ఎదిగిన పిల్లలు

26 Feb, 2018 00:48 IST|Sakshi

తుమ్‌ ఇత్‌నా జో ముస్కురా రహే హో... సెల్‌లో తక్కువ శబ్దంలో పాట వింటున్నాను. అలజడిగా ఉన్నప్పుడు పాట వింటాను. అలజడిగా ఉన్నప్పుడే అన్నయ్య ఫోన్‌ కూడా వస్తుంది. ఎలా తెలుసో వాడికి ఇప్పుడు చేయాలని. ‘ఏంటమ్మడు సంగతులు?’ ‘ఏంటంటున్నాడు మీ ట్రంపు?’ హుషారు తెచ్చుకుంటూ అన్నాను. ‘వద్దులే... పాయింటుకురా. గొంతులో వేరియేషన్స్‌ మార్చి ఎందుకు అవస్థలు పడతావు. ఏమంటున్నాడు సామర్లకోట పెళ్లికొడుకు’ ‘చేసుకుంటానన్నాడు’ ‘గుడ్‌’ ‘అయితే చిన్న డౌటండీ... మీ అమ్మ నిజంగానే చచ్చిపోయిందా లేదంటే అందరూ అనుకున్నట్టుగా అని మూడు చుక్కలు పెట్టాడు’ ‘ఏమన్నావు’ ‘మూడు చుక్కలే నిజమండీ అన్నాను. అయినా మీకు ఆ మూడు చుక్కలే అభ్యంతరం అయితే మన పెళ్లి జరగదండీ అని కూడా చెప్పాను.

కాఫీ తాగాక ఆలస్యం చేయకుండా బయల్దేరమన్నాను’ ‘బెదరగొట్టుంటావ్‌’ ‘లేదులే. కుర్రాడు గట్టాడు. మా అమ్మకు నేను సర్ది చెప్తానండీ. అదంతా నాకు ఇష్యూ కాదు. నేను మిమ్మల్ని తప్పక చేసుకుంటాను. మీరు నాకు నచ్చారు అన్నాడు’. ‘అయితే గట్టాడు కాదు... తెలివైనాడు. నువ్వు చదువులో బ్రిలియెంట్‌. అదిరిపోయే ఉద్యోగం ఉంది. కష్టపడి ఫ్లాట్‌ కొనుకున్నావు. అంతర జ్ఞానంతోనో ఆత్మ విశ్వాసంతోనో నువ్వు అతడితో భుజం భుజం రాసుకుని నిలబడినప్పుడు ఇద్దరూ సమానం అని అన్నప్పుడు... హు... నువ్వు ఫలానా ముడుచుక్కలదాని కూతురువి నేను దయదలిచి చేసుకున్నాను అని ఒక దెబ్బ కొడతాడు. లేవకుండా పడి ఉంటావు. ఆ ప్రమాదమైతే నీకు ఎప్పుడూ ఉంటుంది. ఫరెవర్‌. దానికి ప్రిపేరవ్వు. అదీగాక’.... ఫోన్‌ కట్‌ అయ్యింది.

యు.ఎస్‌ కాల్‌ ఒకసారైనా కట్‌ అయితేనే దానికి గౌరవం. మళ్లీ వచ్చేదాకా ఎదురు చూసేలా చేయడం అంటే దానికి ఆట. అమ్మ కూడా అలా ఆట ఆడిందా? ఆటేమో అనుకున్నాను చిన్నప్పుడు. ఇవాళొస్తుంది... రేపొస్తుంది అనుకున్నాను. కాని రాలేదు. ఆట కాదు. నిజమే. నాన్నకు ఉత్తరం రాసి వెళ్లిపోయిందట. మొగుడు పోయిన మేనత్త ముక్కు చీదుతూ వచ్చి దగ్గరకు తీసుకుంది. వంట చేసింది. నచ్చలేదు. దగ్గరకు తీసుకోవాలని చూసింది. నచ్చలేదు. అమ్మ కావాలి... నాకు అమ్మ కావాలి... ఏడుస్తూనే ఉన్నాను. నాకంటే నాలుగేళ్ల పెద్దవాడు అన్నయ్య. ఇద్దరం ఎంత వయసు పిల్లలమని? ఏడుస్తూనే ఉన్నాం. శవం లేచిన ఇంటిదైతే అదో తీరు. నాల్రోజులు ఏడుస్తారు. వదిలేస్తారు. ఇదలా కాదు. మనిషి మాయమైన ఇల్లు. స్త్రీ మాయమైన ఇల్లు. భార్య మాయమైన ఇల్లు. తల్లి మాయమైన ఇల్లు. ఇంటి మర్యాద మాయమైన ఇల్లు. అమ్మ మీద కోపంతో ఆమె ఫొటో తగలబెట్టబోయాను.

అంతలోనే గుండెలకు గట్టిగా ఆన్చుకుని పెద్దగా ఏడ్చాను. దానిని జాగ్రత్తగా ప్రాణం కంటే మిన్నగా పుస్తకంలో దాచుకుని. బయట స్నేహితులతో ఆడుకుంటుంటే అమ్మ గుర్తుకొచ్చేది. వాకిలిలోని జాజితీగ మొదటి గుబురు వేస్తే అమ్మ గుర్తుకొచ్చేది. పాల గ్లాసులో ఇంకొంచెం పాలు మిగిల్చి కుర్చీలో గిరాటేసే అలవాటు మానుకుని అత్తయ్య కోసం దానిని శుభ్రంగా కడిగి వంటింట్లో పెడుతున్న ప్రతిసారీ అమ్మ గుర్తుకొచ్చేది. అమ్మా... అమ్మా... ఎందుకు వదిలేసి పోయావు. ఫోన్‌ మోగింది. ‘కట్‌ అయ్యింది అమ్మడు’... ‘ఊ...ఊ’... ‘ఏంటి ఏడుస్తున్నావా? నువ్వు పేరు మార్చుకుని ట్యాప్‌రాణి అని పెట్టుకోవే. కళ్ల మీదే ఉంటాయి నీకు ట్యాప్స్‌’ నవ్వాడు.

‘ఎందుకలా చేసిందన్నయ్య అమ్మ’ ఎన్నిసార్లు అడిగిందో తను. ఎన్నిసార్లు అడిగినా విసుక్కోడు అన్నయ్య. ‘చేసిందమ్మా. ఏం చేస్తాం’ ‘లీగల్‌గా విడిపోయి ఉండొచ్చుగా... అంతగా ఇష్టం లేకపోతే.’ ‘అదంతా సులభమా తల్లీ మన దేశంలో. మొగుడు ఇవ్వాలి. బంధువులు ఒప్పుకోవాలి. తల్లిదండ్రులు అత్తామామలు... తంతు నడిచే దాక సలహాలు సంప్రదింపులు...’ ‘పోనీ నిన్ను నన్నూ తీసుకెళ్లి ఉండొచ్చుగా’ నవ్వాడు. ‘నాన్న రెండో పెళ్లి చేసుకొనొచ్చి ఈమెనే మీ అమ్మ అనుకో అనంటే అనుకోగలిగావా. నోరారా ఒక్కసారి అమ్మా అని పిలువలేదు. ఆమె నిన్ను తీసుకెళ్లి ఈయనే నాన్ననుకో అనంటే అనగలిగేదానివా. అందుకే తీసుకెళ్ల లేదేమో’ ‘అసలు అంత కొంపలేం మునిగిపోయాయి అని’ ‘తెలియదమ్మా. అది అమ్మకూ నాన్నకే తెలియాలి.

ఆమె ఆశలూ ఆకాంక్షలు ఎలా ఉన్నాయో. ఆయన బిహేవియర్‌ ఎలా ఉందో. జీవితంలో ఒక్కసారైనా కళ్లల్లో కళ్లు పెట్టి చూసుకున్నారో లేదో. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారో లేదో. అమ్మకు ఒక మనసు ఉందని ఆయన గ్రహించాడో లేదో. పెళ్లాం ఒక బాధ్యత మాత్రమే అనుకున్నాడో ఏమో. నీకు గుర్తుందా. నాన్న కాఫీ తాగాక తాగిన సిగరెట్‌ పీకను ఆ కప్పులోనే నులిమేవాడు. దానిని కడిగే ప్రతిసారీ అమ్మ వాంతి చేసుకున్నట్టు మొహం పెట్టేది. విముఖత్వానికి తాటిచెట్లే అడ్డం పడాలని లేదమ్మా. దారితీగ కూడా చాలు. పేపర్లలో వార్తలు చూస్తుంటాం. ఏదో ఇంట్లో ఎవరో హత్యో ఆత్మహత్యో చేసుకుంటారు. ఇరుగు పొరుగువాళ్లు మాత్రం ఇద్దరూ బాగానే ఉండేవారండీ అని అంటారు.

అరుపులు కేకలు వేసుకుంటేనే ఇద్దరికీ సరిపడనట్టు కాదు. నిశ్శబ్దంలో కూడా బోలెడంత అశాంతి ఉంటుంది’... ‘నేను అమ్మను క్షమించనన్నాయ్యా’ ‘అలా అనకమ్మా. తను ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకో’ ‘మరి నేను పడిన క్షోభ?’ ‘నీ స్వార్థం నువ్వు చూస్తున్నావు. తను మనిషి కాదా. తన స్వార్థం తాను చూసుకోకూడదా. ఆమె మన దగ్గరే ఉండిపోయింది అనుకుందాం. అప్పుడు ఇన్నాళ్లు తను అనుభవించాల్సిన క్షోభ. దానికేమంటావ్‌’ నా దగ్గర సమాధానం లేదు.

కథ ముగిసింది. పి.సత్యవతి రాసిన ‘దమయంతి కూతురు’ కథ ఇది. స్త్రీ, పురుషుల విభేదాలు, ఎడబాట్ల విషయంలో బ్లేమ్‌గేమ్‌ ఎవరి మీద సాగుతుందో మనం జాగ్రత్తగా గమనించాలి. స్వేచ్ఛను, తెగింపును, తిరుగుబాటును ప్రదర్శించిన ప్రతిసారీ నిందను స్త్రీ మీద వేసి ఆమెను విక్టిమ్‌ చేయడం  గమనిస్తాం. సమాజం, చట్టం అంగీకారంతో స్త్రీ స్వేచ్ఛను పొందవచ్చు. కాని అది జటిలమనుకుని అడుగు ముందుకేసిన స్త్రీలను మనం ఎదిగి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎదిగిన పిల్లలు మనకు చెబుతున్నది అదే.
 

మరిన్ని వార్తలు