మార్కేజ్‌ ‘రావణాయణం’

11 Nov, 2019 00:47 IST|Sakshi
గాబ్రియేలా గార్షియా మార్కేజ్‌ 

ప్రతిధ్వనించే పుస్తకం

కొలంబియన్లకు రామాయణం లాంటి ఇతిహాసం లేదు కాని, రావణుడు ఉన్నాడు. అతడే పాబ్లో ఎస్కోబార్‌. నల్లమందు ముఠా నాయకుడు. ఆ నల్ల మందును అమెరికాకు స్మగుల్‌ చేస్తాడు కాబట్టి, అగ్ర రాజ్యానికి అతడో రాక్షసుడు. ఎలాగైనా పట్టి నిర్జించాలన్నంతగా ఎస్కోబార్‌పై అమెరికా కత్తిగట్టింది. కొలంబియా పాలకులపై ఒత్తిడి తెచ్చి అన్నంత పనీ చేయించింది. పట్టలేదు కానీ మట్టుపెట్టించగలిగింది. అమెరికాకు దొరికిపోవటంకన్నా ప్రాణాలు విడవడమే సుఖం అనుకొన్న ఎస్కోబార్‌ కూడా తన పట్టుదలను నిలుపుకొన్నాడు. ఇలా విన్‌–విన్‌ పద్ధతుల్లో గాబ్రియెలా గార్షియా మార్కేజ్‌ రామాయణం ‘‘న్యూస్‌ ఆఫ్‌ ఎ కిడ్నాపింగ్‌’’ సుఖాంతమవుతుంది. 

ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసి ఎస్కోబార్‌ను అప్పగింతలు కోరితే కొలంబియా కాదంటుందా? చచ్చినట్టు అమెరికాతో నేరస్తుల  అప్పగింత ఒప్పందం చేసుకొంది. ఆ అప్పులేవో నేనే తీర్చేస్తా, ఒప్పందం రద్దు చేసుకోమని ఎస్కోబార్‌ ఆఫరిచ్చాడు. 1990ల నాటికి అతడు ప్రపంచంలోనే ఎనిమిదో కుబేరుడు. అయినా అతని మాట ప్రభుత్వం వినలా. రాయబారం నడిపాడు. అందుకు అమెరికా ప్రభావంలో ఉన్న సైన్యం ఒప్పుకోలా. చివరి అస్త్రంగా ఆ దేశ మీడియాను గుప్పిట్లో పెట్టుకొన్న బిగ్‌ షాట్స్‌ను కిడ్నాప్‌ చేయించాడు. దీంతో లోకం గగ్గోలు పెట్టింది. ఇప్పుడు నేరస్తుల అప్పగింత వ్యవహారంలో హాంకాంగ్‌లో కనిపిస్తున్న వాతావరణమే ఆనాడు కొలంబియాను ఆవరించింది. తన దేశంలో తాను కోరుకొన్న చోట, కోరుకొన్న పద్ధతుల్లో జైలును ఏర్పాటు చేసుకొన్న తర్వాతే బందీలను ఎస్కోబార్‌ వదిలేశాడు. అనంతర పరిణామాలలో నిరాయుధుడుగా ఉన్న ఎస్కోబార్‌ను సైన్యం కాల్చి చంపింది. 

ఈ వీరగాథను మెడిలిన్‌ అధోజగత్తు గానాల కొదిలేసి, మనమో ముఖ్యమైన అంశం వద్దకు వద్దాం. అదే కిడ్నాప్‌. సినిమాటిక్‌గానో, ఎ మోస్ట్‌ జస్టిసబుల్‌గానో కిడ్నాప్‌లను చూసే మన ఆలోచనలను మార్కేజ్‌ సమూలంగా మార్చివేస్తాడు. కిడ్నాప్‌ అంటే, అదేదో ఒక వైపు లావాదేవీ కాదు. అలాగని, కిడ్నాపర్లకో, బందీలకో, వారి ఆత్మీయులకో... లేదా గెరిల్లాలకో, ప్రభుత్వాలకో లేదా జాతి విముక్తికో, సరిహద్దు గొడవలకో సంబంధించిన వ్యవహారం కానే కాదు. కిడ్నాప్‌ అంటే లోపలా, బయటా తలుపులు బిగుసుకుపోయిన జీవి నిర్దయ పెనుగులాట! ఈ పెనుగులాటను మనలోనూ కలిగించడంలోనే మార్కేజ్‌ పనితనం అంతా దాగి ఉంది. లేదంటే న్యూస్‌ ఆఫ్‌ ఎ కిడ్నాపింగ్‌ అనే పేరుకు తగినట్టే ఇదొక ఫక్తు ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టిక్‌ రచనగానే మిగిలిపోయేది. కుటిలో, చీకటిలో చిక్కుకున్న కన్నుకు గుహాంతరాన మిణికే స్వేచ్ఛ ఎలా ప్రాణ శక్తి అయిందనేది చిత్రీకరించడం వల్లనే ఈ పుస్తకమింత వెలుగు పోసుకొన్నదనిపిస్తోంది. (న్యూస్‌ ఆఫ్‌ ఎ కిడ్నాపింగ్‌ సంక్షిప్త పరిచయం)
-రివేరా

మరిన్ని వార్తలు