డాన్స్‌ డాక్టర్‌

1 Nov, 2019 03:05 IST|Sakshi

మూవ్‌మెంట్‌ థెరపీ

సంగీతంతో అనారోగ్యాలను నయం చేయవచ్చని అంటుంటారు. మరి నాట్యంతో? సినిమాల్లో అయితే.. చచ్చుపడిపోయిన కాళ్లకు తిరిగి స్పర్శ తెప్పిస్తారు. నిజ జీవితంలో ఈ ప్రశ్నకు సమాధానమే.. ఈ మహిళా డాన్సర్‌. ఆమె తన నాట్యంతో మానసిక రుగ్మతలను తొలగించే వైద్యాన్ని అందిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అనుభవించే బాధలకు నృత్య భంగిమలతో  చికిత్స చేస్తున్నారు. ఇలా ఎంతోమంది జబ్బులను నయం చేస్తున్న  ఆ డాన్స్‌ డాక్టరే.. ముంబైకి చెందిన రెనెల్‌ స్నెల్లెక్స్‌.

రెనెల్‌ స్నెల్లెక్స్‌ స్కూల్‌లో చదువుకునే రోజుల్లో ఓ చిత్రమైన విద్యార్థిని. ఎవరితోనూ మాట్లాడేది కాదు. ముభావంగా ఉండేది. నవ్వుతూ, తుళ్లుతూ ఉండాల్సిన వయసులో ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ  ఉండేది. దీంతో అందరూ రెనెల్‌కు దూరంగా ఉండేవారు. అలా రోజులు గడుపుతూనే కష్టపడి చదివి ఎట్టకేలకు ఓ ఉద్యోగంలో చేరింది రెనెల్‌. కొన్నేళ్ల తర్వాత ఆ ఉద్యోగం మానేసి, డ్యాన్స్‌ క్లాస్‌లో చేరింది. అదే ఆమె జీవితంలో మలుపు. అప్పటివరకూ ఎప్పుడు చూసినా కోపంగా కనిపించే ఆమె ముఖంలో తొలిసారి చిరునవ్వు నర్తించడం మొదలైంది. ప్రతి ఒక్కరినీ నవ్వుతూ పలకరించడం ప్రారంభించింది. ఈ మార్పు గమనించి.. ఆమె గురించి తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. వాస్తవానికి బాల్యంలో జరిగిన ఓ ఘటనే రెనెల్‌ వింత ప్రవర్తనకు కారణమని అప్పట్లో ఎవరికీ తెలియదు.

బరువైన బాధగా బాల్యం!
పదేళ్ల వయసులోనే రెనెల్‌ లైంగిక వేధింపులకు గురైంది. అయితే దాని గురించి ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. అలా.. తీపి గుర్తుగా ఉండాల్సిన ఆమె బాల్యం ఓ బరువైన బాధగా మారింది. ఉద్యోగంలో చేరాక సైతం ఆ బాధ ఆమెను వదిలిపెట్టలేదు. చనిపోయేదాకా అనుభవించక తప్పదని అనుకునేది. అయితే అనుకోకుండా 2011లో డాన్స్‌ థెరపీ క్లాస్‌ గురించి తెలియడంతో అందులో చేరారు రెనెల్‌. ఈ నిర్ణయం ఆమె జీవితానికి ఆనందం తెచ్చిపెట్టింది. ఆ క్రమంలో డాన్సునే వృత్తిగా ఎంచుకొని, డాన్స్‌ థెరపీలో డిప్లొమా చేశారు. ఆ తర్వాత ముంబైలో టాటా మోటార్స్‌ సంస్థతో భాగస్వామ్యం పొంది ‘డాన్స్‌ మూమెంట్‌ థెరపీ’ (డీఎమ్‌టీ) సంస్థను ప్రారంభించారు. ఇందులో వివిధ మానసిక రోగాలతో బాధపడేవారికి డాన్స్‌తో వైద్యం చేస్తున్నారు.

అంతేకాదు, ప్రత్యేకించి గృహహింస, అత్యాచార సమస్యలను ఎదుర్కొన్న మహిళలు, అక్రమ రవాణాకు చిక్కుకున్న బాలికలను ఆదుకోవడం కోసం కోల్‌కత్తాలోని ఓ స్వచ్ఛంద సంస్థతోనూ కలసి పనిచేస్తున్నారు రెనెల్‌. ఇప్పటివరకు సుమారు 20 వేల మంది బాధితులకు సాంత్వన చేకూర్చి తిరిగి వారిని మామూలు మనుషులను చేయగలిగారు. రెనెల్‌ చేసిన ఈ కృషి గురించి ‘ఎమ్‌జీ చేంజ్‌ మేకర్స్‌ సీజన్‌ 2’లో ప్రసారం అవడంతో దేశంలోని పలు నగరాలకు ఈ డీఎమ్‌టీ సంస్థలు విస్తరించాయి. ఈ విషయమై రెనెల్‌ మాట్లాడుతూ. ‘‘మనసుకు తగిలిన గాయాలు ఎంత కఠినంగా ఉంటాయో నాకు తెలుసు. అందుకే నా జీవితాన్ని గాయపడినవారికి నయం చేయడానికే అంకితం చేశా..’’ అని అన్నారు.
– దీపిక కొండి, సాక్షి స్కూల్‌ ఎడిషన్‌

మరిన్ని వార్తలు