ప్రతిధ్వనించే పుస్తకం

19 Mar, 2018 01:27 IST|Sakshi

కె.లలిత, వసంత కన్నబిరాన్, రమా మేల్కోటే, ఉమామహేశ్వరి, సూసీ తారూ, వీణా శత్రుఘ్న, ఎం.రత్నమాల  సంపాదకత్వంలో, స్త్రీ శక్తి సంఘటన ప్రచురణగా 1986లో వచ్చిన అద్భుతమైన పుస్తకం ‘మనకు తెలియని మన చరిత్ర (తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో స్త్రీలు)’. ఇది ‘చరిత్రలు సృష్టించినా పేరులేని స్త్రీలకూ,   పోరాటాలకూ’ అంకితం చేయబడ్డది. 

ఒక్క మానుకోట దొర జన్నారెడ్ది ప్రతాపరెడ్డికే ఒక లక్షా యాభైవేల ఎకరాల భూమి ఉన్న రోజులవి. నిజాం ప్రభుత్వంలోని ఖాసిం రజ్వీ, లాయఖ్‌ అలీ వంటి ముస్లిం మతాభిమానుల నాయకత్వంలో రజాకార్లూ, నిజాం పోలీసులూ, ‘ఖాల్సా’ భూములను నిజాం అనుగ్రహంతో స్వాధీనం చేసుకుని, దశాబ్దాల పర్యంతం తమ అధీనంలో ఉంచుకుని తెలంగాణా పేద ప్రజలను వెట్టి చాకిరితో, లెవీ ధాన్యం వసూళ్లతో అతి భయంకరంగా హింసిస్తూ సాగించిన దోపిడినీ, అణచివేతనూ ప్రతిఘటించడానికి 1940లలో స్థాపించబడ్ద కమ్యూనిస్ట్‌ పార్టీ పదమూడు ‘ఆంధ్ర మహాసభ’ల నిర్వహణతో జనాన్ని చైతన్యపరిచింది. 

ఈ ‘సంగాల్లో’ నిరక్షరాస్యులైన అనేకమంది స్త్రీలు నిర్వహించిన వీరోచిత పాత్ర గురించి చాలా మందికి తెలియదు. అటువంటి విస్మరించబడ్డ నారీమణుల చరిత్రలను... జీవిత అంతిమదశకు చేరిన ఒక్కొక్కరి దగ్గరికి వెదుక్కుంటూ వెళ్ళి వాళ్ల స్వంత భాషలో వాళ్ళ అనుభవాలను విని, టేపుల్లో రికార్డ్‌ చేసి, అక్షరాల్లోకి అనువదించి ఒక అశ్రుఘోషగా వెలువరించిన గ్రంథమిది. వరంగల్‌ కమలమ్మ, చాకలి ఐలమ్మ, ప్రమీల తాయి, సుగుణమ్మ, బ్రిజ్‌ రాణి, మల్లు స్వరాజ్యం, ప్రియంవద, కొండపల్లి కోటేశ్వరమ్మ, సూర్యావతి, జమాలున్నీసా బేగం, లలితమ్మ, అచ్చమాంబ, మోటూరి ఉదయం వంటి వీరవనితల గురించి చదువుతున్నపుడు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. దిక్కూ మొక్కూ లేని జనం విముక్తి కోసం వారు పడ్డ శ్రమ, తపన, చేసిన త్యాగాలు చూస్తే మనం వాళ్ళ వారసులమైనందుకు గర్వంతో పొంగిపోతాం.

– రామా చంద్రమౌళి 

మరిన్ని వార్తలు