ఒక భార్య మౌనజ్వలనం

1 Jun, 2020 00:45 IST|Sakshi

కొత్త బంగారం

పోలీసులు ఆ ఇంట్లోకి అడుగుపెట్టేటప్పటికి గేబ్రియల్‌ కాళ్లూ, చేతులూ కుర్చీకి కట్టేసి ఉన్నాయి. ఛిద్రమయి రక్తం కారుతున్న మొహం మీద, దూసుకెళ్లిన బుల్లెట్‌ గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి. అచేతనంగా ఉన్న అతని ముందు, నిశ్చేష్టురాలై శిలలాగా నిలుచునుంది అతని భార్య అలీష్యా బారెన్‌సన్‌. ఆమె మణికట్టు దగ్గర అయిన గాయాల నుంచి రక్తం స్రవిస్తోంది. ఒంటి మీదా, వేసుకున్న బట్టల మీదా రక్తపు మరకలు పచ్చిగానే ఉన్నాయి. హత్యాస్థలంలో నిర్విణ్ణురాలై ఉన్న ఆమె ఒక ప్రముఖ చిత్రకారిణి. హత్యకు గురైన ఆమె భర్త పేరుపొందిన ఫొటోగ్రాఫర్‌. అన్యోన్యంగా, హాయిగా సాగిపోతున్న వారి జీవితంలో ఈ హత్యోదంతం ఏమిటి? అక్కడ దొరికిన అతని గన్‌ మీద, ఆమె వేలి ముద్రలు ఉండటమేమిటి? ఆమే ఈ హత్య చేసిందా? అసలు జరిగిందేమిటి? ఆమె నుండి సమాచారం రాబట్టాలని ప్రశ్నించిన అధికారులు ఆమె నుంచి మౌనాన్ని తప్ప మరేమీ రాబట్టలేకపోయారు. మానసిక స్థితి సరీగ్గా లేదన్న అనుమానం మీద పోలీసులు ఆమెని మానసిక చికిత్సకి తరలిస్తారు. తన మౌనం గురించి అలీష్యా డైరీలో ఇలా రాసుకుంటుంది: ‘‘నేనెలా మాట్లాడగలను? గేబ్రియల్‌ నన్ను చచ్చిపొమ్మని శాసించాడు. చచ్చిపోయినవాళ్లు మాట్లాడరు.’’ సంఘటన జరిగిన కొద్ది రోజుల అనంతరం తనదే ఒక తైలవర్ణ చిత్రాన్ని గీసి, దానికి ‘ఆల్‌సెస్టెస్‌’ అని పేరు పెట్టడం మినహా, ఏళ్లు గడిచినా ఆమె నుంచి మరోమాట లేదు.

గ్రీకు పురాణాలలో ఎక్కువగా వినిపించే స్త్రీ పాత్ర ఆల్‌సెస్టెస్‌. చావుకు దగ్గరగా ఉన్న భర్త బ్రతకాలంటే ఎవరైనా ప్రాణత్యాగం చెయ్యాలని తెలుసుకున్న ఆల్‌సెస్టెస్‌ భర్త కోసం ప్రాణత్యాగం చేస్తుంది. తిరిగి బ్రతికి వచ్చిన ఆమె మూడురోజుల పాటు మౌనంగా ఉంటుందన్నది గ్రీకు కథ. ఆల్‌సెస్టెస్‌ మౌనానికి విమర్శకుల నుంచి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. మరి, తన చిత్రానికి ఆమె పేరు పెట్టిన అలీష్యా మౌనం దేనికి సంకేతం? 

సంచలనం సృష్టించిన అలీష్యా కేసును మొదటి నుంచీ గమనిస్తూ వస్తున్న ఫోరెన్సిక్‌ సైకొథెరపిస్ట్‌ థియో ఫేబర్, కొన్నేళ్ల తరవాత కూడా ఆమె మానసిక పరిస్థితిలో మార్పేమీ లేదనీ, ఇంకా మౌనంగానే ఉంటోందనీ తెలుసుకుంటాడు. అలీష్యా చేత మాట్లాడించి మామూలు మనిషిని చేస్తానని ఆమె చికిత్స పొందుతున్న హాస్పిటల్‌కి మానసిక వైద్య నిపుణుడిగా వెళ్తాడు. ఈ కేసు పట్ల థియో ప్రత్యేక ఆసక్తి ఏమిటి? చివరికి తేలిందేమిటి, తెలిసేదేమిటి? 

ఈ నవలకి థియో కథకుడు కావడం ఆసక్తి రేపుతుంది. మరో కథనం అలీష్యా డైరీ ద్వారా బహిర్గతమవుతుంటుంది. ఈ రెండు కథన ప్రవాహాలతో సాగే కథనం మొదట్లో చిక్కుముడిలాగానూ, పోనుపోనూ ఆసక్తికరంగానూ, చివరికి ఆశ్చర్యకరంగానూ ఉంటుంది. ‘‘పసితనంలో మనసుకయ్యే గాయం కాలక్రమేణా మరుగున పడినట్టు అనిపించవచ్చు. కానీ ఒక మాట, ఒక సంఘటన వల్ల అణగారిపోయిందనుకున్న బాధ, కోపం అగ్నిలాగా మళ్లీ ప్రజ్వరిల్లి వినాశనాన్ని సృష్టించగలదు,’’ అంటారు రచయిత ఒకచోట. బాల్యంలో ఎదురయ్యే పరిస్థితులూ, అవి చేసే మానసిక గాయాలూ జీవితగతిని మార్చేంతగా వ్యక్తిత్వాలని ప్రభావితం చేస్తాయన్నది కథలో ఒక ముఖ్యమైన కోణం. 
అవసరమైనంత మానసిక విశ్లేషణ, కావలసినంత ఉత్కంఠ నిండిన తన తొలి నవల ‘ద సైలెంట్‌ పేషెంట్‌’తోనే పాఠకలోకాన్ని విశేషంగా ఆకట్టుకున్నారు బ్రిటిష్‌ రచయిత ఆలెక్స్‌ మెకలీడస్‌. 2019లో పబ్లిష్‌ చేసిన కెలడాన్‌ బుక్స్‌కీ ఇది తొలి నవలే! అనవసరమైన అంశాలను కథనంలోకి జొరబడనివ్వకపోవడానికి సినిమాలకి స్క్రీన్‌ప్లే రాసిన అనుభవం రచయితకి ఉపయోగపడింది. అది అతని కథాకథన నిపుణతలోనూ ప్రతిఫలిస్తుంది. సైప్రస్‌లో పెరగటం వల్ల తనకు గ్రీక్‌ పురాణాలతో పరిచయం సహజంగా జరిగిందనీ, ఆల్‌సెస్టెస్‌ మౌనం తనని చాలా ఆలోచింపజేసిందనీ అంటారు ఆయన. ఆల్‌సెస్టెస్‌ తన ప్రాణత్యాగాన్ని భర్త అడ్డుకుంటాడని ఆశించిందా? అలా జరగకపోవడం వల్ల భంగపడి, హృదయం పగిలి, మూగబోయి మౌనంగా ఉండిపోయిందా అనే ఆలోచనకూ తావిస్తుంది నవల. చివరి పేజీల్లో అనూహ్యమైన మలుపు తిరిగి చదువరిని విభ్రాంతికి గురిచేసే ఇది చదవదగ్గ నవల!  - పద్మప్రియ

నవల: ద సైలెంట్‌ పేషెంట్‌
రచన: అలెక్స్‌ మెకలీడస్‌
ప్రచురణ: 2019 

మరిన్ని వార్తలు