ఆమె భార్య అయ్యాక

30 Sep, 2019 05:21 IST|Sakshi
డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ స్పెక్యులేషన్‌ – జెన్నీ ఓఫ్ఫిల్‌ 

కొత్త బంగారం

జెన్నీ ఓఫ్ఫిల్‌ రాసిన డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ స్పెక్యులేషన్‌–‘ఆమె’ ‘భార్య’ అవకముందు మొదలవుతుంది. కథకురాలూ ప్రధానపాత్రా అయిన ‘ఆమె’ అమెరికాలోని బ్రూక్లిన్‌లో తను చేపట్టిన చిన్న ఉద్యోగాలు, గుమ్మంలో నిలుచున్న బాయ్‌ఫ్రెండ్, అతడి బీరు సీసాలనుండి తను పీకేసిన లేబెళ్ళను గుర్తు చేసుకుంటుంది.

‘పెళ్ళి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. కళా రాక్షసిని అవుదామనుకున్నాను. వారికి కళ తప్ప, లౌకిక విషయాలు పట్టవు కనుక, స్త్రీలెప్పుడూ కళా రాక్షసులు కాలేరు. వ్లాదిమిర్‌ నబకోవ్‌ తన గొడుగునే మూసేవాడు కాదు. అతని స్టాంపులను అతని భార్య వీరా నాకి అతికించేది’ అనుకుంటుంది.

‘ఆమె’ కోసం రేడియో పాటలను పెట్టే ‘నీవు’ను కలుసుకుంటుంది. వారికి పెళ్ళవుతుంది. ‘మేము అరువు గదిలోకి చటాల్న దూరి, అరువు మంచంమీద పడ్డాం. మమ్మల్ని ప్రేమించేవారందరూ బయటున్నారు. ఒక ఇల్లు ఉండటం అంటే– కొంతమందినే ఇంట్లోకి రానిచ్చి, మిగతావారందరినీ బయటే పెట్టడం. ఇంటికి ఒక చుట్టుకొలత ఉంటుంది. కొన్నిసార్లు దాన్ని ఇరుగుపొరుగులూ, యహోవా సాక్షులూ అతిక్రమించేవారు’ అంటుంది ‘భార్య’.

వారిద్దరూ, ఒకరికి మరొకరు ఉత్తరాలు పంపుకునేవారు. తిరుగు చిరునామా ఎప్పుడూ ఒకటే అయుండేది, ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పెక్యులేషన్‌’. ‘అప్పటికి వారు చిన్నవారు, ధైర్యవంతులు, తమ భవిష్యత్తు గురించిన కలల మైకంలో ఉండేవారు’. కొద్దికాలంలోనే, తాము త్వరపడి సంబంధం ఏర్పరచుకున్నామేమో అన్న అనుమానం ఇద్దరికీ కలుగుతుంది. అయితే, వొంటరిగా ఉండటం ఇష్టంలేక, వారా సందేహాన్ని కొట్టి పారేస్తారు.

కూతురు పుట్టినప్పుడు ‘భార్య’ సంతోషపడుతుంది. అయితే, పిల్ల అరుపులూ, కేకలూ పెట్టే రకం అయినందువల్ల, తనను తీసుకుని బయటకు వెళ్ళడం కష్టమవుతుంది. పాప ప్రకాశవంతమైన ఫ్లోరోసెంట్‌ లైట్లు ఇష్టపడుతుందని తెలిసిన తరువాత, పక్కనున్న సూపర్‌ మార్కెట్‌కు తీసుకెళ్ళి, అక్కడే వీలయినంత సమయం గడుపుతుంది. ‘నీవు నన్ను ఆలోచించుకోనివ్వడం లేదు. ఒక్క నిముషంపాటు ఆలోచించుకోనియ్యేం’ అంటూ కూతుర్ని బతిమిలాడుతుంది. ‘కొందరు స్త్రీలు ఇంక తమకు పట్టని ఖరీదైన కోటును పక్కకి తోసేసినంత సులభంగా ఉద్యోగాన్ని వదిలేస్తారు’ అంటుంది– ప్రసవానికి ముందు సృజనాత్మక రచనల ప్రొఫెసర్‌ అయిన భార్య.

ఈ డైరీలాంటి రాతలు హెచ్చవుతూ, సంసార జీవితం కలిగించే స్థలభీతిని ఎక్కువ చేస్తాయి. పెళ్ళి, తల్లిదనం గురించిన భయాందోళనలను, తత్తరబాటును– సునిశితంగా వర్ణిస్తారు ఓప్ఫిల్‌. నీవుకు మరెవరితోనో సంబంధం ఉందని భార్యకు తెలుస్తుంది. భార్య, ఆ వేరే అమ్మాయిని నిలదీసినప్పుడు, తను ముందెలా ఉండేదో, అలాగే ఉన్న అమ్మాయిని భర్త ఎంచుకున్నాడని గ్రహిస్తుంది. ‘ఎవరికీ, ఏదీ చెప్పొద్దు. ఆమెకు ప్రాముఖ్యతనివ్వకు’ అని బంధువు సలహా ఇస్తుంది. ఈ స్థితికి తమని తెచ్చిన అడుగులని వెనక్కి లెక్కబెట్టుకుంటూ– ఏది పోయిందో, మిగిలినదేమిటో అని విశ్లేషించుకుంటూ, కాఫ్కా, కీట్స్‌ నుండీ – శిక్షించబడిన రష్యన్‌ వ్యోమగాముల వ] రకూ, అందరినీ వేడుకొంటుంది భార్య.

తమ సంబంధం చక్కబడ్డానికి జంట ఆ ప్రదేశం వదిలిపెడతారు. పోట్లాటలవుతూనే ఉంటాయి. కూతుర్ని స్కూల్లో చేర్పించి, జీవితంలో ఓడిపోయినట్టనిపించినప్పటికీ – భార్య  విధిని అంగీకరించడంతో 160 పేజీల పుస్తకం హఠాత్తుగా ముగుస్తుంది. నవలికలో ఉన్న అధ్యాయాలు 46. కొన్ని ఒకే ఆలోచనతో, గమనింపుతో నిండి ఉన్నవి. అతి తక్కువ పాత్రలున్న పుస్తకంలో, ఎవరికీ పేరుండదు. నవలికలా కాక, దానికోసం రాసిపెట్టుకున్న గమనికల్లాగా అనిపించే పుస్తకం, వంకరటింకర అంచులున్న ఆధునిక వివాహాన్ని చూపుతుంది. పెళ్ళి, గుర్తింపు కోసం అన్వేషణ అన్న ఇతివృత్తం కొత్తదేమీ కాకపోయినా, నిశితమైన గమనింపుతో రాసినది. ఈ నవలికను కాఫ్‌ బుక్స్‌ 2014లో ప్రచురించింది. ఓప్ఫిల్‌ రచయిత్రి, ఎడిటర్‌. కొలొంబియా, క్వీన్స్‌ విశ్వవిద్యాలయాల్లో ‘మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌’ బోధిస్తారు.
-కృష్ణ వేణి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా