ఈశ్వర విలాసాన్ని ప్రశ్నించే నవల

25 May, 2020 00:47 IST|Sakshi
థార్న్‌టన్‌ వైల్డర్

ప్రతిధ్వనించే పుస్తకం 

ఒక ఘటన జరగడానికి గల మహత్తర కార్యకారణ సంబంధాలు ఏమివుంటాయనే ప్రశ్నను శోధించే నవల ‘ద బ్రిడ్జ్‌ ఆఫ్‌ సాన్‌ లూయిస్‌ రే’. దీని రచయిత అమెరికాకు చెందిన థార్న్‌టన్‌ వైల్డర్‌ (1897–1975). పెరూ దేశంలోని లైమా, కుజ్‌కో మధ్య ఉన్న స్తంభాల వంతెన ఉన్నట్టుండి విరిగి, ఆ వంతెన మీద నడుస్తున్న ఐదుగురు వ్యక్తులు అగాధంలో పడి చనిపోయారు. అదే సమయంలో అటువైపే నడిచి వస్తున్న ఒక మతగురువు ఈ దృశ్యాన్ని చూసి, ఇదేలాగ ఈశ్వర విలాసానికి నిదర్శనమని తలపోస్తాడు. ఆ ఐదుగురి జీవితాల గురించి అన్వేషిస్తాడు. వారి అంతఃప్రవృత్తులను, ఉద్వేగాలను తెలుసుకుంటాడు. ఈ నేపథ్యంతో 1927లో ఈ నవల రాశారు థార్న్‌టన్‌. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ నవల ఆ తరువాతి సంవత్సరం పులిట్జర్‌ ప్రైజ్‌ కూడా గెలుచుకుంది. దీన్ని దక్షిణ భాషా పుస్తక సంస్థ సహకారంతో దేశి కవితామండలి 1958లో తెలుగులో ‘కూలిన వంతెన’గా ప్రచురించింది. నండూరి విఠల్‌ అనువదించారు. ‘బలీయమైన గ్రీకు విషాదాంత రచనలకు చెందినది ఈ గ్రంథం. ఇది మనలో అత్యంత భీతావహాన్ని, అనుకంపనను రేకెత్తించి మనలను క్షాళితం చేస్తుంది. అంతేకాదు, విప్పిచెప్పబడిన వ్యక్తిగత విషాదాల తాలూకు మహత్తరమైన, ఎన్నటికీ చెరిగిపోని, చెరపరాని ముద్రను మన మనస్సుల్లో విడిచి వెడుతుంది’ అంటారు ఈ పుస్తకానికి పరిచయం రాసిన ఎస్‌.కె.చెట్టూర్‌.

మరిన్ని వార్తలు