ప్రతిధ్వనించే పుస్తకం.. పనికొచ్చే కథలు

19 Nov, 2018 00:42 IST|Sakshi

మన్నవ గిరిధరరావు, గుంటూరు హిందూ కళాశాలలో రాజనీతి శాస్త్రాన్ని బోధించారు. ఉపాధ్యాయ వర్గం తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలికి 1968–74 మధ్య ప్రాతినిధ్యం వహించారు. యువభారతి, భారతీయ మార్గము మాసపత్రికలకు సంపాదకత్వం వహించారు. వృత్తి రీత్యా, వ్యావృత్తి రీత్యా అనేక గ్రంథాలు, పత్రికలు చదవవలసి రావటంతో, వారు జ్ఞాపకార్థం రాసుకున్న నోట్సులను అవసరం తీరాక పారేయకుండా వాటిని పిట్టకథలుగా ఒక సంకలనంగా తీసుకు వస్తే బాగుంటుందనే సలహాతో 1985లో మొదటిసారి 116 పిట్టకథలతో ఈ పనికొచ్చే కథలని వెలుగులోకి తెచ్చారు. నా దగ్గరిది 2003 నాటి ఐదవ ముద్రణ. ఇందులో మరో వంద చేరి 218 అయినాయి.
అమెరికా శాస్త్రవేత్త ఇసిడార్‌ ఐజాక్‌ రాబి 1944లో తన 46వ ఏట ఫిజిక్స్‌లో నోబెల్‌ అందుకున్నారు. ఆ సందర్భంగా తనని కలసిన పాత్రికేయులతో ఇలా చెప్పారు: ‘నా ఉన్నతికి కారణం మా అమ్మ. ఆమె నాకు పాఠాలు చెప్పలేదు, హోంవర్క్‌ చేయించలేదు. బడి నుంచి రాగానే ‘ఈ వేళ మీ మాష్టారును అడిగి ఏవైనా తెలియని విషయాలు తెలుసుకున్నావా?’ అని అడిగేది. మాష్టారుని ప్రశ్నించాలంటే, మర్నాడు చెప్పబోయే పాఠం ఆయన కన్నా ముందు నేను చదువుకొని అర్థం చేసుకోటానికి ప్రయత్నించి, ఆ సందర్భంలో ఎదురైన అడ్డంకులని ప్రశ్నలుగా సంధిస్తే నాకు ఇటు చదువూ వస్తుంది, అటు అమ్మ ముందు అబద్ధాలాడకుండా అమ్మ కోరిక నిజాయతీగా తీర్చిన వాడినీ అవుతాను’.
కాశీమజిలీల నాటి రోజుల్లో మైళ్ళ కొలదీ నడచి వస్తున్న ఓ బాటసారికి మర్రి చెట్టు కనబడేసరికి సేదతీరాలనిపించి,  చుట్టుపక్కలా శుభ్రం చేయసాగాడు. అంతటి మర్రిమానుకి చిన్న చిన్న పళ్ళు, బాటంతా విస్తరించి ఉన్న గుమ్మడి తీగకి పెద్ద పెద్ద కాయలు... దేవుడి తెలివి తక్కువతనానికి నవ్వుకుంటూ విశ్రమించాడుట. మెలకువ వచ్చేసరికి తన మీద పడివున్న మర్రిపళ్ళని చూసుకుని, తెలివితక్కువతనం భగవంతునిది కాదు, తనదని చెంపలు వాయించుకున్నాట్ట!
ఒక ప్రత్యేకమైన జాతి కందిరీగ ఒకటి ఉన్నది. ఆ ఆడ కందిరీగ జీవితంలో ఒకేసారి గుడ్లను పెడుతుంది. మరొకసారి పెట్టక పోవటానికి కారణం: గుడ్లు పెట్టిన కొద్ది సేపటిలో అది చనిపోవాలి. పుట్టిన పిల్లలని కళ్ళారా చూసుకునే యోగం దాని ముఖాన ఎందుకు లేదో! ఐనా గుడ్డు పగుల కొట్టుకుని బయటకు వచ్చే పిల్లలకి ఇంగిత జ్ఞానం వచ్చే వరకూ బతకటానికి అవసరమైన ఆధరవుని ఏర్పరచి మరీ చచ్చిపోతుందట. గుడ్లు పెట్టబోయే సమయం ఆసన్నం కాబోతున్నదని శారీరకంగా పొడసూపగానే ఆ కందిరీగ చేరువలో దొరికే మిడుతను పూర్తిగా చంపకుండా ఆయువు పట్టున మాడుపగిలేలా కొట్టి, అచేతనావస్థ/కోమాలో ఉన్న దాన్ని తెచ్చి, పిల్లల్లో కాస్త కదలిక కలగగానే నోటికి అందేలా దీన్ని ఉంచుతుందిట. కోమాలో ఉన్న ఈ మాంసపు ముద్దని, పళ్ళు, గోళ్ళు ఇంకా రాని ఆ పసి కందులు ఎడాపెడా చిన్నాభిన్నం చేయకుండా నెమ్మదిగా చప్పరిస్తూ బతికి బట్టకడతాయట.
ఇట్లాంటి పనికొచ్చే సంగతులెన్నో పుస్తకంలో ఉన్నాయి. 
సాయి పీవీఎస్‌

మరిన్ని వార్తలు