, 2018 12:31 IST|Sakshi

లండన్‌ : వ్యాయామంతో శారీరక చురకుదనంతో పాటు మెదడు ఉత్తేజితమై ఎదుగుదల సంతరించుకుంటుందని తాజా అథ్యయనం వెల్లడించింది. శరీరానికి మేలు చేసే ఏ పనైనా మెదడుకూ మేలు చేస్తుందని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేయగా వ్యాయామం మెదడుపై సానుకూల ప్రభావం చూపుతుందని తాజా అథ్యయనంలో విస్పష్టంగా తేలింది.

బ్రైన్‌ పజిల్స్‌, క్రాస్‌వర్డ్స్‌ పూరించడంతో పోలిస్తే శారీరక చురుకుదనంతోనే మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాన్‌బెర్రా పరిశోధకులు పేర్కొన్నారు. ప్రతిరోజూ ఏరోబిక్‌ ఎక్సర్‌సైజులతో ఆలోచనా విధానం, చదవడం, రీజనింగ్‌ వంటి సామర్థ్యాలు మెరుగుపడతాయని గుర్తించారు. వ్యాయామంతో కండరాలు పటిష్టమవడం జ్ఞాపకశక్తి, మెదడు సామర్థ్యం పెరిగేందుకు దోహదపడుతుందని పరిశోధకులు వెల్లడించారు.

వేగంగా నడవడం, తోటపని, స్విమ్మింగ్‌, మెట్లు ఎక్కడం వంటి శారీరక కదలికలు అధికంగా ఉండే వ్యాయామాలతో మెదడు ఉత్తేజితమవుతుందని గుర్తించారు. శారీరక వ్యాయామంతో పాటు అభిరుచుల మేరకు సంగీతం, నృత్యం వంటి వ్యాపకాల్లో మునిగితేలితే డిమెన్షియా ముప్పును ఎదుర్కోవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు