పర్‌ఫ్యూమ్స్‌తో జాగ్రత్త!

7 Nov, 2019 03:23 IST|Sakshi

ప్రమాద పరిమళం

ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా బాగా చవగ్గా లభ్యమయ్యే సెంట్లు, ఇతర సుగంధ ద్రవ్యాలు మార్కెట్లోకి విరివిగా వస్తున్నాయి. ఈ చీప్‌ పర్‌ఫ్యూమ్స్‌ కారణంగా కొన్ని వ్యాధులు, సెంట్‌ల కారణంగా వచ్చే అలర్జీలు పెరిగాయంటున్నారు అధ్యయనవేత్తలు.

పర్‌ఫ్యూమ్స్‌తో అనర్థాలివే...
సెంట్స్‌ కారణంగా అనేక రకాల అలర్జీలు, కాంటాక్ట్‌ డర్మటైటిస్, ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధులు పెరుగుతున్నాయి. అంతేకాదు... అలా సెంట్‌ వాసన సోకిన వెంటనే కొందరిలో మైగ్రేన్‌ సమస్య మొదలవుతుంది. ఇటీవల ఈ కారణంగా వచ్చే తలనొప్పులు పెరుగుతున్నాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. సెంట్స్‌ చర్మానికి తగలడంతో పాటు, వాటి వాసన వ్యాప్తిచెందడం వల్ల అనేక రకాల చర్మవ్యాధులు వస్తున్నాయని ఇంగ్లాండ్‌లోని క్యాంటర్‌బరీ కెంట్‌ ఛాసర్‌ హాస్పిటల్‌కు చెందిన చర్మవైద్య నిపుణులు డాక్టర్‌ సుసానా బ్యారన్‌ పేర్కొన్నారు.

ఇలా ఉపయోగించామో లేదు... వెంటనే అలా అలర్జీకి కారణమయ్యే అలర్జెన్‌ల తాలూకు జాబితాను రూపొందించేందుకు యూరోపియన్‌ యూనియన్‌ సైంటిఫిక్‌ కమిటీ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో ఘాటైన సువాసనలు వెదజల్లే అనేక సుగంధ ద్రవ్యాలు చోటు చేసుకున్నాయి. మంచి వాసనలను వెదజల్లే వస్తువులు ఉదాహరణకు... కొన్ని ఘాటైన వాసనలు వెదజల్లే   సబ్బులు, షాపూలు సైతం అలర్జీలకు కారణమవుతున్నట్లు తేలింది.

కొందరు వ్యక్తులు తమ ప్రైవేట్‌ పార్ట్‌ వద్ద సుగంధద్రవ్యాలను ఉపయోగిస్తుంటారు.వారి చర్మ ఆరోగ్యం గురించి డర్మటాలజిస్టు నిపుణులు చెప్పే మాటలిలా ఉన్నాయి.  ‘కొందరు తమ అండర్‌ గార్మెంట్స్‌ వద్ద టాల్కం పౌడర్‌ వంటివి జల్లుకుంటారు. అలా మన ప్రైవేట్‌ పార్ట్స్‌ వద్ద ఘాటైన వాసనలు వెదజల్లే సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం కంటే... ప్రతిరోజూ శుభ్రంగా స్నానం చేయడం, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికిన ఫ్రెష్‌ అండర్‌ గార్మెంట్స్‌ తొడుక్కోవడమే ఆరోగ్యకరం’ అన్నది డర్మటాలజిస్టుల సలహా.

మరిన్ని వార్తలు