అజొల్లాతోనే దేశీ వరి సాగు!

12 Jun, 2018 03:56 IST|Sakshi
వరి మడుల్లో అజొల్లా, డా. అనుపమ్‌ పాల్‌

హరిత విప్లవం రాకతో దేశీ వంగడాలు, పద్ధతులు, పంటల వైవిధ్యం ప్రాభవాన్ని కోల్పోయాయి. సంకరజాతి వంగడాలు, రసాయనిక ఎరువులు, పురుగుమందుల రాకతో తొలినాళ్లలో కళ్లు చెదిరే దిగుబడులు వచ్చాయి. కానీ కాలక్రమంలో తిరిగి సేంద్రియ విధానంలో సంప్రదాయ వంగడాల సాగే రైతుకు ఆశాదీపం అంటున్నారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ అనుపమ్‌ పాల్‌. కేవలం అజొల్లాతోనే దేశీ వరి వంగడాల సాగును చేపట్టవచ్చని ఆయన అంటున్నారు.

దేశీ వరి వంగడాలతో దిగుబడులు తక్కువనే విస్తృత ప్రచారంతో వాటి ఊసే రైతులు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఈ దశలో పశ్చిమ బెంగాల్‌లోని ఫూలియా వ్యవసాయ శిక్షణా కేంద్రం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనుపమ్‌ పాల్‌ దేశీ వరి వంగడాల పరిరక్షణకు నడుం బిగించారు. 400 రకాలకు పైగా సంప్రదాయ వరి వంగడాలను సేకరించి, సాగు చేస్తూ సంరక్షిస్తున్నారు.  తద్వారా ఈ వంగడాలను తిరిగి రైతులకు అందిస్తున్నారు. కేవలం అజొల్లాతోనే సేంద్రియ విధానంలో దేశీ వరి వంగడాల సాగుపై రైతులకు శిక్షణ నిస్తున్నారు.

నదియా జిల్లాలోని ఫులియా వద్ద గల వ్యవసాయ శిక్షణా కేంద్రంలో 400 రకాల సంప్రదాయ వరి వంగడాలను సాగు చేస్తున్నారు. 15 రోజుల నారును పొలంలో నాటుకుంటారు. అంతకు ముందునుంచే విడిగా మడుల్లో నిల్వ కట్టిన నీటిలో అజొల్లా అనే నాచును పెంచుతూ ఉంటారు. నాట్లు వేసుకున్న 25 రోజులు తర్వాతనే వరి పొలంలో నీటిపైన అజొల్లా చల్లుతారు. ఇతరత్రా ఎలాంటి రసాయన ఎరువులే కాదు సేంద్రియ ఎరువులు పంటలకు అందించరు. గాలిలో 78 శాతం ఉండే నత్రజనిని అజొల్లా గ్రహించి, మొక్కలకు అందిస్తుంది.

పులియా వ్యవసాయ క్షేత్రంలోని మాగాణి భూమిలో ప్రధాన పోషకాలు చాలా తక్కువగా ఉన్నాయట. పీహె చ్‌ 7 శాతం, సేంద్రియ కర్బనం  0.6–0.8 వరకు ఉంది. రసాయనాలు వాడకపోవడం వల్ల నేల సారవంతమై.. సంప్రదాయ వంగడాలతో మంచి దిగుబడులు రావటం విశేషం. డాక్టర్‌ అనుపమ్‌ పాల్‌ ఇలా అంటారు.. ‘మేము పూలియాలోని వ్యవసాయ శిక్షణ కేంద్రంలో సంప్రదాయ వరి వంగడాలను సాగు చేస్తున్నాం. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు, ఇతర సేంద్రియ ఎరువులు వాyýటం లేదు.

కేవలం అజొల్లాను మాత్రమే ఎరువుగా వాడుతున్నాం. ఎకరాకు 32 బస్తా(75 కిలోలు)ల ధాన్యం దిగుబడి వస్తోంది. గత పదిహేనేళ్లుగా ఇదే విధానంలో వరిని సాగు చేస్తున్నాం. దేశీ వరి వంగడాలను కేవలం దిగుబడి కోణంలో మాత్రమే చూడకూడదు.  ‘ఐలా’ తుపాను సృష్టించిన విలయాన్ని కూడా తట్టుకొని నిలబడటం కేవలం సంప్రదాయ వరి రకాలకు మాత్రమే సాధ్యమైంది. 90–110 రోజుల్లోనే కోతకు వచ్చే స్వల్పకాలిక సంప్రదాయ వరి వంగడాలు వెయ్యి వరకు ఉన్నాయి. ఒక కొత్త వంగడాన్ని అభివృద్ధి చేస్తే దాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు చాలా డబ్బు ఖర్చు చేస్తారు. విస్తృత ప్రచారం కల్పిస్తారు.

కానీ వీటిలో ఏ ఒక్క రకం కూడా పోషకాలు, పంట నాణ్యత, నాణ్యమైన గ్రాసం, తీవ్ర ప్రతికూల పరిస్థితులను తట్టుకోవటం వంటి అంశాల్లో సంప్రదాయ వంగడాలకు సాటి రాగలవి లేవు. సంప్రదాయ వరి వంగడాల విలువను, ఆవశ్యకతను గుర్తెరిగిన రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తున్నాం. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రవ్యాప్తంగా 26 విత్తన కేంద్రాలను దీనికోసం ఏర్పాటు చేశాం. సంప్రదాయ వరి వంగడాలను సాగు చేయటం, వాటి జన్యువులను గుర్తించటం, విత్తనోత్పత్తిని చేపట్టటం వంటి పనులను  ఆటవిడుపుగానో వినోదం కోసమో మేము చేయటం లేదు. విజ్ఞాన శాస్త్రం, జీవ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన వంగడాల కన్నా సంప్రదాయ వంగడాలు అనేక అంశాలలో మెరుగైనవి కాబట్టే వాటిపై మేం దృష్టి సారించాం’ అన్నారు డా. అనుపమ్‌ పాల్‌.

>
మరిన్ని వార్తలు