మహిళలపై గౌరవం పెరుగుతోంది

5 Jan, 2020 00:15 IST|Sakshi
‘లక్ష్మీబాంబ్‌’ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌

రెండు  విషయాలు

‘లక్ష్మీ బాంబ్‌’ సినిమాలో అక్షయ్‌ కుమార్‌ను ట్రాన్స్‌జెండర్‌ ఆత్మ ఆవహిస్తుంది. షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదు. మే 22న విడుదల అనుకున్నారు. ఆ సినిమాలో అక్షయ్‌ చీర కట్టుకోవాలి. కట్టుకుని ఊరికే స్టిల్‌ ఇవ్వడం కాదు. కొన్ని సన్నివేశాలలో యాక్ట్‌ చెయ్యాలి. చేశాడు!! పైగా ఈజీగా. చీర కట్టుకుని నటించడం తనకేం ఇబ్బందిగా అనిపించదలేని అంటాడు. క్యారెక్టర్‌ కష్టం అయింది కానీ, చీర కట్టుకున్నందు వల్ల కష్టం అవలేదట. ‘‘ఇలాంటి ‘ట్రికీ స్టఫ్‌’ని చేయడం నాకు ఇష్టం. చీర కట్టుకున్నంత మాత్రాన స్త్రీ అయిపోము. స్త్రీలా అనిపించాలి. అందుకు మాత్రం కొంచెం ప్రాక్టీస్‌ చేయవలసి వచ్చింది’’ అన్నాడు అప్‌డేట్స్‌ మీట్‌లో. అక్షయ్‌ కొంతకాలంగా అన్నీ భిన్నమైన పాత్రలు ఎంచుకుంటున్నారు.

భిన్నమైన పనులు కూడా చేస్తున్నారు. ఈ మధ్య పురిటినొప్పులు ఎలా ఉంటాయో తెలుసుకోడానికి తనపై చిన్న ప్రయోగం కూడా చేయించుకున్నాడు. డాక్టర్లు అక్షయ్‌ ఒంటికి వైర్లు పెట్టి నొప్పుల తీవ్రతను పెంచుతూ పోయినప్పుడు హాహాకారాలు చేశాడు. అది లేబర్‌ పెయిన్‌ టెస్ట్‌. ఆ టెస్ట్‌ అయిన వెంటనే ‘బతుకు జీవుడా’ అంటూ.. బల్ల మీద నుంచి కిందికి ఎగిరి దూకి బయటికి వచ్చాడు. ‘ఇంత నొప్పిని భరించిన అమ్మలందరికీ వందనాలు. మహిళలపై నాకు గౌరవం పెరుగుతోంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో దండాలు పెట్టాడు.

అమ్మాయిలపై అసూయ కలుగుతోంది

నీనా గుప్త! కాస్త పెద్దావిడ. 60 ఏళ్లుంటాయి. వయసు కారణంగా పెద్దావిడ కాదు. బాలీవుడ్‌ నటిగా, టీవీ దర్శకురాలిగా నీనాకు గుర్తింపు, గౌరవం ఉన్నాయి. పెద్ద స్టార్‌డమ్, జాతీయస్థాయి వచ్చాయి. ఇటీవలి ‘బధాయీ హో’, ‘ముల్క్‌’, ‘వీరె ది వెడ్డింగ్‌’ చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు చూస్తే ఎవరికైనా అసూయ కలుగుతుంది. కెరీర్‌లో సంతృప్తినిచ్చే పాత్రలు అవి. ఇక చాలు సినిమాలు మానేయొచ్చు అనుకునేంతవి కూడా. అయితే నీనానే ఇప్పుడు.. ఇప్పటి అమ్మాయిల్ని చూసి అసూయ పడుతున్నారు. ‘కొత్తవాళ్లకు మంచి మంచి పాత్రలు ఉన్న సినిమాలు వస్తున్నాయి. నేనూ చిన్నదాన్నైపోయి అంటువంటి పాత్రల్లో నటిస్తే బాగుండుననిపిస్తోంది. సినిమాల్లోకి వస్తున్న ఈ తరం అమ్మాయిలు ఎంతైనా అదృష్టవంతులు’’ అని నీనా అంటున్నారు. ‘అసూయ కలుగుతోంది’ అని నీనా ఊరికే అన్నారు కానీ.. ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న అమ్మాయిల్లో ఉత్సాహం నింపడం అది.


 

మరిన్ని వార్తలు