ప్రతిభా మూర్తులు పోరాట యోధులు

27 Dec, 2019 00:50 IST|Sakshi

అవార్డు గుర్తింపును తెస్తుంది. అవార్డుకే గుర్తింపు తెచ్చారు ఈ మహిళలు. దాదాపు ప్రతి రంగంలోనూ.. ఈ ఏడాది నారీ శక్తి ప్రతిఫలించింది. పోరాట పటిమ ప్రస్ఫుటించింది. వీళ్ల స్ఫూర్తి కదిలిస్తుంది. ముందు తరాలనూ నడిపిస్తుంది.

1. దీపికారెడ్డి, నృత్యకారిణి

ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డికి ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. రాష్ట్రపతి భవన్‌లో ఫిబ్రవరి 6న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నుంచి ఆమె ఈ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన దీపికారెడ్డి గత 47 సంవత్సరాలుగా కూచిపూడి నాట్య రంగంలో సేవలను అందిస్తున్నారు. ‘దీపాంజలి’ పేరుతో నృత్య పాఠశాలను కూడా ప్రారంభించారు.

2. ప్రియాంక దూబే, పాత్రికేయురాలు

బీబీసీ ఢిల్లీ బ్యూరో ద్విభాషా వ్యాఖ్యాత, ప్రముఖ పాత్రికేయురాలు ప్రియాంక దూబే ప్రతిష్టాత్మక చమేలీదేవి జైన్‌ అవార్డు–2018కు ఎంపికయ్యారు. పరిశోధనాత్మక జర్నలిజంలో ఉత్తమప్రతిభ కనబరిచినందుకుగాను ప్రియాంకకు ఈ అవార్డు దక్కింది.

3. రాధా దేవి, మున్నుస్వామి శాంతి

టీటీడీ మహిళా క్షురకుల సంఘం అధ్యక్షురాలు కగ్గనపల్లి రాధాదేవి, ఇస్రో మహిళా శాస్త్రవేత్త మున్నుస్వామి శాంతిలకు ‘నారీశక్తి పురస్కారం’ లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీరికి ఈ అవార్డులను ప్రదానం చేశారు. మహిళా సాధికారతకు, లింగ సమానత్వానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా వీరికి ఈ అవార్డు దక్కింది.

4. జోఖా అల్‌హార్తి, రచయిత్రి

ఒమన్‌ రచయిత్రి జోఖా అల్‌హార్తి (40) మాన్‌ బుకర్‌ ప్రైజ్‌–2019 గెలుపొందారు.  ఆమె  రాసిన ‘సెలస్టియల్‌ బాడీ’ నవలకు ఈ ప్రైజ్‌ దక్కింది. ఈ అవార్డును గెలుచుకున్న తొలి అరబ్‌ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. బ్రిటన్‌ నుంచి 1951లో స్వాతంత్య్రం పొందాక ఒమన్‌లో చోటుచేసుకున్న మార్పులను, బానిసత్వ పరిస్థితులను ఈ నవలలో అల్‌హార్తి వర్ణించారు.

5. గ్రెటా థన్‌బర్గ్, ఉద్యమకారిణి

స్వీడన్‌కు చెందిన టీనేజ్‌ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ప్రతిష్టాత్మక మానవ హక్కుల పురస్కారం ‘అంబాసిడర్‌ ఆఫ్‌ కన్సైన్స్‌’ లభించింది. అలాగే ఆమె ‘రైట్‌ టు లైవ్‌లీహుడ్‌’ అవార్డుకు ఎంపికైంది. నోబెల్‌ శాంతి బహుమతికి కూడా నామినేట్‌ అయింది.

6. పి.టి. ఉష, అథ్లెట్‌

భారత మాజీ అథ్లెట్, దిగ్గజ ఒలింపియన్‌ పి.టి. ఉష అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఐఏఏఎఫ్‌) ప్రతిష్టాత్మక ‘వెటరన్‌ పిన్‌’ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో సుదీర్ఘ కాలం పాటు చేసే సేవలకు గుర్తింపుగా ఐఏఏఎఫ్‌ వెటరన్‌ పిన్‌ అవార్డును అందజేస్తారు. పి.టి. ఉష పూర్తి పేరు పిలావుళ్లకండి తెక్కేపఱంబిల్‌ ఉష.

7. అస్కా సలోమీ, ప్రిన్సిపాల్‌

ప్రభుత్వ వైద్యంలో నర్సింగ్‌ వృత్తిలో విశేష సేవలందించినందుకు అస్కా సలోమీకి ‘జాతీయ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ నర్సెస్‌ అవార్డు–2019’ లభించింది. అస్కా సలోమీ 2009లో గాంధీ నర్సింగ్‌ కళాశాల నుంచి ప్రధానాచార్యులుగా పదవీ విరమణ పొందారు.

8. పాయల్‌ జంగిడ్, సామాజిక కార్యకర్త

బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేసిన పాయల్‌ జంగిడ్‌కి బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ఇచ్చే ‘ఛేంజ్‌మేకర్‌–2019’ అవార్డు లభించింది. రాజస్థాన్‌లోని హిన్‌స్లా గ్రామానికి చెందిన 17 ఏళ్ల పాయల్‌.. బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు, ఆడపిల్లలు చదువుకునేందుకు కృషి చేస్తోంది.

9. ఓల్గా, పర్యావరణవేత్త

సాహితీ రంగంలో విశేషంగా చేసిన ప్రముఖ పర్యావరణ వేత్త, స్త్రీవాది, మేధావి, నవలా రచయిత్రి ఓల్గా టోర్కార్క్విజ్‌కు (పోలెండ్‌) నోబెల్‌ బహుమతి లభించింది. ఆమె రాసిన ‘ద బుక్స్‌ ఆఫ్‌ జాకోబ్‌‘ అనే నవలకు గానూ 2018 సంవత్సరానికి ఈ బహుమతి లభించింది. (గత ఏడాది అవార్డును ఈ ఏడాది ప్రకటించారు)

మరిన్ని వార్తలు