ఇల్లు ఇరుగ్గా ఉంది అత్తయ్యా

2 May, 2019 01:21 IST|Sakshi

అందరూ కలిసి ఉండాలనేది మంచి ఆలోచన.అందులో లాభాలు ఉన్నాయి.సౌకర్యాలు ఉన్నాయి.కాని అత్తగారు ప్రతి కొడుక్కీ గది సౌకర్యంగా ఉందా అని చూస్తే సరిపోదు.ప్రతి కోడలికి గాలి ఆడుతుందా అనేది కూడా చూడాలి.ఇష్టాలు గౌరవించుకుంటే బంధాలు మరింత బలపడతాయి.

ఆ రెండంతస్తుల భవనంలో లోపలి మెట్ల ద్వారా ఏ గదికైనా చేరుకోవచ్చు.అంత సౌకర్యంగా కట్టారు.కాని ఆ ఇంటికే కాక ఆ ఇంట్లోని మనుషులకూ మెట్లు ఉన్నాయి.పై మెట్టు మీద ఒకరుంటారు.. కింద మెట్టు మీద ఒకరుంటారు.అది మాత్రం చాలా అసౌకర్యం.

వర్తకుల ఇల్లు అది. ఉత్తరాది నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఉమ్మడి కుటుంబం. తల్లి– తండ్రి, ముగ్గురు కొడుకులు– కోడళ్లు, మనవలు–మనవరాళ్లు... అందరూ కలిసి ఉంటారు. వంట గదిలో నిప్పు ఆరదు. డైనింగ్‌ టేబుల్‌కు విశ్రాంతి ఉండదు. తిండికి కొదవ లేదు. కాని మనసుల్లోనే ఏదో వెలితి.

ఆ ఇంటి చిన్న కోడలు సోనమ్‌ పూర్తిగా మారిపోయిందని తెలియడానికి అంత ఉమ్మడి కుటుంబంలోని మనుషులకు కూడా ఆరు నెలలు పట్టింది. చిన్న కోడలు అంటే వయసులో చిన్నదని అనుకోవాల్సిన పని లేదు. 42 ఉంటాయి. పదిహేడు పద్దెనిమిదేళ్లకే పెళ్లి చేసి తీసుకొచ్చారు. ఇరవై ఏళ్ల కొడుకు, పద్దెనిమిదేళ్ల కూతురు ఉన్నారు. ముందు నుంచి మెతక. అత్తగారు ఏం చెప్పినా చేసుకుపోతుందని పేరు. అత్తగారి తర్వాత? పెద్ద కోడలు ఏం చెప్పినా చేసుకుపోతుందని పేరు. పెద్ద కోడలి తర్వాత? రెండో కోడలు ఏం చెప్పినా చేసుకుపోతుందని పేరు.ఇరవై ఏళ్లుగా చేసుకుపోతూనే ఉంది. చేసుకుపోతూనే ఉంది కదా అని ఎవరూ గమనించలేదు.గమనించేసరికి ఆమె పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది.

అత్తగారు లేచే సమయానికి కోడళ్లు కూడా నిద్ర లేవాలి. కాని గత ఆర్నెల్లుగా చిన్న కోడలు సమయానికి లేవడం లేదు. ఊరికే అలా పడుకుని ఉంటోంది. లేచినా తయారు కావడం లేదు. స్నానం చేయడం లేదు. దొడ్లోకి ఎప్పుడు వెళుతున్నదో అసలు వెళుతున్నదో లేదో తెలియదు. తిండి పూర్తిగా తగ్గిపోయింది. అప్పడప్పుడు ఆమె బాగా నవ్వేది. అసలు నవ్వు కనిపించడం లేదు. కొద్దో గొప్పో మాట్లాడేది. మాట వినిపించడం లేదు. అత్తగారు, తోడి కోడళ్లు కూడా మనుషులే. ఒక మనిషి ఈ స్థాయికి పడిపోయాకైనా వారు గమనించే తీరుతారు. గమనించారు. ఆస్పత్రికి తీసుకొచ్చారుసైకియాట్రిస్ట్‌ దగ్గరకు.

సోనమ్‌కు చదువుకోవాలని ఉండేది. ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకుంది. కాని చదువు మాన్పించి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. సరే.. భర్తను బాగా చూసుకోవడం.. భర్త చేసే పనిలో సాయం చేయడం.. పిల్లలను తీర్చిదిద్దుకోవడం.. ఇవైనా బాగా చేద్దామని అనుకుంది. ఆ కుటుంబ వర్తకంలో భర్త రాణించేది తక్కువ. అందుకని అతడికి తక్కువ స్థాయి పని అప్పజెప్పి ఉన్నారు. కనుక తక్కువ స్థాయి మర్యాద కూడా ఉంది. అతనికి తక్కువ స్థాయి మర్యాద కనుక అతడి భార్యకు కూడా తక్కువ స్థాయి మర్యాదే. నిర్ణయాలు మావగారు, ఇద్దరు బావగార్లు తీసుకుంటూ ఉంటారు. భర్తకే నిర్ణయం తీసుకునే వీలు లేనప్పుడు అతడి భార్యకు వీలు ఎక్కడ ఉంటుంది.ఆ ఇంట్లో తనకు నచ్చింది వండుకుని తినే స్వేచ్ఛ సోనమ్‌కు ఎప్పుడూ లేదు.

వండుకోవద్దని ఎవరూ అనరు. కాని వండుకోవడానికి వీల్లేని వాతావరణం ఉంటుంది. పిల్లలు ఇద్దరు పుడితే తనకిష్టమైన పేర్లు సోనమ్‌ పెట్టుకోలేకపోయింది. భర్తకు ఇష్టమైన పేర్లు కూడా. ఒక పేరు పెదబావగారు పెడితే మరోపేరు రెండో బావగారు పెట్టారు.సంవత్సరానికి రెండుసార్లు అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్లి వస్తారు గాని సోనమ్‌కు తన కుటుంబంతో విడిగా ఎక్కడికైనా వెళ్లి రావాలనే కోరిక మాత్రం ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా తీరలేదు. ‘అలాగే అత్తగారు’, ‘అలాగే ఒదిన’... ‘అలాగే మావయ్యా’ ఇవి అనీ అనీ నిద్రలో కూడా ఈ మాటలే అనడానికి అలవాటు పడిపోయింది.అసంతృప్తికీ అణచివేతకీ కూడా ఒక హద్దు ఉంటుంది.ఆ చెలియలి కట్టను కూడా ఆ కుటుంబం దాటి సోనమ్‌ను తీవ్రంగా బాధ పెట్టింది.

సోనమ్‌ కుమార్తె వీర ఇంటర్‌ పాసైంది. ఇక ఇంట్లో అందరూ పెళ్లి సంబంధాల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. తమ ఇళ్లల్లో ఆడపిల్లలకు ఆ వయసులో పెళ్లి చేస్తారు కనుక ఇది చాలా మామూలు విషయంగా వారు భావించారు. అత్తగారు, ఇద్దరు పెద్ద కోడళ్లు ఆ సంబంధం ఉంది ఈ సంబంధం ఉంది అని తామే మంతనాలు సాగిస్తూ ఉన్నారు. కాని వీరకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. బాగా చదువుకోవాలని ఉంది. కూతురు బాగా చదువుకుని తన కాళ్ల మీద తాను నిలబడి తన జీవితాన్ని తాను నిర్మించుకునే శక్తి పొందాలని సోనమ్‌కు గట్టిగా ఉంది.

కాని ఆ మాట ఆ తల్లికూతుళ్లు ఇద్దరూ చెప్పే వీలు ఆ ఇంట్లో లేదు. భర్తకు చెప్తే అర్థం కాదు.అరె... నా కూతురు విషయంలో కూడా నాకు స్వేచ్ఛ లేదా అని సోనమ్‌ అనుకుంది.అంతే. తనలో తాను ముడుచుకుపోవడం మొదలుపెట్టింది. లోలోపలికి పూర్తిగా చీకట్లోకి వెళ్లిపోయింది. ఆమెకిప్పుడు లోకవ్యవహారాల వేటి మీదా ఆసక్తి లేదు. ఆమె కేవలం ముక్కు నుంచి గాలి పీల్చి వదలగల ఒక బొమ్మ మాత్రమే.

సైకియాట్రిస్ట్‌కు అంతా అర్థమైంది. కుటుంబాన్ని కూచోబెట్టుకుని చెప్పింది.‘చూడండి. మనుషులు కలిసి ఉండటం ఎప్పుడూ బాగుంటుంది. కాని కలిసి ఉండటం అంటే కాళ్లకు సంకెళ్లు కట్టి ఉంచడం కాదు. ఎదుటివారి కలలు, కోరికలు, అభిప్రాయాలు వీటిని పట్టించుకుని వాటిని ఒకరినొకరు సపోర్ట్‌ చేసుకోవడమే ఉమ్మడి కుటుంబం ఉద్దేశ్యం. కాని ఒకరిపై మరొకరు పెత్తనం చేయడం అణచి ఉంచడం ఎంత మాత్రం కాదు. మీరు ఇంట్లో మీ చిన్న కోడలుకు గది ఇచ్చారు కాని సమాజంలో భాగమవడానికి గడప ఇవ్వలేదు. అయినా ఆమె భరించింది. కాని ఆమె కూతురికి కూడా అదే పరిస్థితి వచ్చే సరికి శిథిలమయ్యింది. ‘ఇది నువ్వు చెయ్‌’ అనే మాటను మీ ఇంట్లో మానేయండి.

‘ఏం చేయాలనుకుంటున్నావు’ అని అడగడం నేర్చుకోండి. ఎదుటివారి ఇష్టాలను హేళన చేయకుండా గౌరవించే స్థితికి మీరంతా ఎదిగినప్పుడే మీ ఉమ్మడి కుటుంబం ఇంకా అర్థవంతంగా ఉంటుంది. మీ మనవరాలి పెళ్లి మీద మొదట నిర్ణయం తీసుకోవాల్సింది మీ మనవరాలే. తర్వాత ఆమె తల్లి. మీరు మాత్రం కాదు’ అని వారికి వివరించి చెప్పింది.అత్తగారు, తోడికోడళ్లు సోనమ్‌ను, వీరను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు.వాళ్లు మొదట చేసిన పని పెళ్లి ప్రస్తావన వాయిదా వేయడం.వీర ఏం చదువుకోవాలన్నా సపోర్ట్‌ చేస్తామని సోనమ్‌కు వారు ధైర్యం చెప్పారు.అసలు ఒక వారం రోజుల సంతోషంగా తిరిగి రండి అని టికెట్లు బుక్‌ చేసి టూర్‌కు కూడా పంపారు.

కిచెన్‌ రూల్స్‌ మారాయి. ఎవరికి ఏం కావాలన్నా సంకోచం లేకుండా వండుకోవాలని అత్తగారు ప్రకటన చేసింది. ఎవరి నిర్ణయాలకు అడ్డు చెప్పేది ఉండదని కాకుంటే మంచి చెడ్డలు ఆలోచించడానికి ఒక అవకాశం పెద్దలకు ఇవ్వదలిస్తే ఇవ్వండని మామగారు చెప్పారు.చిన్న చిన్న కిటికీ రెక్కలు కూడా విప్పినప్పుడు పెద్ద వెలుతురు తెస్తాయి.ఇంట్లో సోనమ్‌ ఇప్పుడు కూడా చిన్నకోడలే.కాని ఆ ఇద్దరు పెద్ద కోడళ్లకంటే కూడా హోదాలో తక్కువ కాదు. అధికారంలో తక్కువ కాదు. ఇటీవల కూతురిని ఇంజనీరింగ్‌ కాలేజీలో చేర్చి వచ్చాక ఉదయాన్నే లేచి ఉత్సాహంగా పనిలో పడ్డ సోనమ్‌ను ఆ రెండంతస్తుల ఇంట్లో అందరూ తృప్తిగా చూశారు.
కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్‌

>
మరిన్ని వార్తలు