ఏడ దాగున్నాడో బావ?

21 Mar, 2019 02:16 IST|Sakshi

ఊపిరి

వీడనిబంధం అనుకుంటాం. ముందు వెనుకలుగా వీడి వచ్చేస్తాం! మొదట ఆమె అయ్యారు. తర్వాత ఆయన అయ్యారు. ఆ సంగతి ఆమెకు తెలీదు. ‘ఏడ దాగున్నాడో బావ?’ అని నింగి నుంచి వెతుక్కుంటోంటే.. ఆ ఇంటి కోడలు.. మనసుకు హత్తుకునేలా అక్షరీకరించిన అత్తగారి అంతరంగ ఆవిష్కరణ ఇది.  అగ్నిహోత్రావధాని గారి కాఫీ మగ్గు, హిందూ పేపరు, ఏష్‌ ట్రే, కళ్లజోడు, డెంచరు, మందులు, దువ్వెన, చెప్పులు అన్ని అక్కడే ఉన్నాయి. ‘మరి నా బావ కానరాడే?’ అని నలు దిశలా ఆత్రంగా వెదుకుతున్నాయి శేషమ్మ కళ్లు.ఏవండీ ఎక్కడున్నారు? సత్యశ్రీతో కూర్చుని టీవీ గానీ చూస్తున్నారా? మీరిద్దరి మాటలూ పొద్దుటి నుండీ వినబడలేదు. సడీ చప్పుడూ లేదు. వంటింట్లో కుక్కర్‌ మోతా లేదు. నానయ్య ‘హలో డాడ్, గుడ్మార్నింగ్‌’ అంటూ మెట్లు ఎక్కిన చప్పుడు కానీ,  కాఫీ తాగండి  నాన్గారు అన్నట్టుగా కూడా వినపడలేదు. ఏమిటీ భయంకర నిశబ్దం? ఎక్కడికి వెళ్లి వుంటారందరూ?మొన్నామధ్యన కాలిలో రాడ్‌ వేసినప్పటి నుంచీ ఏదో వొక నలత. అన్నం సహించట్లేదని మారాము చేస్తున్నారు.

‘తినకపోతే ఎలా బాబూ? వేళపట్టున గుప్పెడు మెతుకులు తినక పోతే ఎలా? అంటూ మీ పక్కన నేనుంటే మందలించి పెట్టేదాన్ని. మరి నన్ను ఈ ఫొటో ఫ్రేమ్‌లో రెండేళ్ల నాడే బంధింప చేసాడు ఆ పైవాడు. ఊర మిరపకాయలు, ఆవ పచ్చడి, పెరుగ్గారెలు, పండుమిరపకాయ పచ్చడి, సున్ని పొడి, పేరునెయ్యి అన్ని వేసి గోరుముద్దలు చేసిపెడ్దును. హుం. అనారు గింజలూ, కమలా పళ్లు, బత్తాయి రసం తేనెలో కలిపి ఇస్తే ఇష్టంగా తాగుతారని సత్యశ్రీకి తెలుసు. మరి మీరు తాగుతున్నారా? తమరికి ఇష్టమైన ద్రవంతో సరిపెట్టుకోకుండా పళ్ల రసం తాగండి అని ఎప్పుడూ చెప్పేదాన్ని. ‘అబ్బా తినండి, తాగండీ అని ఒకటే నస పెట్టబాకమ్మడూ’ అని మీరు కసిరినా పట్టువదలని విక్రమార్కురాలిలా పంతం గెలిచేదాన్ని! మీకు ఫుడ్‌ పెట్టేదాన్ని! పేంపర్‌ చేసేదాన్ని! మరి నేను వెళ్లిపోతే ఎలా మేనేజ్‌ చేస్తారో అన్న ఆలోచన గుబులు రేకెత్తించేది.

మీకు భోజనం పెడ్తున్నప్పుడూ, ఆ పనీ ఈ పనీ చేసుకుంటున్నప్పుడూ, క్షీరసాగర శయన, వినరో భాగ్యము, శివశివ అనరాదా, శ్రీరామ నీనామ, నారాయణతే, సీతమ్మ మా అమ్మ అంటూ మిమ్మల్ని, ఆ దేవుడుని నా తోబుట్టువుల్నీ తల్చుకుంటూ హాపీగా కాలక్షేపం చేసిన ఎన్నెన్నో సందర్భాలు నెమరేసుకుంటూ ఉంటానండి. ఆ మధుర జ్ఞాపకాలే నాకు బోలెడంత సంతోషాన్ని ఇస్తాయి. ఒక్క క్షణం మీరు కళ్లెదురుగుండా లేకపోతే ఓ.. ఒకటే టెన్షను వస్తుంది బాబూ. శారీరకంగా అంతులేని అనంతలోకాలకి నేవెళ్లినా నా మనస్సెన్నడూ మీ గురించే ఆలోచిస్తుందండీ. ‘అమ్మడూ, నన్ను వదిలేసి వెళ్లిపోయావు, అరవై ఏళ్ల పైన కలసి కాపురం చేసాం’ అని మీరు అంటుంటే బాధగా ఉంటుంది. అయినా తప్పదు. విధిరాతకి అందరం తలవంచాల్సిందే! నా టైము అయిపోయింది.

దట్సాల్‌!మీరు ఆఫీసుకి వెళ్లే రోజుల్లో ప్రొద్దుట బైబై , సాయంత్రం హాయ్‌ చెబుతూ హాయిగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఎన్నో ఏళ్ల హాయి బాయిలకు  ద ఎండ్‌ కూడా కచ్చితంగా ఉంటుందని ఊహించలేదప్పుడు. కానీ రెండేళ్ల క్రితం నేను చెప్పింది పర్మినెంట్‌ గా బైబై! కళ్ల నీరొద్దండీ!అవును కానీ, నా మాట మీకు గుర్తుందా? ‘ముందొకరు వెనకొకరు, అంతే లైఫ్‌ అంటుండేదాన్ని. చూడండి నేనే ఫస్ట్‌! ‘ఆల్వేస్‌ స్మైలింగ్, మై గర్ల్‌ఫ్రెండ్‌ అని నన్ను మీ ఆఫీస్‌ వారికి పరిచయం చేయడం నేను మర్చిపోలేను. ఫొటోలో ఎలాఉన్నానో చెప్పనే లేదు మీరు. అలానే స్మైల్‌ చేస్తున్నానా? నన్ను రెప్పార్పకుండా ప్రేమతో మీరు చూసే చూపే దానికి సమాధానం. 

ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మీరు నాలా కాకుండా వందేళ్లు హాపీగా ఉండాలి. బోరు కొడితే నాతో కబుర్లు చెప్పండి. అయినా రెండింటి వరకూ పేపరు చదవటం తెమలదాయె! సరే కానీ, ఆ కళ్లజోడుని మీరు బద్ధకించకుండా లేచి టేబుల్‌ మీద పెట్టండి. దిండు పక్కన పెడితే కిందపడుతుంది.ఏంటీ ఏమై ఉంటుంది? ఏమిటీ ఎవ్వరూ లేరు.. ఎవరూ మాట్లాడరూ?ఓహ్‌! నేను ఇప్పుడు కవరేజ్‌ ఏరియాలో లేను కదా! ప్రపంచంలోని జైంట్‌ టెలికాం కంపెనీ వారు కూడా నన్ను నెట్వర్క్‌ లోకి తీసుకురాలేరు. గగనాంతర తరంగాలలో నెట్వర్కింగ్‌ ఉంటుంది కానీ గగనంలో కలిసి పోయిన ప్రాణులు అవుటాఫ్‌ నెట్వర్క్‌! ఊపిరితోనే బంధాలు, అనుబంధాలు. ఏడ దాగున్నావొ బావా? 
– సత్యశ్రీ నండూరి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా