పెరటి వైద్యం 

11 Apr, 2018 00:18 IST|Sakshi

చెట్టు నీడ

బాధను ఔషధం తొలగిస్తుంది. అయితే బాధకు ఒకే ఔషధం ఉండదు! ఇదే జీవితంలోని పెద్ద సందిగ్ధత. ఈ సందిగ్ధత కంటే బాధే నయం అనిపిస్తుంది కొన్నిసార్లు! ఇన్ని ఔషధాలేమిటి? ఇంత అయోమయం ఏమిటి? జాషువా పొల్లాక్‌ అంతర్జాతీయ వయెలినిస్ట్‌. యు.ఎస్‌. ఆయనది. ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నారు. జీవితంలో సమస్యల పరిష్కారాలకు ‘హార్ట్‌ఫుల్‌నెస్‌ వే’ అనే ఒక కొత్త మందును కనిపెట్టారు పొల్లాక్‌. దీనికి ఆయన చెప్పిన తేలికపాటి అర్థం ‘సంతృప్తి చెందడం’. రెండు రోజుల క్రితం ఈయన చండీఘర్‌ వచ్చినప్పుడు..‘సంతృప్తి చెందడం అంటే ఏమిటి? సరిపెట్టుకోవడమా?’ అని అడిగారు మనలాంటి వాళ్లు కొందరు ఆయన్ని. ‘కాదు, సంతృప్తి చెందడమే’ అన్నారు పొల్లాక్‌. అప్పుడిక జీవితంలో ఏ సమస్యా బాధించదట. సమస్య ఉంటుంది కానీ, బాధ ఉండదు. ఇదీ పొల్లాక్‌ వైద్యం. అర్థమవడం కొంచెం కష్టమే. ‘మెడిటేషన్‌ చేస్తే అర్థం చేసుకోవడం సాధ్యమే’ అంటాడు మళ్లీ పొల్లాక్‌.

సమస్య కన్నా పెద్ద సమస్యలా అనిపిస్తాయి ఈ సాధనలన్నీ. వేదాంతిది ఒక వైద్యం. ఆధ్యాత్మిక వేత్తది ఒక వైద్యం. ఏ వైద్యమూ వద్దనే నాస్తికుడిది ఒక వైద్యం. ఇది సుఖంగా అనిపిస్తుంది.. వైద్యం చేయించుకోకుండా తిరగడం! మరి నొప్పీ? అదొక్కటే ఉంటే చాలదా.. వైద్యం నొప్పి కూడా ఎందుకు? ఇదొక ధోరణి. పొల్లాక్‌ ‘హార్ట్‌ఫుల్‌నెస్‌ వే’ కూడా మనల్ని అక్కడికే తీసుకెళుతుంది. వైద్యుడు లేని చోటుకు, వైద్యం అవసరం లేని చోటుకు! ‘‘జీవితంలో ఒకేచోట ఉండిపోండి. ఎక్కడున్నారో అక్కడే. అదే స్నేహితులు, అదే కుటుంబం, అదే ఉద్యోగం. నిస్పృహ వస్తుంది. రానివ్వండి. ధ్యానం ఉంది కదా.. దాంతో మీ గుండెనిండా సంతృప్తి నింపుకోండి. నిస్పృహ పోతుంది’’ అంటాడు పొల్లాక్‌!  అంటే మనకు మనమే వైద్యులం. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదనేది మన ఫీలింగ్‌. ఇన్నర్‌ హీలింగ్‌కి కావలసింది మన నాడికి మన చెయ్యే. బహుశా ఇదే కావచ్చు ‘హార్ట్‌ఫుల్‌నెస్‌ వే’. 

మరిన్ని వార్తలు