జీలుగ చేనులో నేరుగా వరి!

22 May, 2018 05:13 IST|Sakshi

పంజాబ్‌లో ప్రయోగం విజయవంతం

దుక్కి చేసుకున్న పొలంలో వరి విత్తనాన్ని ట్రాక్టర్‌కు అనుసంధానించిన సీడ్‌ డ్రిల్‌తో నేరుగా విత్తడం(డైరెక్ట్‌ సీడింగ్‌) తెలిసిందే. వరి సాగులో శ్రమను, ఖర్చును చాలా వరకు తగ్గించడానికి.. కాలువ నీరు ఆలస్యంగా వచ్చినప్పుడు సీజన్‌ దాటిపోకుండా చూడటానికి.. వరి నాట్ల కాలంలో కూలీల కొరతను అధిగమించడానికి కూడా ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. అయితే, పచ్చి రొట్ట ఎరువు పంటైన జీలుగను విత్తి 25 రోజుల తర్వాత.. అదే పొలంలో నేరుగా వరి విత్తనాన్ని విత్తుకునేందుకు ఉపకరించే హేపీ సీడర్‌ను పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించింది. ప్రెస్‌ వీల్‌ టెక్నాలజీతో ఈ హేపీ సీడర్‌ తయారైంది. వరి విత్తనాన్ని భూమిలో సాళ్లుగా వేయడంతోపాటు.. జీలుగ మొక్కలు ముక్కలు ముక్కలై వరి సాళ్ల మధ్య ఆచ్ఛాదనగా వేయడం హేపీ సీడర్‌ ప్రత్యేకత.

పంజాబ్‌లోని ముక్త్‌సర్‌ జిల్లా గోనియాన కృషి వికాస కేంద్రంలో 2016 రబీలో దీన్ని తొలిగా పరీక్షించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని కేవీకే అసోసియేట్‌ డైరెక్టర్‌ (శిక్షణ) డాక్టర్‌ నిర్మల్‌జిత్‌ సింగ్‌ ధాలివాల్‌ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. 2017లో 80 ఎకరాల్లో దీని ద్వారా నేరుగా వరి విత్తనాన్ని విత్తినప్పుడు కూడా మంచి ఫలితాలు వచ్చాయి. పంజాబ్‌లో రైతులు విరివిగా వాడుతున్నారు. ప్రెస్‌వీల్‌ టెక్నాలజీతో కూడిన ఈ సీడ్‌ డ్రిల్‌తో రోజుకు 6–7 ఎకరాలు విత్తవచ్చు. ఖరీదు రూ. 2 లక్షల వరకు ఉంటుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కృషి విజ్ఞాన కేంద్రాలు దీన్ని ప్రయోగాత్మకంగా వినియోగించదలచుకుంటే తాము సాంకేతిక సహాయాన్ని అందిస్తామని డా. నిర్మల్‌జిత్‌ సింగ్‌ (98556 20914) చెప్పారు. kvkmuktsar@pau.edu

మరిన్ని వార్తలు