పోల్చుకుంటే... పోగొట్టుకోవడమే!

5 Jan, 2014 23:22 IST|Sakshi
పోల్చుకుంటే... పోగొట్టుకోవడమే!

‘‘నాకు కుదరదులే సుధా! సాయంత్రం మీ బావగారి ఫ్రెండ్సెవరో భోజనానికి వస్తానన్నారట. మీరు వెళ్లండి పార్టీకి’’... అక్కయ్య మాట వినగానే నీరసం వచ్చేసింది సుధకి. బంధువుల ఇంట్లో పార్టీ. వాళ్లు తనకంటే అక్కయ్యకే క్లోజ్. అందుకే తనతో వెళ్దామనుకుంది. కానీ ఆమె రాననేసరికి.... ఒక్కతే వెళ్లడం ఎందుకు, అక్కయ్య ఇంటికి వెళ్లి, తనకి సాయం చేస్తే బెటరనుకుని బయలుదేరింది.
 
సాయంత్రం రమ్య ఇంటికి వచ్చిన సుధకి అక్కడ హడావుడేమీ కనిపించలేదు. చీరకి ఫాల్స్ కుట్టుకుంటోంది రమ్య. వాళ్లాయన రమేశ్ పక్కనే కూచుని పేపర్ చదువుతున్నాడు. పిల్లలు టీవీ చూస్తున్నారు.


 ‘‘ఏంటింత కూల్‌గా ఉన్నారు? ఎవరో భోజనానికి వస్తున్నారని అన్నారు? వంట మొదలుపెట్టలేదా?’’ అంది సుధ ఇంట్లోకి వస్తూనే. ఆమె రాకని ఊహించని రమ్య అవాక్కయ్యింది. ‘‘భోజనానికి వస్తున్నారా? ఎవరు? అలాంటిదేం  లేదే’’... అన్నాడు రమేశ్ నింపాదిగా. ‘‘అదేంటి... మీ ఫ్రెండ్స్ ఎవరో వస్తున్నారని చెప్పింది అక్క. అందుకే తనకి సాయం చేద్దామని పార్టీకి వెళ్లకుండా ఇటొచ్చాను’’ అంది సుధ ఆశ్చర్యంగా. అర్థం కానట్టు చూశాడు రమేశ్. రమ్య మాత్రం దించిన తల ఎత్తలేదు. సుధకి విషయం అర్థమయ్యింది.
 
గత కొన్నాళ్లుగా అక్కయ్య తనతో ముభావంగా ఉంటోంది. ఒకే ఊరిలో ఉంటూండటంతో తరచూ ఇంటికొచ్చేది. పండుగలప్పుడు, సెలవులప్పుడు అందరూ కలిసి ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడవన్నీ తగ్గిపోయాయి. పైగా ఏ పార్టీకో, ఫంక్షన్‌కో పిలిచినా రానంటోంది. ఇప్పుడేమో ఇంత పెద్ద అబద్ధం చెప్పి తనని అవాయిడ్ చేసింది. అక్క మనసులో ఏదో ఉందని అర్థమైంది సుధకి. అదేమిటని తరచి తరచి అడిగింది. చివరకు ఆమెతో నిజం చెప్పించింది.


 రమ్యకు చెల్లెలంటే ప్రేమే. కానీ ఆమెను, ఆమె భర్తను చూసినప్పుడల్లా ఏదో బాధ. కారణం... వారి అంతస్తుల మధ్య తారతమ్యం. రమ్య భర్త రమేశ్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. నెలకి ఇరవై వేలు జీతం. కానీ సుధ భర్త విక్రమ్... వ్యాపారి. రెండు మూడు పెద్ద షాపింగ్‌మాల్స్ ఉన్నాయి సిటీలో. అలాగని వాళ్లేమీ ఎక్కువగా ఫీలవరు. కానీ రమ్య మాత్రం వాళ్ల దగ్గర తక్కువగా ఫీలవుతోంది. దానికి కారణం లేకపోలేదు.
 
ఎక్కడికైనా వెళ్లినప్పుడు సుధ చాలా ఖరీదైన బట్టలు కట్టుకుంటుంది. నగలు వేసుకుంటుంది. పైగా మోడ్రన్‌గా ఉంటుంది. రమ్య దగ్గర అవేమీ ఉండవు. తను సాదా సీదా గృహిణిలా ఉంటుంది. దాంతో కొందరు మీ అక్కాచెల్లెళ్లిద్దరికీ పోలికే లేదు అంటూంటారు. ఆ పోలిక తమ ఆర్థిక స్తోమత గురించేనని రమ్యకు తెలుసు. అది ఆమెలో న్యూనతను పెంచింది. క్రమంగా చెల్లెలి మీద అసూయనూ కలిగించింది. ఆ పైన వారిద్దరి మధ్య దూరాన్ని కూడా ఏర్పరచింది.
 
ఇలాంటి ఫీలింగ్స్ చాలామందిలో ఉంటాయి. అక్కాచెల్లెళ్లలోనే కాదు, తోడికోడళ్ల మధ్య కూడా ఇలాంటి తారతమ్యాలు అగాథాన్ని సృష్టిస్తుంటాయి. ఒకరు ఆర్థికంగా బాగుండి, మరొకరు కాస్త తక్కువలో ఉంటే... అవతలివారిలో కాస్త అసూయ కలగడం సహజం. అయితే అది హద్దు దాటి బంధాలను విచ్ఛిన్నం చేస్తేనే ప్రమాదం. అయినా నిజానికి అది అసూయపడాల్సిన విషయం కాదు. ఆనంద పడాల్సిన విషయం. మనవాళ్లు బాగుంటే మనకే కదా సంతోషం! అలా ఆలోచించడం మానేసి వారితో మాట్లాకుండా, వారికి దూరంగా ఉండిపోయి, వారితో పోల్చుకుని బాధపడుతూ ఉండటం వల్ల ఒరిగేదేటేంటి.. అందమైన అనుబంధాన్ని పాడు చేసుకోవడం, అమితమైన ఆనందాన్ని మిస్ చేసుకోవడం తప్ప!
 

మరిన్ని వార్తలు