చిక్కులు తొలగించి శక్తిని ఇవ్వు

9 Oct, 2018 00:22 IST|Sakshi

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు దసరా మహోత్సవాలు జరుగుతాయి. అమ్మవారిని లలితా సహస్రనామ స్తోత్రంలో వర్ణించిన  ట్లుగా, సనాతన సంప్రదాయం, శృంగేరి పీఠాధిపతి, శ్రీవిద్యోపాసకులు నిర్ణయించిన విధంగా అలంకరిస్తారు. స్వర్ణకవచాలంకృత కనకదుర్గ, బాలాత్రిపురసుందరి, గాయత్రీ, లలితా త్రిపురసుందరి, సరస్వతి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, దుర్గ, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి అలంకారాల్లో  కన్నులపండువగా దర్శనమిస్తుంది. దసరాల్లో పది అలంకారాల్లో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే సకల పాపాలు తొలగి, సుఖశాంతులతో జీవిస్తారని భక్తుల విశ్వాసం. ఒకప్పుడు అమ్మవారిని అలంకరించే ఆయుధాలు, వస్తు, వాహనాలను తయారు చేయడానికి చెక్కసామగ్రిని; ఆభరణాలుగా సాధారణ దండలను ఉపయోగించేవారు. దాతలు, భక్తుల సంఖ్య పెరిగి దేవస్థానం ఆదాయం పెరగడంతో, బంగారు ఆయుధాలు, వజ్రాలు, రత్నాలు పొదిగిన సామగ్రిని వినియోగిస్తున్నారు. గజమాలలు, ఐదారు రకాల పట్టు చీరలు, బంగారు ఆభరణాలతో అలంకరిస్తున్నారు.

ఆలయంలోనే  మూల విరాట్టుకు అలంకరణ...
దసరా ఉత్సవాల్లో మూల విరాట్టును అలంకరించడం మన దేశంలో కేవలం ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన దుర్గగుడిలోనే మాత్రమే కనపడుతుంది. నిత్యం వేద మంత్రోచార్చరణల మధ్య పూజలు, ధూపదీపనైవేద్యాలు అందుకునే మూలవిరాట్టును వివిధ అలంకారాల్లో దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని వేదపండితుల అభిప్రాయం. 
– ఉప్పులూరు శ్యామ్‌ ప్రకాష్‌/సుభానీ  
సాక్షి, ఇంద్రకీలాద్రి, విజయవాడ

అమ్మవారి దీక్షలోనే...
తల్లికి ఒక బిడ్డ సేవ చేసే విధంగా మేము దసరా ఉత్సవాల్లో అమ్మవారి అలంకారాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాం. ఏ విధంగా అలంకరిస్తే అమ్మవారు నిండుగా కనిపిస్తుందో ముందే ఊహించుకుని దానికి తగ్గట్లుగా అలంకరిస్తాం. నేను ఐదు దశాబ్దాలుగా దసరా ఉత్సవాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరిస్తున్నాను. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వందల సంవత్సరాలుగా జరుగుతున్నాయి.అమ్మవారిని వివిధ రూపాలుగా అలకరించడంలో ‘లింగభొట్ల’ వంశీకులదీ అందెవేసిన చెయ్యి. ఆ వంశంలో నేను పదిహేడవ తరం వాడిని. మా కుటుంబసభ్యులమంతా పది రోజులూ అమ్మవారి దీక్ష చేపడతాం. ఇంట్లో కూడా నిత్యం అమ్మవారి ప్రతిరూపాలుగా చిన్నారి బాలికలకు, సువాసినులకు పూజలు నిర్వహిస్తాం. ఏకభుక్తం, బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తాం. అమ్మవారిని అలంకరిస్తున్నంతసేపు ఆ తల్లి మీదే మనసు లగ్నం చేసి ఆవిడ నామాన్ని జపిస్తూంటాం. దశాబ్దం క్రితం దసరాల్లో ఒకరోజు తెల్లవారుజామున అమ్మవారి అలంకరణకు బయలుదేరాం. అలంకరణ సామగ్రి కోసం ఎంత వెతికినా కనపడలేదు. ఎక్కడ పెట్టామో తెలియదు. తెల్లవారేలోపు అలంకరణ పూర్తి కాకపోతే భక్తులకు దర్శనం ఆలస్యం అవుతుంది. అమ్మవారి పైనే భారం వేసి అందుబాటులో ఉన్న కొద్దిపాటి ఇతర వస్తువులతో అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశించాం. ఆశ్చర్యం.. ఆరోజు అమ్మవారికి అలంకరించాల్సిన సామగ్రి అంతా సిద్ధంగా ఉంది. ఇది అమ్మవారి మహిమేనని భావించి, ఆ తల్లికి సాష్టాంగపడి, అలంకరణ పూర్తి చేశాం. 
– బదరీనాథ్‌ బాబు, ఆలయ ప్రధాన అర్చకులు 
శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం, విజయవాడ  

మరిన్ని వార్తలు