ప్రతిధ్వనించే పుస్తకం

22 Jan, 2018 01:19 IST|Sakshi
చలం

ఊర్వశి: ఏం చేశావు ఇన్నేళ్లు?
పురూరవుడు: యుద్ధాలు చేశాను. రాజ్యపరిపాలన చేశాను.
ఊర్వశి: ప్రేమించావా?

చలం రాసిన పురూరవ నాటకాన్ని మూడు ముక్కల్లో పరిచయం చేయాల్సివస్తే... ఇంతే. 
మనుషులు అధికారం కోసం ఏదేదో చేస్తారు. ‘ఏదీ చేసీ ఏది చెయ్యకా పోయిందేమీ లేదని గ్రహించరు’. అనవసరమైన దానికోసం బాధపడుతారు. ‘అసలు బాధలో అంత బాధ లే’దని తెలుసుకోరు. అసలైనది అందివచ్చినప్పుడు పోల్చుకోరు. ‘ఎన్నాళ్ళు? ఎప్పుడు? ఏం జరుగుతుంది? ఇట్లా ఆలోచిం’చి, ప్రశ్నలతో బుర్ర పాడుచేసుకుంటారు. ‘యోచనంత నిష్ఫలం ఏదీ లేదు’. లౌకిక ఆడంబరాలను వస్త్రాలుగా ధరిస్తారు. జ్ఞానం, పాండిత్యం అనుకునేవి ‘బుద్ధిహీనత’గా గ్రహించరు. భయం, రోగం, మృత్యువు, ఆకలి... వీటన్నింటినీ జయించగలిగే మార్గం ప్రేమ మాత్రమే. ప్రేమకు మించిన ఐశ్వర్యం లేదు. ప్రేమకు మించిన సత్యం లేదు. ప్రేమకు మించిన సౌందర్యం లేదు.

‘నేనే నీ లోకం. నేనే నీ అన్వేషణ. నేనే నీ అనుభవం. నానుంచే నీకు సమస్త సృష్టి రహస్యాలూ బోధపడుతాయి’ అంటుంది శాపవశాన భూమ్మీదకు వచ్చిన ఊర్వశి. ఇంకొకరు చెప్పడం వల్ల ఇది అర్థమయ్యేది కాదు. ‘మాటలతో నేర్చుకునేవి చాలా అల్పమైన విషయాలు’. కానీ ప్రేమ వూరికే వాంఛిస్తే వస్తుందా? ప్రేమ ముందు మోకరిల్లడం తెలియాలి. ప్రేమించడం ఒకరికి చేసే ఉపకారం కాదని తెలియాలి. ఆ యోగ్యత సంపాదించలేక, తన అహంకారపు చక్రవర్తితనాన్ని వదులుకోలేక, జీవితాన్ని ముక్కలుగా కాక మొత్తంగా చూడలేక, రంగులూ కాంతులూ లోకాలూ శ్రావ్యగాన మాధుర్యాలూ పరిమళాలూ అన్నీ తానైవున్న ఊర్వశిని అర్థం చేసుకోలేక, తనలో ఉన్న తననే తెలుసుకోలేక, ఊర్వశిని దూరం చేసుకుని విరహంతో కుమిలిపోయే పురూరవుడి వ్యథ ఇది. ‘వెళితే వెతుకుతావ్‌ వెయ్యేళ్లు’ అని ముందే హెచ్చరిస్తుంది ఊర్వశి. 

అసలైన శాంతికీ స్వేచ్ఛకూ ప్రతీక ఊర్వశి. దాన్ని అందుకోలేని క్షుద్రత్వానికీ అల్పత్వానికీ సూచిక పురూరవుడు. నాటకమంతా రెండు పాత్రల సంభాషణగానే సాగుతుంది. వాక్యాలన్నింటా కొత్త వెలుగూ గొప్ప చింతనా కనబడుతుంది. ప్రకృతి వర్ణన సున్నితంగా మనసును తాకుతుంది. చివర్లో శాపవిముక్తి అయిన ఊర్వశి దేవలోకానికి వెళ్లిపోతుంది. అసలైన శాపగ్రస్థుడిలాగా పురూరవుడు భూమ్మీద మిగిలిపోతాడు.
చలం సృజించిన మొత్తం సాహిత్యానికి ఒక ముందుమాటగా ఉంటుంది ‘పురూరవ’. చలం సాహిత్యంతో పరిచయం లేనివారు దీనితో మొదలుపెట్టొచ్చు. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు