రిజర్వేషన్ల స్ఫూర్తికి ఆటంకం

17 Jan, 2019 01:01 IST|Sakshi

కొత్త కోణం

రిజర్వేషన్లను చాలామంది దానధర్మంగానూ, భిక్షగానూ భావిస్తున్నారు. కానీ భారత ప్రజాస్వామిక సూత్రంలో ప్రాతినిధ్యం కీలకమైనది. ఏ కులాలకైతే ప్రాతినిధ్యం లేదో, ఆయా కులాలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ, విధానాలను రూపొందించాలి. మూడువేల ఏళ్ళుగా వివక్షకు, అణచివేతకు కారణమైన అగ్రకులాల ఆధిపత్యాన్ని కొత్తగా తెచ్చిన కోటా మరింత పటిష్ట పరుస్తుందన్నది నగ్న సత్యం. అగ్రకులాల పేదలకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకూడదని ఎవ్వరూ అనడం లేదు. చదువుల విషయంలో ఇప్పటికే వారికి స్కాలర్‌షిప్స్‌ ఉన్నాయి. ఇంకా వాటిని అందరికీ అందేవిధంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ రిజర్వేషన్ల స్ఫూర్తిని దెబ్బతీయకూడదు.

‘‘అధికారానికీ, అవకాశాలకూ అవతల ఉన్న సమూహాలకూ, కులాలకూ ప్రత్యేకమైన అవకాశాలూ, హక్కులూ కల్పించాలి. వారి కోసం ప్రత్యేక చట్టాలు చేయాలి. అందుకు గాను ప్రాథమిక హక్కులలో దానికి చోటు కల్పిస్తున్నాము’’ ప్రాథమిక హక్కులలో భాగమైన ఆర్టికల్‌ 16పైన జరిగిన చర్చలో పాల్గొంటూ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ చేసిన వ్యాఖ్యలివి. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న అంశాలు కూడా దీనిని ధృవ పరుస్తున్నాయి. మన దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం సాధిం చడానికి ఒక ప్రణాళిక అవసరం. అందులో భాగంగానే అన్యాయానికీ, అసమానతలకూ, అణచివేతకూ, వివక్షకూ గురైన వర్గాల కోసం కొన్ని ప్రత్యేక అవకాశాలూ, చట్టాలూ చేశాం. చేస్తున్నాం. కానీ, ఆర్థికంగా వెను కబడిన వర్గాల కోసం పార్లమెంటులో ఆమోదించిన చట్టం రాజ్యాంగ విలువలనూ, ప్రాథమిక లక్ష్యాలనూ విస్మరించింది. భారతదేశ కుల వ్యవస్థలో ఆధిపత్య స్థానంలో ఉన్న వర్గాలకు విద్య, ఉపాధి రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఈ చట్టం చేశారు. సమాజంలో ఉన్న ఏ అంతరాలైతే పోవాలని మనం కోరుకుంటున్నామో అవే అంతరాలను అంతకంతకూ అధికం చేసేదే ఈ చట్టం అని నా అభిప్రాయం. అసలు రిజర్వేషన్లు ఎవరికివ్వాలి? ఎందుకివ్వాలి? అర్థం చేసుకోవాలంటే చరిత్ర అడుగడుగునా చెరగని దళితుల నెత్తుటి జాడలను తడిమి చూడాలి.

తరతరాల అవమాన భారాన్ని పెంటతట్టలా నెత్తిన మోసిన వేన వేల దళితులకు పరిహారంగా వచ్చిందే రిజర్వేషన్ల ప్రక్రియ. చరిత్ర పరి ణామ క్రమంలో జరిగిన మానవ భావజాల తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశాన్ని అంబేడ్కర్‌ రిజర్వేషన్ల పేరుతో కల్పించారు. కానీ ఈరోజు చేసిన చట్టం ద్వారా కల్పిస్తున్న ఈబీసీలకు పదిశాతం రిజర్వేషన్లు మాత్రం ఆధిపత్య చరితను పునఃప్రతిష్టించడానికే. నిజానికి గత రెండు వేల సంవత్సరాలకు పైగా జ్ఞానం, చదువు, సంపద మీద  కొంత మంది తరతరాల గుత్తాధిపత్యం కొనసాగుతోంది. ఈ ఆధిపత్య భావజాలమే సమాజాన్ని పిడికిట బిగించి అణగారిన వర్గాలను అందులో బంధిం చింది. దీన్ని జయించడానికి రిజర్వేషన్లు ఓ చిన్న ప్రయత్నం మాత్రమే. భారత సమాజంలో వర్ణవ్యవస్థను నిర్మించి, కొన్ని వర్గాలకు, కొన్ని ప్రత్యేకమైన అవకాశాలను కల్పించారు. చదువు జ్ఞానం, సంపద మీద అధికారాన్నీ, ఆధిపత్యాన్నీ బ్రాహ్మణులు సంపాదించడం అందులో భాగమే. ఆ తరువాత క్షత్రియులు అధికారాన్ని సాగించారు. వైశ్యులు వ్యవసాయం, వ్యాపారం మీద అజమాయిషీ పొందారు. శూద్రులు వృత్తుల ద్వారా, ఇతర పరిచర్యల ద్వారా సేవకులుగా ఉన్నారు. ఇప్పుడు మనం ఎస్సీ, ఎస్టీలుగా పిలుస్తున్న నూటికి 25 శాతం మంది ఈ ఆధి పత్య సమాజం అంచులను కూడా తాకలేకపోయారు.

ఈ ఆధిపత్య వ్యవస్థపై పడిన మొదటి సమ్మెట దెబ్బ 1902లో బ్రాహ్మణులతోపాటు బ్రాహ్మణేతర కులాలకు విద్య, ఉద్యోగాల్లో అవ కాశాలు కల్పించడానికి కొల్లాపూర్‌ సంస్థానాధీశుడు సాహుమహారాజ్‌ రిజర్వేషన్లు కల్పించడంతో పడింది. దీనితో ఆ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మ ణేతరులైన మరాఠాలతోపాటు, అనేకమందికి ప్రభుత్వంలో భాగ స్వామ్యం లభించింది. అటువంటి నిర్మాణాత్మక చర్యలలో భాగంగానే అంబేడ్కర్‌లాంటి వారికి సాహుమహారాజ్‌ సహాయ, సహకారాలు లభిం చాయి. కొల్లాపూర్‌ సంస్థానం మరాఠాల అధికారంలో ఉన్నప్పటికీ, మెజారిటీ ఉద్యోగాలు బ్రాహ్మణుల చేతుల్లోనే ఉండేవి. అప్పటికే మహా రాష్ట్రలో పుణె పట్టణం కేంద్రంగా జ్యోతిబాఫూలే నాయకత్వంలో సాగిన సత్యశోధక సమాజ్‌ ఉద్యమం ఆనాటి సమాజం మీద తీవ్రమైన ప్రభా వాన్ని కలుగజేసింది. అక్కడ మొదలైన సామాజిక పరివర్తన మైసూర్‌ సంస్థానంలో, మద్రాసు రెసిడెన్సీలో కూడా ప్రతిధ్వనించింది.

1919 నుంచి బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సాగించిన పోరాటాన్ని దీని కొనసాగింపుగానే చూడాలి. రాజకీయ హక్కుల కోసం సౌత్‌బరో కమిటీ ముందు నినదిస్తే, భారతదేశంలో అమలు చేయాల్సిన సంస్క రణల గురించి సైమన్‌ కమిషన్‌కు వినిపించారు. భారతదేశానికి అవసర మైన ప్రభుత్వ వి«ధానాలేవి అనే అంశాలపై 1930, 1931 సంవత్సరాల్లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లలో అంటరాని కులాల హక్కుల కోసం అంబేడ్కర్‌ ఒంటరిపోరాటం చేశారు. అప్పటికే తిరుగులేని నాయ కుడుగా ఉన్న మహాత్మాగాంధీని కూడా ఎదిరించి, అంటరాని కులాల హక్కుల కోసం పోరాడి విజయం సాధించారు. అయితే గాంధీ అంట రాని కులాలను ప్రత్యేక వర్గంగా చూడడానికి నిరాకరించారు. ప్రత్యేక ఓటింగ్‌ విధానం ద్వారా తమ అభ్యర్థులను తామే ఎన్నుకునే ఒక అవ కాశాన్ని గాంధీ దెబ్బకొట్టారు. దానిపేరే పుణె ఒడంబడిక. దాని ద్వారా అంటరాని కులాలకు అంటరాని కులాల ప్రజలు మాత్రమే ఓటువేసే అవకాశం కోల్పోయి, అంటరాని కులాలకు అందరం ఓటు వేసే రిజ ర్వుడు నియోజకవర్గాల పద్ధతి అమలులోకి వచ్చింది.

ఆ తర్వాత 1946 నుంచి 1950 వరకు సాగిన రాజ్యాంగ సభలో అనేక పరిణామాలు జరిగాయి. ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచిన అనేక అవకాశాలకు గాంధీకి అత్యంత సన్నిహితుడైన సర్దార్‌ పటేల్‌ మోకాలడ్డారు. 1950 వరకు ముస్లింలకు, క్రిస్టియన్లకు, ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వేషన్లు ఉండేవి. పరిమిత ప్రయోజనంలోనైనా అవి కొనసాగాయి. అయితే భారత రాజ్యాంగంలో వాటిని కొనసాగించడానికి సర్దార్‌ పటేల్‌ ఒప్పుకోలేదు. అసలు రిజర్వేషన్ల విధానమే అవసరం లేదని మొండికేశారు. అంబేడ్కర్‌ దానిని ఒప్పుకోలేదు. తరతరాలుగా వివక్షకూ, అవ మానాలకూ గురౌతోన్న ఎస్సీ, ఎస్టీలకు మాత్రం రిజర్వేషన్లు కల్పిం చారు. అంబేడ్కర్‌ దూరదృష్టితో తీసుకొచ్చిన ఆర్టికల్‌ 46 వల్ల స్వాతం త్య్రానంతరం వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం వచ్చింది. ‘‘సమాజంలోని బలహీన వర్గాలకు విద్య, ఆర్థికపరమైన అవ కాశాలను మెరుగుపరచడానికి కృతనిశ్చయంతో ఉంటుంది. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తుంది’’ అనేది ఆర్టికల్‌ 46 ఉద్దేశ్యం. ఆ తర్వాతనే అనేక కమిటీలు, కమిషన్లను ఏర్పాటు చేశారు. చివరకు మండల్‌ కమిషన్‌ సిఫారసుల అమలు ద్వారా దేశంలోని వెనుకబడిన కులాలు విద్య, ఉద్యోగావకాశాలను పొందుతున్నారు. ఇప్పటికే భారత సుప్రీంకోర్టు ఆర్థిక ప్రాతిపదికన తీసుకొచ్చే రిజర్వేషన్ల విషయంలో తన వ్యతిరేకతను ప్రకటించింది. చరిత్రలో తరతరాలుగా అణచివేతకు, వివ క్షకూ గురైన కులాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో సమానావకాశాలు అందించేందుకే రిజర్వేషన్లు కల్పించారని తేల్చి చెప్పింది.

రిజర్వేషన్లను చాలామంది దానధర్మంగానూ, భిక్షగానూ భావిస్తు న్నారు. కానీ భారత ప్రజాస్వామిక సూత్రంలో ప్రాతినిధ్యం కీలకమైనది. ఏ కులాలకైతే ప్రాతినిధ్యం లేదో, ఆయా కులాలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ, విధానాలను రూపొందించాలి. కానీ నేడు దేశంలో అగ్రకులాల ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో వారి జనాభాకు మించి ఉన్నది. భారత ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కేడర్‌–1, కేడర్‌–2లలో అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతున్నది. కేవలం కేడర్‌–4లో మాత్రం ఇతర కులాలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. కేడర్‌–4 పోస్టులు కేవలం అటెండర్లు, డ్రైవర్లు, స్వీపర్లు, స్కావెంజర్లు ఉంటారు. ఐఏఎస్, ఐపీఎస్‌ లతో పాటు ఇతర ఉన్నతోద్యోగులలో అగ్రవర్ణాలు దాదాపు 50 నుంచి 60 శాతం ఉన్నారు. దేశంలో వారి జనాభా కేవలం 15 నుంచి 20 శాతా నికి మించదు. కొన్ని రాష్ట్రాల్లో కేవలం పది శాతంగా కూడా వారు లేరు.
రిజర్వేషన్లకు ప్రాతిపదికగా ఉండే వివక్ష, అణచివేత, దోపిడీ అగ్ర కులాలు ఎదుర్కోవడం లేదు.

వారి పేదరికానికి వేరే ఎవ్వరూ కారణం కాదు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర మైనారిటీ వర్గాల పేదరికానికి, వెనుకబాటుతనానికీ కుల వివక్ష, అణచివేత ప్రధాన కారణాలు. నిజానికి ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల అభ్యున్నతికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం ఉన్న చట్టాలు ఏవీ కూడా ఆశించిన స్థాయిలో అమలు జరగడం లేదు. మూడువేల ఏళ్ళుగా వివక్షకు, అణచివేతకు కారణమైన అగ్రకులాల ఆధిపత్యాన్ని కొత్తగా తెచ్చిన కోటా మరింత పటిష్ట పరుస్తుందన్నది నగ్న సత్యం. బీజేపీ ఈ దేశంలో అగ్రకులాల ఆధిçపత్యం కొనసాగించాలనుకుంటోంది. తమ రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తు న్నట్టు కనిపిస్తున్నది. మిగతా పార్టీల నాయకత్వాలు కూడా అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి. దానివల్ల ఏ పార్టీ కూడా ఈబీసీ రిజర్వేషన్లను వ్యతి రేకించలేదు.

అయితే అగ్రకులాల పేదలకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకూడదని ఎవ్వరూ అనడం లేదు. చదువుల విషయంలో ఇప్పటికే వారికి స్కాలర్‌ షిప్స్‌ ఉన్నాయి. ఇంకా వాటిని అందరికీ అందేవిధంగా చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే అన్ని స్థాయిల్లో అందరికీ ఉచిత విద్య కల్పించవచ్చు. అంతేకానీ చారిత్రక అవ సరంగా వచ్చిన రిజర్వేషన్ల స్ఫూర్తిని దెబ్బతీసే కుట్రకు ఈచట్టం సాధనం కాకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగ ప్రాతిపదిక ఉంది. అదే సామాజిక అంతరాలూ, వివక్ష. అంత రాలను అధిగమించడం కేవలం కొన్ని వర్గాల అభివృద్ధికే కాదు, అది సామాజిక అభ్యున్నతికి అవసరం కూడా. అదే న్యాయం కూడా. కానీ ఈ రోజు బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు అనే అంశం రాజ్యాంగ స్ఫూర్తికీ, సామాజిక న్యాయానికీ, సామాజిక విలువలకూ విరుద్ధమైనది. వివక్షాపూరిత విష చరితకు ఇది నాంది కాబోతోంది.

మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా