ఉన్నత శిఖరాలు.. సాటిలేని సామర్థ్యాలు

28 Dec, 2019 01:35 IST|Sakshi

శిఖరానికి కిరీటం పెడితే ఎలా ఉంటుంది? అత్యున్నతమైన పదవిలో ఒక మహిళ కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది! వీళ్లెవరూ పదవుల కోసం ప్రయత్నించలేదు. పదవులే వీళ్ల కోసం ప్రయత్నించాయి. పనిలో సామర్థ్యం.. అంకితభావం.. నిబద్ధత ఉంటే.. ‘మీరే మమ్మల్ని లీడ్‌ చెయ్యాలి మేడమ్‌’ అని గొప్ప గొప్ప సంస్థలే అప్లికేషన్‌ పెట్టుకుంటాయి. అలా ఈ ఏడాది ‘లీడింగ్‌’లోకి వచ్చిన మహిళలు వీరు.

1. గీతా గోపీనాథ్, ఐఎంఎఫ్‌ చీఫ్‌

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) చీఫ్‌ ఎకనమిస్టుగా ప్రముఖ ప్రవాస భారతీయ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్టుగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందారు.

2. సుమన్‌ కుమారి, పాకిస్తాన్‌లో సివిల్‌ జడ్జి

పాకిస్తాన్‌ సివిల్‌ న్యాయమూర్తిగా సుమన్‌ కుమారి జనవరిలో నియమితులయ్యారు. ఖంబర్‌–షాదద్కోట్‌ జిల్లాకు చెందిన కుమారి న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. ఒక హిందూ మహిళ పాకిస్తాన్‌లో జడ్జి కావడం ఇదే మొదటిసారి.

3. ఇంద్రా నూయి, అమెజాన్‌ డైరెక్టర్‌

అమెజాన్‌ కంపెనీ డైరెక్టర్‌గా భారత సంతతి మహిళా ఇంద్రానూయి ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించారు. అమెజాన్‌లో డైరెక్టర్‌ అయిన రెండో మహిళగా ఇంద్రా నూయి గుర్తింపు పొందారు. ఆమెకన్నా ముందు 2019 ఫిబ్రవరి మొదటివారంలో స్టార్‌బక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ రోసలిండ్‌ బ్రెవర్‌ అమెజాన్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు.

4.జీసీ అనుపమ, ఏఎస్‌ఐ తొలి మహిళా ప్రెసిడెంట్‌

ఆస్టన్రామికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) తొలి మహిళా ప్రెసిడెంట్‌గా డాక్టర్‌ జీసీ అనుపమ ఎన్నికయ్యారు. అనుపమ సూపర్‌నోవాపై పరిశోధనలు చేశారు.

5. నీలా విఖేపాటిల్, స్వీడన్‌ ప్రధాని సలహాదారు

స్వీడన్‌ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో రాజకీయ సలహాదారురాలిగా భారత సంతతికి చెందిన మహిళ, మహారాష్ట్రకు చెందిన ప్రముఖ విద్యావేత్త అశోక్‌ విఖే పాటిల్‌ కుమార్తె నీలా విఖేపాటిల్‌ నియమితులయ్యారు. స్వీడన్‌లో జన్మించిన నీలా గుజరాత్‌లోని అహ్మద్‌నగర్‌లో తన బాల్యాన్ని గడిపారు.
 
6. నియోమీ జహంగీర్‌ రావు, యూఎస్‌లో డీసీ కోర్టు జడ్జి

అమెరికాలోని ప్రఖ్యాత డిస్టిక్ర్‌ ఆఫ్‌ కొలంబియా సర్క్యూట్‌ కోర్టు (డీసీ కోర్టు) జడ్జిగా ప్రముఖ భారతీయ అమెరికన్‌ న్యాయవాది నియోమీ జహంగీర్‌రావు ఎన్నికయ్యారు.

7. పద్మాలక్ష్మి , యూఎన్‌డీపీ అంబాసిడర్‌

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) నూతన గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా టెలివిజన్‌ రంగానికి చెందిన భారత సంతతి అమెరికన్, ప్రముఖ ఆహార నిపుణురాలైన పద్మాలక్ష్మి మార్చిలో  నియమితులయ్యారు.

8. దియామీర్జా,  ఐరాస ఎస్‌డీజీ ప్రచారకర్త

ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) ప్రచారకర్తగా బాలీవుడ్‌ నటి దియామీర్జా ఎంపికయ్యారు. పేదరికాన్ని రూపుమాపడం; అందరికీ ఆరోగ్యసంరక్షణ తదితర లక్ష్యాల సాధనకు కృషి చేస్తుంది.

9. అనితా భాటియా, యూఎన్‌–ఉమెన్‌ డిప్యూటీ డెరైక్టర్‌

మహిళా సాధికారత, స్త్రీ–పురుష సమానత్వంపై కృషి చేసే ఐక్యరాజ్యసమితి సంస్థ యూఎన్‌–ఉమెన్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డెరైక్టర్‌గా భారత సంతతికి చెందిన మహిళ అనితా భాటియా మేలో నియమితులయ్యారు. కలకత్తా లో బీఏ చదివిన అనిత వనరుల సమీకరణ, నిర్వహణలో నిష్ణాతురాలు.

10. ప్రమీల జయపాల్, అమెరికా తాత్కాలిక స్పీకర్‌

అమెరికా ప్రతినిధుల సభ తాత్కాలిక స్పీకర్‌గా ప్రమీల జయపాల్‌ జూన్‌లో సభా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియా అమెరికన్‌ మహిళగా ప్రమీల నిలిచారు.

11. షలీజా ధామీ, తొలి మహిళా ఫ్లయిట్‌ కమాండర్‌

వింగ్‌ కమాండర్‌ షలీజా ధామీ భారత వాయుసేనలో   తొలి మహిళా కమాండర్‌గా నిలిచారు. హెలికాప్టర్లను నడపడంలో ధామీకి 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది.

12. అంజలీ సింగ్, తొలి మహిళా సైనిక దౌత్యాధికారి

విదేశాల్లో భారత సైనిక దౌత్యాధికారిగా నియమితులైన తొలి మహిళగా వింగ్‌ కమాండర్‌ అంజలి సింగ్‌ రికార్డు నెలకొల్పారు. రష్యాలోని మాస్కోలో భారత రాయబార కార్యాలయంలో ‘డిప్యూటీ ఎయిర్‌ అటాచీ’గా అంజలి సెప్టెంబరులో బాధ్యతలు స్వీకరించారు.

మరిన్ని వార్తలు