అన్నం పెట్టే చెయ్యి!

9 Jul, 2017 23:20 IST|Sakshi
అన్నం పెట్టే చెయ్యి!

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలంటే మనిషిలో ఏం ఉండాలి? చేతినిండా డబ్బా? కాదు... మనసు నిండా ఆర్ద్రత? నిజమే... అంతగా స్పందించే మనసు ఉన్నప్పుడే ఇలాంటి సేవ సాధ్యం. ఇందుకు నిదర్శనమే రామాంజనేయులు.

పెద్ద మనసు
అది గుంటూరు జల్లా, నిజాం పట్నం మండలంలోని అడవుల దీవి గ్రామం. అన్ని గ్రామాల్లో జరిగినట్లే అడవుల దీవిలో కూడా పండుగలు, పర్వదినాల్లో దేవాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానాలు జరిగేవి. ఆ అన్నదానాల సమయంలో వృద్ధులు, అనాథలు, దిక్కులేని వాళ్లు భోజనాల కోసం బారులుదీరేవారు. ఆ సంఘటన యేమినేని రామాంజనేయులిని కలచి వేసింది. పంటలు పండించి పదిమందికి అన్నం పెట్టే పల్లెలో కూడా ఇంతమంది అన్నం లేని వాళ్లు ఉన్నారా అని మధనపడ్డాడు. వయసుడిగిన వాళ్లు వేళకు అన్నం తినకపోతే సొమ్మసిల్లి పోయేటట్లు కనిపించారు. వారికి ఆ ఎండలు తగ్గే వరకు రోజుకు కనీసం ఒక్కపూటైనా కడుపునిండా అన్నం పెట్టగలిగితే అని ఆలోచించాడు.  మొదట ఇరవై మంది వచ్చేవారు, ఇప్పుడు రోజూ 75 మంది భోజనం చేస్తున్నారు. భోజనం చేసి వెళ్తూ... ‘‘చల్లంగుండయ్యా...మా కోసమే ఆ దేవుడు నిన్ను పంపిండు’’ అని వృద్ధులు దీవిస్తున్నారు.

చిన్న ఆలోచన!
ఎండాకాలం రెణ్నెల్ల కోసం గత ఏడాది వేసవిలో మొదలైంది. ఇప్పటికీ కొనసాగుతోంది. ఒక మంచి పని మొదలు పెట్టావు, ఆపవద్దంటూ రామాంజనేయులుకు ఊరివారంతా అండగా నిలిచారు. బతికినన్నాళ్లూ కాయకష్టం చేసి పిల్లల్ని పెంచి పెద్దచేసిన వారికి, వృద్ధాప్యంలో తిండి కోసం ఎదురు చూసే పరిస్థితి రాకూడదని, ఈ మంచిపనిని కొనసాగిద్దామని ముందుకొచ్చారు. కమిటీగా ఏర్పడి పనిచేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఏడాదంతా పని దొరకడం కష్టం. ఏడాదిలో కొన్నాళ్లపాటు ఉపాధి కోసం వలస వెళ్తుంటారు. కుటుంబాల్లో వృద్ధులు ఇంటిని కనిపెట్టుకుని కొడుకు, కోడళ్లు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ రోజులు వెళ్లదీస్తుంటారు. కొందరి పిల్లలు ఊళ్లో ఉండి కూడా ముసలి వాళ్లకు తిండి పెట్టరు. ఆ పండుటాకులకు రామాంజనేయులు అన్నం పెట్టే దేవుడయ్యాడు.

పండని పొలంతో కష్టాలు!
‘‘మాకు తీరప్రాంతంలో పొలం ఉంది. పంటకు పనికిరాని పొలం. మా అమ్మనాన్నలు సాంబశివరావు, శివకుమారి. మా అక్కయ్య, తమ్ముడు, నేను... ముగ్గురం పిల్లలం. మమ్మల్ని చదివించటానికి వాళ్లెంత కష్టపడ్డారో నాకు తెలుసు. బడ్డీ్డ కొట్టు పెట్టుకుని మమ్మల్ని డిగ్రీ వరకు చదించారు. అక్కకు పెళ్లి చేశారు. అంతటి కష్టంలో ఉన్నప్పుడు కూడా మనకున్నదాంట్లోనే పదిమందికి సాయం చేయాలని చెప్పేవాళ్లు’’ ఆ మాటలే తనను నడిపించాయంటాడు రామాంజనేయులు. అతడి చొరవతో ఇప్పుడు అడవుల దీవిలో అనాథలు, వృద్ధులు ఎవరూ ఆకలి కడుపుతో పడుకోవడం లేదు.
– గడ్డం వాసు, సాక్షి, రేపల్లె

సంపాదనలో కొంత!
పదేళ్ల కిందట డిగ్రీపట్టాతో హైదరాబాద్‌ వెళ్లాను. సేల్స్‌ ప్రమోటర్, షాపింగ్‌ మాల్‌ సుపర్‌వైజర్‌గా చేశాను. ఉద్యోగం చేస్తూండగానే సినిమా రంగంతో పరిచయమైంది. పాటలు రాసే అవకాశాలు వస్తుండటంతో ఉద్యోగం మానేశాను. నా సంపాదనతో అంతమంది ఆకలి తీర్చడం సంతోషంగా ఉంది. ఆ డబ్బు మిగుల్చుకుంటే నేను ఖరీదైన చొక్కా వేసుకుంటానేమో, ఇంకా సంపాదిస్తే పెద్ద కారులో తిరుగుతానేమో. అవేవీ ఇలాంటి సంతోషానికి సాటిరావు’’
– యేమినేని రామాంజనేయులు

అంతటి భాగ్యం దక్కింది!
మహత్తర కార్యక్రమంలో సేవ చేసే భాగ్యం దక్కటం ఆనందంగా ఉంది. ప్రతి రోజూ ఇంటి వద్ద భోజనాలు తయారు చేయించి వృద్ధులు, అనాథలకు పెడుతున్నాం.
– పాటిబండ సాయిబాబు, కమిటీ ఉపాధ్యక్షుడు

కడుపునింతా తింటున్నా!
కష్టపడానికి ఓపిక లేదు. ఉండటానికి ఇల్లు లేదు. మతిస్థిమితం లేని మూగ చెల్లెలిని బంధులకు అప్పగించాను. నేను కూడా వెళ్తే వాళ్లకు భారమని వెళ్లలేదు. కానీ తిండి కోసం చాలా బాధపడేవాడ్ని. పోయిన సంవత్సరం ఆ బాబు మధాహ్నం భోజనం పెట్టటం మొదలు పెట్టాక కడుపునిండా భోజనం దొరుకుతోంది. ఆ బాబు చల్లగ ఉండాలి.
– పి.రాజారావు

నా బిడ్డలు వచ్చే వరకు ఇక్కడే!

బిడ్డలు ఇక్కడ లేరు. రోజూ వండుకుని తినాలంటే నడుము లేచేది కాదు. రోజూ ఇక్కడే తింటున్నాను. నా బిడ్డలు వచ్చే వరకు ఇక్కడే ఈ బిడ్డ దగ్గరే అన్నం తింటాను.  
– తోట నాగేంద్రమ్మ

మరిన్ని వార్తలు