వేసవి చినుకు

3 Jun, 2019 00:15 IST|Sakshi

ఒక తీపి జ్ఞాపకం

అమ్మ పేరు ఎంత అందంగా ఉంటుందో.. అమ్మమ్మ పేరు, నానమ్మ పేరు రెట్టింపు అందంగా ఉంటాయి. రెట్టింపు ఎందుకు ఉండాలి? మామూలుగా ఉంటే చాలు కదా అంటారా! అలా అనడానికి కుదరదు. అమ్మమ్మలోను, నానమ్మలోను మూడేసి అక్షరాలు ఉన్నాయి. మరి వారు శివుడితో సమానం కాదూ! నిజమే. వారు శివుడితోనే సమానం. వేసవి కాలం వచ్చిందంటే పిల్లలంతా చింతగింజలు పోగు పోసినట్లుగా అమ్మమ్మ / నానమ్మల ఇంటికి బిరబిర పరుగులు తీయడం ఇంకా పచ్చి జ్ఞాపకంగానే ఉండి ఉంటుంది అందరికీ. స్వేచ్ఛా విహంగాలు ఆకాశంలో విహరించినంత సంబరంగా ఉంటుంది. అక్కడ ఇంట్లో అడుగు పెడుతుండగానే.. ‘ఏమిరా పిల్లలూ, దొడ్లోకెళ్లి కాళ్లు కడుక్కుని రండి, చక్కగా ఆవకాయ అన్నం, మామిడి పండురసం, మజ్జిగ వేసి అన్నం తినిపిస్తాను’ అని ఆవిడ అంటుంటే, ఈ పిల్లల ముఖాలు చూడాలి! తుర్రుమంటూ దొడ్లోకి వెళ్లి, బావిలో నీళ్లు తోడుకుని, బావి గట్టు మీద ఎడాపెడా కాళ్లు కడుక్కుని వంట గదిలోకి దూరేసేవాళ్లు.

అమ్మమ్మ బాదం ఆకులతో కుట్టిన విస్తర్లు వేసి అందరికీ ఆవకాయ పెచ్చులు, మామిడి పండు ముక్కలు వేసేది. వీళ్లు అన్నం తింటుంటే, కడుపునిండా ప్రేమతో వాళ్లకి కొసరి కొసరి వడ్డిస్తూ, ‘ఏరా పిల్లలూ! అన్నంలోకి చారు పొయ్యమంటారా’ అని అడిగేది. వాళ్లు మామిడి పండు ముక్కలు చీకుతూ, ‘మరికాస్త ఆవకాయ వెయ్యి అమ్మమ్మా! ఇంకో రెండు మామడిపండు ముక్కలు కూడా వెయ్యవా’ అని అడిగేవారు. అన్నం తింటున్నంతసేపు అమ్మమ్మ ఎన్ని కథలు చెప్పేది... ఎన్ని పద్యాలు చెప్పేది... ఎన్నెన్ని విషయాలు చెప్పేది... అబ్బో... అందుకే అమ్మమ్మ జ్ఞాపకాలు రెట్టింపుగా ఉంటాయి అన్నది.పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని పోతన రచించిన ‘పలికెడి భాగవతమట పద్యం..’ ఎంతోమంది అమ్మమ్మలు మనవల నోట పలికించారు కదా. ఇక్కడొక విషయం. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో  రామమూర్తిగారు అనే మహాపండితుడు ఉన్నారు.

ఆయన ఆ రోజుల్లో భారత ప్రవచనం చేయడంలో దిట్ట. నాలుగు రోడ్ల కూడలిలో మూడేసి గంటలు నిలబడి, భారత ప్రవచనం చెబుతుంటే, వేలల్లో జనం నిలబడి వినేవారు. గజారోహణం కూడా జరిగింది ఆయనకు. అంతటి పురాణ వాచస్పతి బ్రహ్మశ్రీ పురాణపండ రామమూర్తి తన మనవలని కూర్చోపెట్టుకుని, రామాయణం చెప్పేవారట. ఒకసారి ఆయనకు తీవ్ర జ్వరంగా ఉంది. మనవలందరూ ఆయన మంచం మీద కూర్చుని ఆయనకు కాళ్లు పడుతున్నారట. అంతలో అమాంతంగా లేచి కూర్చుని, ‘అమ్మాయీ దుర్గా (పెద్ద మనవరాలి పేరు) సీతమ్మ వారు వచ్చింది, పీట వెయ్యి’ అన్నారట. అంతే పిల్లలంతా మౌనంగా ఉండిపోయారట. ఆయనకు రామాయణమంటే అంత ప్రీతి. తాతయ్య అలా మాట్లాడటం పిల్లలకు భలే సరదాగా అనిపించిందట. వేడివేడిగా వచ్చే వడగాడ్పుల సమయంలో ఇటువంటి చల్లచల్లని జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటే వేసవి ఒక చల్లటి జ్ఞాపకంగా మిగిలిపోదా!
 – వైజయంతి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు